చంద్రబాబు కర్చీప్‌కు నితీష్‌ నో ..!

బీహర్‌ ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబును నితీష్ కుమార్ ఆహ్వానించకపోవడంపై టీడీపీలో చర్చ జరుగుతోంది.  నితీష్ తన ప్రమాణస్వీకారానికి చంద్రబాబును ఆహ్వానించారా లేదా అన్న దానిపై కొందరు నేతలు… సీనియర్ల దగ్గర ఆరా తీశారు. అప్పుడు వారు జరిగిన విషయాన్ని బయటపెట్టారు. వరుస ఓటములతో బీజేపీ బలహీనపడుతోందన్న భావనలో ఉన్న చంద్రబాబు భవిష్యత్తులో మూడో కూటమి చక్రం తిప్పే సూచనలు ఉన్నాయనుకుంటున్నారు. అందుకే థర్డ్‌ ఫ్రంట్‌ నేతలతోనూ టచ్‌లో ఉండేందుకు ఆయన ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే […]

Advertisement
Update:2015-11-20 05:15 IST

బీహర్‌ ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబును నితీష్ కుమార్ ఆహ్వానించకపోవడంపై టీడీపీలో చర్చ జరుగుతోంది. నితీష్ తన ప్రమాణస్వీకారానికి చంద్రబాబును ఆహ్వానించారా లేదా అన్న దానిపై కొందరు నేతలు… సీనియర్ల దగ్గర ఆరా తీశారు. అప్పుడు వారు జరిగిన విషయాన్ని బయటపెట్టారు.

వరుస ఓటములతో బీజేపీ బలహీనపడుతోందన్న భావనలో ఉన్న చంద్రబాబు భవిష్యత్తులో మూడో కూటమి చక్రం తిప్పే సూచనలు ఉన్నాయనుకుంటున్నారు. అందుకే థర్డ్‌ ఫ్రంట్‌ నేతలతోనూ టచ్‌లో ఉండేందుకు ఆయన ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే నితీష్ తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే ఏం చేయాలన్న దానిపై తొలుత చంద్రబాబు తర్జనభర్జన పడ్డారు. నేరుగా ప్రమాణస్వీకారానికి వెళ్తే మోదీ ఫీలవుతారని చంద్రబాబు భావించారట. కాబట్టి ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే ఫోన్‌లోనే శుభాకాంక్షలు చెప్పి తను రాకపోవడానికి గల పరిస్థితులను వివరించాలనుకున్నారు చంద్రబాబు. రాష్ట్రంలో వరద కారణంగా రాలేకపోతున్నానని లేకుండా తప్పకుండా వచ్చేవాడినని చెప్పాలని భావించారు. అంతేకాకుండా వీలైతే ఢిల్లీలో ఉండే టీడీపీ నేతలను రహస్యంగా నితీష్ ఇంటికి పంపించి తన తరపున శుభాకాంక్షలు తెలపాలని కూడా అనుకున్నారు. కానీ …

నితీష్ కుమార్ తన ప్రమాణస్వీకారోత్సవానికి చంద్రబాబును అసలు ఆహ్వానించనే లేదు. దీనిపై చంద్రబాబు ఢిల్లీలోని టీడీపీ నేతలను ఆరా తీశారని తెలుస్తోంది. మర్యాదపూర్వకంగానైనా తోటి ముఖ్యమంత్రి ఆహ్వానించాలి కదా… అలా ఎందుకు జరగలేదో కనుక్కోవాలని పురామాయించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ నేతలు… నితీష్ సన్నిహితులకు ఫోన్ చేసి పరోక్షంగా విషయాన్ని ఆరా తీశారు. దీంతో చంద్రబాబును ఆహ్వానించడం నితీష్‌కు ఇష్టం లేనట్టుగా ఉందని అవతలి వైపు నుంచి సమాధానం వచ్చింది. ఈ విషయాన్ని నేతలు చంద్రబాబుకు చేరవేశారు.

ఇలా ఎందుకు జరిగిందన్న దానిపై టీడీపీ నేతలు ఒక విషయాన్ని చెబుతున్నారు. ముందు చూపుతో థర్డ్ ఫ్రంట్‌ నేతలను కూడా లైన్‌లో పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అయితే నితీష్ ముందు ఎత్తులు పారలేదంటున్నారు. గతంలో థర్డ్‌ ఫ్రండ్‌లో ఉండి ఎన్నికల వేళ హ్వాండిచ్చి ఎన్డీఏతో జతకట్టడం నితీష్‌ బృందం ఇప్పటికీ మరిచిపోలేదంటున్నారు. పైగా యూపీఏ హయాంలో కాంగ్రెస్‌ నేతలతో చంద్రబాబు సన్నిహిత సంబంధాలను కూడా వారు గుర్తు చేసుకుంటున్నారు. ఇలా ఎక్కడ అధికారం ఉండే అటు వైపు మొగ్గు చూపే చంద్రబాబు తీరు నితీష్‌కు నచ్చలేదని చెబుతున్నారు. అందుకే ప్రమాణస్వీకారానికి చంద్రబాబును నితీష్ బ్యాచ్ ఆహ్వానించలేదని చెబుతున్నారు .మొత్తం మీద థర్డ్‌ ఫ్రంట్‌లో ఇప్పుడే కర్చీప్ వేసి ఉంచాలనుకున్న చంద్రబాబు ఆశలపై నితీష్ నీరు చల్లారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News