కోజికోడ్ హోటళ్లలో... భోజనం ఫ్రీ..!
కేరళలోని కోజికోడ్ (ఇదివరకు క్యాలికట్) నగరంలో ఇప్పుడు ఒక సరికొత్త ప్రభుత్వ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ ఊరికి ఏదైనా పనిమీద వెళ్లనవారికి భోజనం ఖర్చులేదు. ఎంతమందికైనా ఉచితంగా భోజనం దొరుకుతుంది. అదీ మంచి హోటళ్లలో. కోజికోడ్ జిల్లా యంత్రాంగం అమలుచేస్తున్న ఈ స్కీమ్ పేరు ఆపరేషన్‌సులైమణి. ఉచితభోజనం కావాలనుకున్నవారు మధ్యాహ్నం తమకు దగ్గరలో ఉన్న నిర్దేశిత ప్రభుత్వ కార్యాలయంలో కూపన్‌ని పొందవచ్చు. ఆ కూపన్ విలువ 40 రూపాయలు. కానీ వాటిని ఉచితంగానే అందిస్తారు. నగరవ్యాప్తంగా దాదాపు […]
కేరళలోని కోజికోడ్ (ఇదివరకు క్యాలికట్) నగరంలో ఇప్పుడు ఒక సరికొత్త ప్రభుత్వ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ ఊరికి ఏదైనా పనిమీద వెళ్లనవారికి భోజనం ఖర్చులేదు. ఎంతమందికైనా ఉచితంగా భోజనం దొరుకుతుంది. అదీ మంచి హోటళ్లలో. కోజికోడ్ జిల్లా యంత్రాంగం అమలుచేస్తున్న ఈ స్కీమ్ పేరు ఆపరేషన్‌సులైమణి. ఉచితభోజనం కావాలనుకున్నవారు మధ్యాహ్నం తమకు దగ్గరలో ఉన్న నిర్దేశిత ప్రభుత్వ కార్యాలయంలో కూపన్‌ని పొందవచ్చు. ఆ కూపన్ విలువ 40 రూపాయలు. కానీ వాటిని ఉచితంగానే అందిస్తారు. నగరవ్యాప్తంగా దాదాపు 100 హోటళ్లలో ఈ కూపన్లు చెల్లుతాయి. పొరుగూళ్ల నుండి హాస్పటల్, వ్యాపార, వ్యక్తిగత… ఇలా పలు పనులమీద వస్తున్నవారికి ఈ భోజన సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతున్నది. అంతేకాక, నిరుపేదలు, కూలినాలి చేసుకునే జనం కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఈ స్కీముకింద భోజనాలు అందిస్తున్న హోటళ్ల యజమానులు సైతం ఈ పథకం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనిద్వారా తాము ఎలాంటి నష్టానికి గురికాకుండానే ఇతరులకు మేలు చేసామనే ఆనందం పొందుతున్నామని ఒక హోటల్ యజమాని అంటున్నారు.
కార్పొరేట్ కంపెనీలు ఈ పథకానికి నిధులను అందిస్తామని ముందుకువస్తున్నా అధికారులు వద్దంటున్నారు. ఈ పథకాన్ని నడిపించే బాధ్యత ప్రజలదే అంటున్నారు వారు. ప్రజలే దీనికి నిధులను అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. పలు రెస్టారెంట్ల ముందు ఉచిత భోజన పథకం కోసం విరాళం అందించాలనుకునేవారికోసం డబ్బాలను ఉంచారు. ఇప్పటివరకు ఈ డబ్బాల ద్వారా రెండులక్షల రూపాయిలకు పైగానే డబ్బు వసూలయింది. ఓ సహకార బ్యాంకు ఈ విరాళాలను సమీకరించి పథక నిర్వాహకులకు అందించే బాధ్యతను చేపట్టింది.
ఈ పథకాన్ని మరింతగా జనంలోకి తీసుకువెళ్లేందుకు వీలుగా సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్టుగా కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఎన్. ప్రశాంత్ తెలిపారు. కూపన్లను న్యూస్‌పేపర్లకు జతచేసి జనానికి తేలిగ్గా చేరేలా చేస్తున్నామని, వాటిని పొందినవారు అవసరంలో ఉన్నవారికి వాటిని అందించే అవకాశం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ పథక నిర్వహణకు కావలసిన ప్రాథమిక నిధులను సైతం తాము వసూలు చేయడం లేదని, ఇది మొత్తం స్వచ్ఛందంగా మాత్రమే నడుస్తున్నదని ప్రశాంత్ తెలిపారు.
ఈ పథకం కోసం వాలంటీర్‌గా పనిచేస్తున్న ఫాలా అనే 19 సంవత్సరాల విద్యార్థిని…కూపన్లకోసం వచ్చేవారితో తాము ఎంతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తామని చెబుతోంది. అలాగే ఈ పథకం కింద భోజనం చేసేందుకు వచ్చేవారిని అతిథులుగా భావించి అత్యంత మర్యాదపూర్వకంగా భోజనం అందించేలా హోటల్స్ అసోసియేషన్ తగిన చర్యలు తీసుకున్నదని ఆమె తెలిపారు. ఫ్రీగా భోంచేస్తున్నవారెవరో, డబ్బు ఇచ్చి తింటున్నవారెవరో ఎవరూ కనిపెట్టలేనంతగా హోటళ్లు గోప్యతని పాటిస్తూ, ఉచితంగా భోజనం చేస్తున్నవారికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చేస్తున్నాయి.