సర్వం..కల్తీమయం
ఒకవైపు పెరుగుతున్న ధరలు ఏం తినేట్టులేదు, ఏం కొనేట్టు లేదు…అనిపించేలా చేస్తున్నాయి. మరో వైపు అనేక ఆహార వస్తువులు కల్తీతో విషాన్ని తలపిస్తున్నాయి. అసలు మనం తినదగిన ఆహారాన్నే తింటున్నామా అనేంత స్థాయిలో కల్తీ వార్తలు వెలుగుచూస్తున్నాయి. దాదాపు మనం వాడుతున్న ప్రతినిత్యావసర వస్తువులోనూ ఏదో ఒకరకంగా కల్తీ కలుస్తోంది. అడ్డగోలుగా ఆహార వస్తువులను కల్తీచేసి ప్రజలమీదకు వదులుతున్నవ్యాపారులను చూస్తుంటే, మన ఆరోగ్యాలు మన చేతుల్లో ఏమాత్రం లేవనిపిస్తోంది. సునాయాసంగా పాల నుండి మిరియాల వరకు అన్నింటా […]
ఒకవైపు పెరుగుతున్న ధరలు ఏం తినేట్టులేదు, ఏం కొనేట్టు లేదు…అనిపించేలా చేస్తున్నాయి. మరో వైపు అనేక ఆహార వస్తువులు కల్తీతో విషాన్ని తలపిస్తున్నాయి. అసలు మనం తినదగిన ఆహారాన్నే తింటున్నామా అనేంత స్థాయిలో కల్తీ వార్తలు వెలుగుచూస్తున్నాయి. దాదాపు మనం వాడుతున్న ప్రతినిత్యావసర వస్తువులోనూ ఏదో ఒకరకంగా కల్తీ కలుస్తోంది. అడ్డగోలుగా ఆహార వస్తువులను కల్తీచేసి ప్రజలమీదకు వదులుతున్నవ్యాపారులను చూస్తుంటే, మన ఆరోగ్యాలు మన చేతుల్లో ఏమాత్రం లేవనిపిస్తోంది. సునాయాసంగా పాల నుండి మిరియాల వరకు అన్నింటా కల్తీ చేసి అమ్ముకోగల వ్యాపారులు మన మధ్యే ధీమాగా బతికేస్తుంటే, ఈ మాత్రం దానికి మనం కోట్లు ఖర్చుపెట్టి ఎలక్షన్లు జరిపించుకోవడం, మా గురించి పట్టించుకోండి మహాప్రభో.. అంటూ పాలకులను ఎన్నుకోవడం, వారిని నమ్ముకుని…హమ్మయ్య సురక్షితంగా ఉన్నాం…అనుకోవడం…ఇవన్నీ ఎంత బుద్ది తక్కువ పనులో అర్ధమవుతుంది.
