ఆమిర్ ఖాన్ ఏమన్నాడని..?
భయాందోళనలకు కూడా మతం రంగు పులమగల నేర్పు మతతత్వవాదులకు ఉంది. ప్రసిద్ధ సినీ నటుడు ఆమిర్ ఖాన్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రికలు నిర్వహించిన రాం నాథ్ గోయెంకా అవార్డు ప్రదానోత్సవంలో మాట్లాడుతూ “నేను, కిరణ్ జీవితాంతం భారత్ లోనే బతికాం. కాని మొట్ట మొదటి సారి నా భార్య మనం దేశం వదిలి పోదామా అని అడిగింది. ఆమె తన కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన పడుతోంది. చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంటుందోనని ఆమె […]
గత కొద్ది మాసాలుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు కేవలం ముస్లింగా పుట్టిన ఆమీర్ కు మాత్రమే భయంగొల్పడం లేదు. హేతువాదులైన ధబోల్కర్, గోవింద్ పన్సారే, పురోగమన భావాలున్న రచయిత కల్బుర్గి లాంటివారిని హతమార్చడం, పశు మాంస భక్షణ వ్యవహారం దాద్రీలో హత్యకు దారి తీయడం ముస్లింలను మాత్రమే కలవరపెట్టడం లేదు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్వేషాన్ని రెచ్చగొట్టే ఘటనలు పెరిగినందుకు సెక్యులర్ వాదులు, సహనం కొనసాగాలని కోరుకునే వారు, అభ్యుదయభావాలు ఉన్న వారు, మతతత్వాన్ని సహించలేని వారు తీవ్రంగా కలవర పడుతున్నారు.
ఈ కలుషిత వాతావరణాన్ని సృష్టించడానికి పనిగట్టుకుని ప్రయత్నిస్తున్నందువల్లే అనేక మంది సాహిత్యకారులు, శాస్త్రవేత్తలు, మేధావులు, సినీ కళాకారులు తమ అవార్డులను వెనక్కిచ్చేసి “అహింసాయుత నిరసన” తెలియజేస్తున్నారు. అధికారంలో ఉన్న వారు, సంఘ్ పరివార్ కుదురులోని వారు ఈ నిరసనను ఎద్దేవా చేస్తున్నారు. గుప్పెడు మంది అవార్డులు తిరిగి ఇచ్చేయడం మీద ఇంత రాద్ధాంతం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఎవరో వారిని రెచ్చగొడ్తేనే ఇలా నిరసన తెలియజేస్తున్నారని ప్రజాస్వామ్య హక్కు అయిన నిరసనకు రాజకీయ రంగు పులుముతున్నారు. విద్వేషాన్ని రెచ్చగొట్టడాన్ని సాహిత్య అకాడమీ ఖండించింది గనక ఈ అవార్డులను మళ్లీ తీసుకోవాలని సలహాలు పడేస్తున్నారు.
“ఇన్ క్రెడిబుల్ ఇండియా హఠాత్తుగా అసహన భారత్ గా ఎలా మారిపోయింది ఆమీర్ ఖాన్?” అని అనుపం ఖేర్ నిలదీస్తున్నారు. “మీ ఆవిడ వెళ్లిపోదాం అంటోంది కదా, మరి ఏ దేశానికి వెళ్తారు? దేశంలో ఇంతకన్నా అద్వాన్న పరిస్థితిలో కూడా ఇక్కడే ఉన్నారుగా! మరి అప్పుడు వెళ్లి పోదామని ఎందుకు అనుకో లేదు? ‘సత్యమేవ జయతే’లో దుష్ట సంప్రదాయాల గురించి మాట్లాడావు కదా. ప్రజలకు భరోసా ఇచ్చావుగా! ఈ ‘అసహన’ సందర్భంలో కూడా ప్రజలకు భరోసా ఇవ్వాలిగా!” అని అనుపం ఖేర్ నిలదీస్తున్నారు.
“మేం ఆమిర్ ఖాన్ ను దేశం నుంచి వెళ్లనివ్వం. ఆయనకు ఇక్కడ భద్రత ఉంది. రాజకీయ దురుద్దేశంతో ఆయన చేస్తున్న ప్రచారం భారత్ లో ఆమిర్ ఖాన్ కు బ్రహ్మ రథం పట్టిన వారిని అవమానించడమే” అని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ అంటున్నారు. ఒక వేపు ఆమిర్ ఖాన్ ను దేశం వదిలి వెళ్లనివ్వబోమని చెప్తూనే ఆ తర్వాతి మాటల వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో గమనిస్తే విద్వేషం రగుల్కొల్పడం అంటే ఏమిటో అర్థం అవుతుంది.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆమిర్ వ్యాఖ్యలు “దేశ ప్రతిష్ఠను మంటగలపడమే” అన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల భయ వాతావరణం నెలకొంటోదన్న ఆందోళన వ్యక్తం చేసిన ఆమిర్ ఖాన్ కు ఇచ్చే భరోసా కన్నా మంత్రులుగా ఉన్న వారి నర్మ గర్భ హెచ్చరికలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి.
