సైంటిస్టులకు సవాలు విసురుతున్న బ్యాక్టీరియా
అంతరిక్షాన్ని జల్లెడపడుతున్న మన శాస్త్రవేత్తలను కంటికి కనిపించని సూక్ష్మక్రిములు మాత్రం ముప్పుతిప్పలు పెడుతూనే ఉన్నాయి. ఒకదానికి మందులు కనిపెడితే మరొకటి మరింత బలం పుంజుకుని మనుషుల మీదకు వ్యాధుల రూపంలో విరుచుకుపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సూపర్‌బగ్ ఒకటి ప్రపంచ వైద్యశాస్త్ర నిపుణులను కలవరపెడుతున్నది, శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది. క్షణాల్లో అంటువ్యాధిగా వ్యాపించగల బ్యాక్టీరియా ఒకటి విరుచుకు పడబోతోందని, అది అత్యంత వేగంగా పెరుగుతోందని, మన వద్ద ఉన్న అతి శక్తివంతమైన యాంటీబయోటిక్స్ ఏవీ దానికి మందుగా […]
అంతరిక్షాన్ని జల్లెడపడుతున్న మన శాస్త్రవేత్తలను కంటికి కనిపించని సూక్ష్మక్రిములు మాత్రం ముప్పుతిప్పలు పెడుతూనే ఉన్నాయి. ఒకదానికి మందులు కనిపెడితే మరొకటి మరింత బలం పుంజుకుని మనుషుల మీదకు వ్యాధుల రూపంలో విరుచుకుపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సూపర్‌బగ్ ఒకటి ప్రపంచ వైద్యశాస్త్ర నిపుణులను కలవరపెడుతున్నది, శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది. క్షణాల్లో అంటువ్యాధిగా వ్యాపించగల బ్యాక్టీరియా ఒకటి విరుచుకు పడబోతోందని, అది అత్యంత వేగంగా పెరుగుతోందని, మన వద్ద ఉన్న అతి శక్తివంతమైన యాంటీబయోటిక్స్ ఏవీ దానికి మందుగా పనిచేయవని వైద్య శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నారు. దక్షిణ చైనాలో పుట్టిన ఈ సూక్ష్మక్రిమి, దాదాపు వందేళ్లపాటు శ్రమించి మనం సృష్టించుకున్న యాంటీబయోటిక్స్ కి సవాలుగా మారిందని, ఎన్నో ప్రాణాంతక వ్యాధులను నయం చేసిన యాంటీబయోటిక్స్ దీనిముందు నిలబడలేకపోతున్నాయని వారంటున్నారు. సూపర్‌బగ్స్ మీద పోరాటం చేసే పాలిమిక్సిన్స్ అనే యాంటీ బయోటిక్స్ ని ఈ సూపర్‌బగ్ లోని ఎమ్‌సిఆర్-1 అనే జన్యుకణం అడ్డుకుంటోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ జన్యువు బ్యాక్టీరియాలో సాధారణంగా కనిపించేదే అయినా న్యూమోనియా, రక్తంలో ఇన్‌ఫెక్షన్లు కలిగించే, ఇ. కొలీ, కె న్యూమోనియా లాంటి ప్రాణాంతక బ్యాక్టీరియాలో చేరినపుడు అది అజేయంగా మారుతున్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ జన్యువు కారణంగానే ఈ బ్యాక్టీరియా ఒక జాతి ప్రాణుల నుండి మరొకజాతి ప్రాణులకు మారుతూ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ఇలా యాంటీబయోటిక్స్ ని ప్రతిఘటించిన బ్యాక్టీరియా, అంతకుముందున్న బ్యాక్టీరియా పరివర్తనం చెందడం ద్వారా పుట్టినదే. కానీ ఇది నేరుగా ప్రాణుల్లో కనబడుతోంది. దక్షిణ చైనాలో పందులు, కోళ్లలో సాధారణ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నపుడు ఇది బయటపడింది. జంతువులకు యాంటీబయోటిక్‌గా వినియోగించే కొలిస్టిన్‌కు ఇది ఎదురుతిరగడం వైద్యులు గమనించారు.
ఈ సూపర్‌బగ్‌లో కనబడుతున్న ఎమ్‌సిఆర్-1 అనే జన్యువు, ఇతర యాంటీబయోటిక్ నిరోధక శక్తి ఉన్న జన్యువులతో కలిసినపుడు అవి మరింత బలం పుంజుకుంటాయని, అప్పుడు మన పరిస్థితి యాంటీబయోటిక్స్ కనిపెట్టకముందు ఎలా ఉండేదో అలా, అంత ఘోరంగా మారిపోతుందని, ప్రాణాంతకవ్యాధులు విజృంభిస్తాయని యుకెలోని కార్డిఫ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తిమోతీ వాల్ష్, బిబిసితో చెప్పారు. మన యాంటీబయోటిక్స్ అన్నీ నిరుపయోగం అయిపోయే పరిస్థితి రానున్నదని ఆయన హెచ్చరిస్తున్నారు.