తినేముందు చేతులు కడుక్కోవాలి…పళ్లాలు కడగాలి…కూరగాయలు కడగాలి…లాంటి సూత్రాలతో మన ఆరోగ్యం బాగుపడదు..కడగాల్సింది కల్తీని. గుండె గుభేల్ మనిపించే కల్తీ నిజాలు ఇవి…ఈ నిజాల్లో మాత్రం ఏమాత్రం కల్తీ లేదు…ఎందుకంటే ప్రభుత్వం యంత్రాంగాలే స్వయంగా దాడులు చేసి కనుక్కున్న నిజాలు ఇవి-
హైదరాబాద్‌లోని బేగం బజార్ తదితర ప్రాంతాల్లో హోల్‌సేల్ దుకాణాల్లో యదేచ్ఛగా అమ్ముతున్న చాలా ఆహార వస్తువుల్లో పెద్ద ఎత్తున కల్తీ జరుగుతున్నట్టుగా పోలీసులు కనుగొన్నారు. ఎరుపు, నలుపు ఆక్సైడ్, వార్నిష్, పెయింట్, జిగురు, రసాయనాలు…ఇవన్నీ ఏ ఇంటి నిర్మాణంలోనో, ఫ్యాక్టరీల్లో వస్తువుల ఉత్పత్తిలోనో వాడుతున్నవి కాదు, అచ్చంగా మన ఆహార పదార్థాల్లోనే కలుస్తున్నాయి. చాలామంది వ్యాపారులు తక్కువ రకం మసాలా దినుసులను, అసలు దినుసులే కానివాటిని తెచ్చి ఈ రసాయనాలతో వాటికి మేకప్ చేసి మనకు అమ్మేస్తున్నారు. అంతేకాదు, వాటిని అందంగా ప్యాక్ చేసి, గొప్ప బ్రాండ్ ముద్రలు కూడా వేసి మన దగ్గర మరింత ఎక్కువ ధరలు రాబడుతున్నారు. ఓల్డ్ సిటీ నుండి ఈ దందా నడుస్తున్నదని, టన్నులకొద్దీ కల్తీ సరుకు మార్కెట్ జరుగుతున్నదని పోలీసులు గుర్తించారు. .
ఐరన్ ఆక్సైడ్, పెయింట్, జిగురు ఇలాంటివి ఆహర పదార్థాల ద్వారా మన పొట్టలో చేరితే క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని, ఇవి మన జీర్ణవ్యవస్థకూ, లోపలి భాగాలకు అనారోగ్యాలు తెచ్చిపెడతాయని జిహెచ్ఎమ్‌సి ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ జి. వినోద్ దయాల్ అంటున్నారు. పోలీసుల దాడుల్లో 80బస్తాల కల్తీ మసాలా దినుసులు బయటపడ్డాయంటే ప్రజారోగ్యం అనేది ఇక్కడ ఎంతగా గాల్లో దీపంలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిరియాలు, గసాలు, జీలకర్ర వీటిలో హెచ్చుగా ఉన్నాయి. గసాల్లో కొన్నితక్కువ రకపు రవ్వలను కలిపి మళ్లీవాటికి బరువు, రంగు వచ్చేందుకు పెయింట్, జిగురులను కలుపుతున్నారు. 20మంది పనివాళ్లు ఆహారవస్తువుల్లో రసాయనాలు కలిపి తిరిగి ప్యాకింగ్ చేయడం కనుగొన్నారు.
బేగం బజార్‌లోనే అయిదుగురు కల్తీ వ్యాపారులను పట్టుకున్నారు. వీరు రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ వర్తకులకు వీటిని సరఫరా చేస్తున్నారు. కల్తీకోసం వాడుతున్న రసాయనాలు ఎక్కడినుండి వస్తున్నాయి అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కల్తీ పై కళ్లు బైర్లు కమ్మే నిజాలు మరికొన్ని-
- సొసైటీ ఆఫ్ పొల్యుషన్ ఎన్విరాన్‌మెంటల్ కాన్వర్‌జేషన్ ఆఫ్ సైంటిస్ట్స్ అనే సంస్థ గత అక్టోబరు 31 నుండి నవంబర్ 8 వరకు అంటే దీపావళి ముందు రోజుల్లో దేశవ్యాప్తంగా ఆహారం ఎలా ఉంది…అనే విషయంపై ఒక సర్వే నిర్వహించింది. ఇందులో మార్కెట్లో ఉన్న 90శాతం ఆహార పదార్థాలు కల్తీవేనని తేలింది. ఈ సంస్థ వాలంటీర్లు, స్వీట్లు, బేకరీ ఫుడ్స్, ఆవనూనె, పాలు, బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్ ఇలా రకరకాల ఆహార వస్తువులను డెహ్రాడూన్, హరిద్వార్, రుషికేష్, రూర్కీ, ముస్సోరీ ప్రాంతాలనుండి సేకరించి పరిశీలించారు. న్యూఢిల్లీలోని సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఆమోద ముద్ర ఉన్న పరిశోధనశాలల్లో వీటిని పరీక్షించారు. 1062 ఆహార వస్తువులను పరీక్షించగా అందులో 952 కల్తీ సరుకేనని తేలింది. అంటే 89శాతం. కల్తీ ఎక్కువగా ఉన్నది ఆవనూనెలో. పాలతో తయారయ్యే మిల్క్ కేకు ల్లో 70నుండి 90శాతం వరకు కల్తీ జరిగినట్టుగా తేలింది. అలాగే పసుపు, కుంకాల్లోనూ ఎక్కువ కల్తీని గమనించారు. పారిశ్రామిక ఉత్పత్తుల్లో రంగుకోసం వాడే రసాయనాలను కుంకుమలో కలపడంతో చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఈ టెస్టులు నిర్వహించినవారు చెబుతున్నారు.
