పదేళ్ల పిల్ల...మాకేం కావాలో మాకు తెలుసంది..!
పెద్దలు చెబితే పిల్లలు వినాలి….అనేది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు లాంటి సత్యం కాదు. అదొక జనాభిప్రాయం. అందుకే కాలానుగుణంగా అది మారుతూ ఉంటుంది, లేదా ఎవరో ఒకరు దాన్ని మారుస్తూ ఉంటారు. పుణెకి చెందిన పదేళ్లపాప ఇషితా కాత్యాల్ ఇందుకు నిదర్శనం. ఈ చిన్నారి, మాకూ సృజనాత్మకంగా ఆలోచించడం తెలుసు, మాకేం కావాలో మాకు తెలుసు అంటోంది. ఇరవై ఏళ్లొచ్చిన కొడుక్కి గోరుముద్దలు తినిపించే తల్లులున్న సమాజం మనది. కాబట్టి ఇషిత మాటలు కాస్త షాకింగ్‌గానే ఉంటాయి. […]
పెద్దలు చెబితే పిల్లలు వినాలి….అనేది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు లాంటి సత్యం కాదు. అదొక జనాభిప్రాయం. అందుకే కాలానుగుణంగా అది మారుతూ ఉంటుంది, లేదా ఎవరో ఒకరు దాన్ని మారుస్తూ ఉంటారు. పుణెకి చెందిన పదేళ్లపాప ఇషితా కాత్యాల్ ఇందుకు నిదర్శనం. ఈ చిన్నారి, మాకూ సృజనాత్మకంగా ఆలోచించడం తెలుసు, మాకేం కావాలో మాకు తెలుసు అంటోంది. ఇరవై ఏళ్లొచ్చిన కొడుక్కి గోరుముద్దలు తినిపించే తల్లులున్న సమాజం మనది. కాబట్టి ఇషిత మాటలు కాస్త షాకింగ్‌గానే ఉంటాయి. ఇంతకీ ఎవరీ ఇషిత…ఆమె ఏంచేసింది? అనే వివరాల్లోకి వెళితే-
టెడ్ అనేది న్యూయార్క్‌నుండి పనిచేస్తున్న ఒక గ్లోబల్ కమ్యునిటీ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృజనాత్మక ఆలోచనాపరులను, మేధావులను ఏకం చేసేందుకు ఏర్పడిన వేదిక. ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్ దేశాల్లో వంద భాషల్లో పలువురు మేధావులు టెడ్ వేదికల మీద మాట్లాడుతున్నారు. తొలుత టెడ్‌ని (టిఇడి) టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్, డిజైన్ అంశాలపై మాట్లాడేందుకు ఏర్పాటు చేసినా ఇప్పుడు ఈ వేదిక మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు అన్నిరకాల సబ్జక్టులను చర్చిస్తున్నారు. పద్దెనిమిది నిముషాల్లో సూటిగా స్పష్టంగా ఉంటాయి ఈ టెడ్ టాక్స్. భిన్నమైన ఆలోచనా ధోరణులు, సృజనాత్మకత, పలు సమస్యలకు ప్రాక్టికల్ పరిష్కారాలు టెడ్ టాక్స్‌లో విస్తృతంగా వినబడుతుంటాయి.
పిల్లల్ని ఎవరైనా పెద్దయ్యాక ఏమవుతావు…అని అడుగుతుంటారు. అలాంటివారికి గట్టి సమాధానం చెప్పింది ఇషిత. పెద్దయ్యాక సరే, ఇప్పుడు మాకేం కావాలో తెలుసుకోండి…అంటున్నదామె. టెడ్‌వేదిక మీద ఇవే అంశాలతో సాగిన తన ప్రసంగంలో…. పిల్లలు సైతం ఎంతో సృజనాత్మకంగా భిన్నంగా ఆలోచించగలరని, వారికి ఏంకావాలో వారికి తెలుసునని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏ మాత్రం తడబాటు లేకుండా, ఒక్క క్షణం కూడా ఆగకుండా తాను చెప్పదలచుకున్నది సూటిగా అనర్ఘళంగా చెప్పింది. చేతిలో పేపరుకూడా లేకుండా చెప్పాల్సి రావడంతో తాను భయపడినట్టుగా ఇషిత తల్లి నాన్సీ కాత్యాల్ అన్నారు. ప్రసంగం అయిపోగానే తనకు చాలా సంతోషంగా అనిపించిందని, తాను ఏం చెప్పాలనుకున్నదో దాన్ని యధాతథంగా చెప్పగలిగానని ఇషిత చెబుతోంది. తాను అమెరికాలో స్పీచ్ ఇచ్చినపుడు భారత్‌లో టైం అర్థరాత్రి దాటిందని, అయినా తన స్నేహితులు, బంధువులు అప్పుడే ఫోన్‌చేసి తనకు అభినందనలు చెప్పారని ఆమె చెబుతోంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకోసం తాను పనిచేయనున్నట్టుగా, లైఫ్‌స్కిల్స్‌ని నేర్పడం ద్వారా వారు నిర్భయంగా ముందుకు అడుగేసేలా చేయాలనే ఆశయంతో ఉన్నానని ఇషిత అంటోంది.
నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అనే ప్రశ్నకు కూడా ఇషిత వద్ద కచ్ఛితమైన ఆన్సర్ ఉంది. తన ఎనిమిదేళ్ల వయసులోనే ఆమె సిమ్రాన్స్ డైరీ అనే పుస్తకాన్ని రాసింది. సమ్మర్ హాలిడేస్‌లో రాసిన ఈ పుస్తకాన్ని అమెజాన్స్ కిండెల్ స్టోర్, పాట్రిడ్జ్ పబ్లిషర్స్ ప్రచురించారు. ఇందులో ఇషిత పిల్లల మనసుల్లో ఉన్న ఆలోచనలను గురించి రాసింది. వాటిని ప్రపంచం ఎందుకు సీరియస్‌గా తీసుకోవాలో కూడా చెప్పింది.
మొదట్లో స్కూలు, హోంవర్కులు, తన రచనలు, టెడ్ ఎక్స్ నిర్వహణ వీటన్నింటికీ సమయం సరిపోయేది కాదని, తండ్రి సలహా మేరకు అయిదుగంటలకే నిద్రలేస్తున్నానని ఇషిత చెబుతోంది. చేయాల్సిన పనులన్నింటినీ రాసుకుని, చేసుకుంటూ పోతున్నాని కూడా చెబుతోంది. మొత్తానికి ఇషిత, పిల్లలను తమ పెంపుడుజంతువుల్లా కాక మనుషుల్లా చూడాలని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు… మొత్తం సమాజానికి స్పష్టంగా చెప్పింది.