బీజేపీ అధికారప్రతినిధి షా నవాజ్ ఖాన్ దాపరికం ఏ మాత్రం లేకుండా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సినీ నటుడు ఆమిర్ ఖాన్ వ్యక్తం చేసిన భయాందోళనలకు వత్తాసు పలకడం “భారత్ ను అప్రదిష్ట పాలు చేయడానికి జరుగుతున్న కుట్ర అన్నారు. “మీరు భారత్ వదిలి వెళ్లాలని ఎందుకనుకుంటున్నారు? మీకేమైనా సమస్య ఉంటే మా దగ్గరకు రండి. చర్చిద్దాం. ఇక్కడ ఉండడం అసాధ్యమని మాకు నమ్మకం కలిగించేట్టు చెప్పండి” అని కూడా షా నవాజ్ ఖాన్ అంటున్నారు. ఈ మాటల్లో ఎక్కడైనా ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిలో విశ్వాసం పాదుకొల్పే తీరు లేశ మాత్రమైన కనిపిస్తోందా? మరి షా నవాజ్ కు నమ్మకం కుదిరించలేక పోతే గతేమిటట.
నోరు తెరిస్తే విద్వేషం రెచ్చగొట్టే కళలో నిష్ణాతుడనిపించుకుంటున్న బీజేపీ ఎంపీ “యోగి” ఆదిత్యనాథ్ ఆమిర్ ఖాన్ దేశద్రోహి అనేంతవరకు వెళ్లారు. మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి రాం దాస్ కదం ఆమిర్‌కు దేశద్రోహి అన్న ముద్ర మరింత బలంగా వేశారు. “ఇంతకాలం పాముకు పాలు పోసి పెంచినట్టే గదా” అని మనసులో మాట కదం స్పష్టంగా చెప్పారు. భారత్ లో భద్రత లేదనుకుంటే ఆమిర్ ఖాన్ పాకిస్తాన్ కు వెళ్లిపోవచ్చు అని దారి కూడా చూపించారు. అనుపం ఖేర్ లాగా ఏ దేశానికి వెళ్తావు అని అడిగి ఊరుకోలేదు.
మరో బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ మర్యాదకరంగా మాట్లాడినట్టు కనిపించినా “ఏదో కొద్ది మంది అవార్డులు తిరిగి ఇచ్చేస్తే అసహనం ఉన్నట్టేనా” అని ప్రశ్నించారు. “విద్వేషం రెచ్చగొడ్తున్నారన్న అంశంపై దేశంలో స్వేచ్ఛగా చర్చ జరుగుతోంది. అసమ్మతి వ్యక్తం చేయడానికి అవకాశం ఉందంటే మనది సహనశీలమైన సమాజమనేగా” అని నళిన్ కోహ్లీ సన్నాయి నొక్కులు నొక్కారు. “ఎన్.డి.ఏ. అధికారంలోకి వచ్చినదగ్గర నుంచి మతకలహాలు తగ్గిపోయాయి” అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజూ దీర్ఘాలు తీస్తున్నారు.
హిందూ సేన కార్యకర్తలు వందల సంఖ్యలో బాంద్రాలోని ఆమిర్ ఖాన్ ఇంటి దగ్గర నిరసన ప్రదర్శన చేశారు. ఇంట్లోకి చొరబడడానికి ప్రయత్నం చేశారు. పోలీసు బలగాలను భారీ సంఖ్యలో మోహరించకుండా ఉంటే అంతపనీ జరిగేదే. అమితోత్సాహంగా ఈ నిరసన కారులు “ఆమిర్ ఖాన్ ముర్దాబాద్”, “ఆమిర్ ఖాన్ చలే జావో” అని నినదించారు.
“ఇది మా దేశం. ఏం జరిగినా ఇక్కడే ఉంటాం. మేం ఇక్కడ పుట్టినందువల్ల మాత్రమే కాదు, ఇష్టపడే ఇక్కడ ఉంటున్నాం” అని చెప్పిన మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పార్టీగా ముద్రపడిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీని అభినందించాల్సిందే.
-ఆర్వీ రామారావ్