- బొప్పాయి గింజలను మిరియాలుగా మార్చి వినియోగదారులను ఏమార్చుతున్నారు. వీటిని టెస్ట్ చేయాలంటే మిరియాలను నీళ్లలో వేస్తే నిజమైన మిరియాలు నీళ్ల అడుక్కి చేరతాయి, బొప్పాయి గింజలు తేలతాయి. మిరియాల పొడికి సైతం ఈ పరీక్ష చేయవచ్చు.
- ధనియాల పొడిలో ఊక, రంపపు పొడి కలుపుతున్నారు. కాస్త పొడిని నీళ్లలో వేస్తే కల్తీ చేసిన వస్తువులు పైకి తేలతాయి.
- జీలకర్రలో గడ్డి గింజలకు బొగ్గుకి సంబంధించిన నుసిని క లుపుతున్నారు. అనుమానం వస్తే జీలకర్రని చేతిలో ఉంచుకుని నలిపితే చేతులు నల్లగా మారితే కల్తీ జరిగినట్టే.
- కారంలో ఇటుకపొడి, రంపపు పొడి కలుపుతున్నారు. నీళ్లలో స్పూను కారం కలిపినపుడు కారం నీటిలో మునిగిపోతుంది. రంపపుపొట్టు ఉంటే నీటిపై తేలుతుంది. ఇటుకపొడితో కల్తీ చేసి ఉంటే అది గ్లాసు అడుగుకి చేరుతుంది.
- పాలల్లో అయితే చెప్పాల్సిన పనిలేదు. కప్పు పాలల్లో ఉన్న పోషకాల సంగతి తరువాత ఆరోగ్యానికి హానిచేసే విషాలు మాత్రం ఏమేం ఉన్నాయో చూసుకోవాల్సిన పరిస్థితి. యూరియా, కాస్టిక్ సోడా, రిఫైన్డ్ ఆయిల్స్‌తో సింథటిక్ మిల్క్ తయారుచేస్తున్నారు. ఇంకా డిటర్జెంటులు, పిండిపదార్థాలు, పంచదార, నీళ్లు, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఎముకల పొడి, హైడ్రోజనేటెడ్ ఆయిల్స్, జంతువుల కొవ్వులు, నిలవకోసం హానిచేసే పదార్థాలు…ఇలా పాలు పోషకాహారం కాదు, విషాహారం అనిపించేంత స్థాయిలో కల్తీకి గురవుతున్నాయి.
- ఆవాలను బ్రహ్మజెముడు విత్తనాలతో, నేతిని వనస్పతితో, గోధుమపిండిని గంజి పొడితో, చాక్‌పౌడర్‌తో ఇంగువను…ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిట్టాకు అంతు ఉండదు. కడుపునిండా తిండి తినేందుకు కూడా వీలులేకుండా ఆహార వస్తువుల పట్ల ప్రతి ఇల్లూ ఒక పరిశోధనాలయం కావాల్సిన పరిస్థితి దాపురించిందంటే అతిశయోక్తి కాదు మరి.