కోపాన్ని ఇలా ఆపుదాం..!
కోపం…మహాచెడ్డ గుణం. మనకు మనమే హాని చేసుకునేలా చేసే లక్షణాల్లో కోపం మొదటిది. నిజానికి భయంకరమైన ప్రాణాంతకమైన వ్యసనాల కంటే ఒక్కోసారి కోపం మనకు మరింత హాని చేస్తుంది. వ్యసనాల్లాగే దీన్ని వదిలించుకోవడమూ చాలా కష్టం. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తికి అత్యంత సన్నిహితులు అనదగ్గవారు తక్కువగా ఉంటారు. కోపిస్టులంతా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కోపంతో ఉన్నపుడు ఎవరైనా ఇతరులపై వ్యతిరేకతనే కుమ్మరిస్తారు. ఈ ప్రపంచంలో ఎవరూ ఇతరుల వ్యతిరేకతని, అయిష్టాన్ని భరించాలని అనుకోరు. అంటే […]
కోపం…మహాచెడ్డ గుణం. మనకు మనమే హాని చేసుకునేలా చేసే లక్షణాల్లో కోపం మొదటిది. నిజానికి భయంకరమైన ప్రాణాంతకమైన వ్యసనాల కంటే ఒక్కోసారి కోపం మనకు మరింత హాని చేస్తుంది. వ్యసనాల్లాగే దీన్ని వదిలించుకోవడమూ చాలా కష్టం. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తికి అత్యంత సన్నిహితులు అనదగ్గవారు తక్కువగా ఉంటారు. కోపిస్టులంతా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కోపంతో ఉన్నపుడు ఎవరైనా ఇతరులపై వ్యతిరేకతనే కుమ్మరిస్తారు. ఈ ప్రపంచంలో ఎవరూ ఇతరుల వ్యతిరేకతని, అయిష్టాన్ని భరించాలని అనుకోరు. అంటే ఎంత కోపం పెరుగుతుంటే అంతగా మనం ఒంటరులం అవుతున్నట్టుగా భావించాలి…మనిషి జీవితాన్ని ఇంతగా కుచించుకుపోయేలా చేసే కోపం, మనిషి జీవితమంత విశాలం… అమ్మమీద అలిగి బొమ్మ విసిరేసే పసితనం నుండి జవసత్వాలు ఉడిగిపోయిన వృద్ధాప్యం వరకు అది మనతోనే ఉంటుంది మరి.
భరించేవాడికంటే వ్యక్తం చేసేవాడికే ఎక్కువ హానిని కలిగించే కోపాన్ని నియంత్రించుకోవాలనే అనుకుంటారు చాలామంది…కానీ విఫలమవుతుంటారు. అలాంటివారికోసం కోపాన్ని ఆపుకునేందుకు పనికొచ్చే చిన్నపాటి సూచనలు…అంటే యాంగర్ మేనేజ్‌మెంట్ టిప్సన్నమాట-
- ఒక వివాదంలో ఎదుటివారు మనల్ని రెచ్చగొడుతున్నపుడు, కోపం తన్నుకు వస్తున్నపుడు ముందుగా చేయాల్సిన పని మౌనంగా ఉండటం. ఎట్టి పరిస్థితుల్లోనూ మాటలను పెంచకుండా ఉండాలి. పదునైన మాటల ద్వారా మనసులను కోసుకుంటూ దూసుకువెళ్లే కోపాన్ని పెదవుల చాటున బిగపట్టవచ్చు. ఈ మౌనాన్ని ఓడిపోవడంగా భావించనక్కర్లేదు, ఇది ఎదుటి వ్యక్తిమీద గెలుపే అవుతుంది.
- కోపం అనేది అత్యంత ప్రమాదకరమైన భావోద్వేగం. దీని వేగం క్షణాల్లో పెరిగిపోతుంటుంది. అంతేవేగంగా మనలో ఆలోచనలు హరించుకుపోతుంటాయి. కోపంతో ఊగిపోతున్నపుడు ఎదుటివారి మాటలకు రియాక్టవడం తప్ప మెదడు మరేపనీ చేయలేదు. వినడానికి చైల్డిష్‌గా అనిపిస్తున్నా ఇలాంటపుడు ఒక చిన్న చిట్కా చక్కగా పనిచేస్తుంది. కోపంతో ప్రతిస్పందించాల్సి వచ్చినపుడు వెంటనే కళ్లు, చెవులూ మూసేసుకోవాలి. ఎదుటి వ్యక్తి వాదనలు, శరీర కదలికలు వినకుండా, చూడకుండా ఉండగలిగితే మనలో ప్రతిస్పందన తగ్గుతుంది. కాస్త శాంతి దొరుకుతుంది. మెదడు పనిచేయడం మొదలుపెడుతుంది. ముందు ఉవ్వెత్తున్న లేచిన ఒక ఆవేశ తరంగాన్ని నిగ్రహించినవారిమవుతాం.
- అక్కడి పరిస్థితి కి కారణం మనం కాకపోయినా, ఆగ్రహావేశాలు పెరుగుతున్న సందర్భంలో ఆ ప్రదేశాన్ని విడిచివెళ్లిపోవడం మంచిది. కోపాన్ని ప్రదర్శించడం కంటే సమస్య పరిష్కారం ముఖ్యమన్న స్పష్టత ఉంటే ఇది సాధ్యమవుతుంది. చిట్టచివరిగా మీరు చెప్పాలనుకున్నదేదో వాదన మొదలయినప్పుడే చెప్పేసి అక్కడి నుండి నిష్క్రమించాలి.
- ధ్యానం మనలోని కోపగుణాన్ని తగ్గిస్తుంది. కొంతకాలం పాటు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వలన మనలో మనోశక్తి, అంటే మెదడుకి వ్యతిరేక పరిస్థితులకు తట్టుకునే శక్తి పెరుగుతుంది. దాంతో కోపం వచ్చే పరిస్థితుల్లో దాన్ని ఆపి నిర్మాణాత్మకంగా ఆలోచించగలుగుతాం.
- కోపంలో ఉన్నపుడు మనిషి విచక్షణని కోల్పోతాడు అని చెప్పుకుంటాం. కానీ ఎంత కోపంలో ఉన్నా మనిషి తనకంటే ఎక్కువ అధికారంలో ఉన్నవాడిని, తనకు హాని చేస్తాడనే భయం ఉన్నవాడిని, కోపం చూపిస్తే తనను నష్టపరుస్తాడనుకున్నవాడినీ తిట్టడు. అదేవిధంగా తనకంటే తక్కువ అనుకున్నవాడిపై అనవసర కోపం, అధికకోపం దూసుకువస్తాయి. దీన్నిబట్టి ఎంత కోపంలో ఉన్నా మనలో తెలివి అనే స్పృహ ఉంటుంది. అలాంటి స్పృహతోనే ఒక విషయం ఆలోచించాలి. ఇంతకోపం ఇప్పుడు అవసరమా…అని. అలా ఆగ్రహానికి బ్రేక్ వేసి చిన్నపాటి ఆలోచన చేసినా కోపాన్ని నియంత్రించుకోగలం. అన్నింటికంటే ముఖ్యంగా కోపం అనేది మన అధికారం, దర్పాల ప్రదర్శనగా కాక, మన బలహీనతగా గుర్తించాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి.
-వి.దుర్గాంబ