రంజుగా వరంగల్ రాజకీయం
వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచార పర్వం మొదలైంది. అధికారపార్టీపై ముప్పేట దాడి కొనసాగుతోంది. టీడీపీ-బీజేపీ, కాంగ్రెస్‌లకు తోడుగా ఇప్పుడు వైఎస్సార్‌సీపీ తోడైంది. నిన్న మొన్నటిదాకా తెలంగాణ రాజకీయాలలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న వైఎస్సార్‌సీపీ కూడా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. మాటల దాడులకు- ప్రతిదాడులు, విమర్శకు- ప్రతివిమర్శలతో వరంగల్ రాజకీయం రంజుగా మారింది. టీడీపీ-బీజేపీ ఏమంటున్నాయి? బిహార్ ఓటమితో ఈ మిత్రద్వయం డీలా పడినా ఆ విషయాన్ని బయటికి రాకుండా బాగానే కవర్ చేస్తున్నాయి. పార్టీ అభ్యర్థి దేవయ్య […]
Advertisement
వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచార పర్వం మొదలైంది. అధికారపార్టీపై ముప్పేట దాడి కొనసాగుతోంది. టీడీపీ-బీజేపీ, కాంగ్రెస్‌లకు తోడుగా ఇప్పుడు వైఎస్సార్‌సీపీ తోడైంది. నిన్న మొన్నటిదాకా తెలంగాణ రాజకీయాలలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న వైఎస్సార్‌సీపీ కూడా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. మాటల దాడులకు- ప్రతిదాడులు, విమర్శకు- ప్రతివిమర్శలతో వరంగల్ రాజకీయం రంజుగా మారింది.
టీడీపీ-బీజేపీ ఏమంటున్నాయి?
బిహార్ ఓటమితో ఈ మిత్రద్వయం డీలా పడినా ఆ విషయాన్ని బయటికి రాకుండా బాగానే కవర్ చేస్తున్నాయి. పార్టీ అభ్యర్థి దేవయ్య కోసం ప్రచారం మొదలు పెట్టాయి. తాము గెలిస్తే.. ప్రజాసమస్యలు తీరుస్తాం అన్న హామీతోనే ముందుకెళ్తున్నారు. బీజేపీకి వరంగల్ సెగ్మెంట్‌లోని ఏడు నియోజకవర్గాల్లో అంతగా పట్టులేదు. దాంతో గతేడాది జరిగిన మెదక్ పార్లమెంటు ఉప-ఎన్నికలాగానే ఈ సారి కూడా పూర్తిస్థాయిలో టీడీపీ కేడర్ పై ఆధారపడింది బీజేపీ. తమ అభ్యర్థి స్థానికుడేనని చెప్పుకోవాల్సి రావడం పార్టీకి ప్రతికూలంగా మారుతున్న అంశం.
రంగంలోకి వైఎస్సార్‌సీపీ
వరంగల్ పార్లమెంటు ఉప- ఎన్నికకు అభ్యర్థిని పోటీకి దింపడంతో వైఎస్సార్‌సీపీ సాహసమే చేసిందనుకోవాలి. పార్టీకి చెప్పుకోదగ్గ కేడర్ లేకపోవడం, వైఎస్ జగన్- రాజశేఖర రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న విషయం ప్రజల మనసుల నుంచి ఇంకా చెరిగిపోలేదు. విభజనకు ముందు తెలంగాణలో జగన్‌తో సహా ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణలో అడుగుపెడితే.. ఏం జరిగిందో అందరికీ తెలిసిందే! కానీ, ఇటీవల షర్మిల నిర్వహించిన పాదయాత్రకు మంచి స్పందన రావడం కేడర్‌లో ఉత్సాహం నింపింది. ఈ ఉత్సాహంతోనే నల్లా సూర్యప్రకాశ్‌ను పోటీలోకి దించారు. ఇప్పటికే ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికితోడుగా ఎమ్మెల్యే రోజా రంగంలోకి దిగారు. 16న జగన్ కూడా అభ్యర్థి తరఫున ప్రచారం చేయనున్నారు.
జోరుమీదున్న కాంగ్రెస్
తమ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు మద్దతుగా పీసీసీ మొత్తం ప్రచారం మొదలు పెట్టింది. ప్రత్యేక రాష్ట్రం తెచ్చినప్పటికీ రాష్ట్రంలో పరాజయం పాలవడంతో ఎలాగైనా ఈసారి గెలిచి అధిష్టానం వద్ద మంచిపేరు తెచ్చుకుందామనుకుంటున్నారు తెలంగాణ పీసీసీ నేతలు. అందుకే ప్రచారంలో నువ్వా-నేనా అన్నట్లుగా విమర్శలకు దిగుతున్నారు. చెప్పాలంటే.. అధికార పార్టీకి సిసలైన పోటీదారు తామేనని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. సిరిసిల్ల రాజయ్య ఉదంతం పార్టీపై కొంత నెగిటివ్ ప్రభావం చూపింది. మరోవైపు స్థానిక కాంగ్రెస్ వర్గపోరు కారణంగా నేతలు ప్రచారంలో క్రియాశీలకంగా కనిపించడం లేదు. పొన్నాల లక్ష్మయ్య వర్గంతో ఉన్న విభేదాలతో మిగిలిన వారు మిన్నకుండిపోయారు. మండలాల్లో ఏ కాంగ్రెస్ నేతా సరిగ్గా వ్యవహరించడం లేదన్న విమర్శలు అప్పుడే మొదలయ్యాయి. అయితే త్వరలోనే సద్దుకుంటాయని పీసీసీ నేతలు చెబుతున్నారు.
ఆఖరు నిమిషంపై టీఆర్ ఎస్ ఆశలు!
ప్రతిపక్షాల ముప్పేట దాడితో టీఆర్ ఎస్ అలర్టయింది. మాటకుమాట అన్న రీతిలో జైపాల్ రెడ్డి నుంచి ఉత్తమ్‌కుమార్, సర్వేదాకా ఎవరినీ వదలడం లేదు. అసలు తమకు ఎవరూ పోటీనే కాదని అధికార పక్షం ధీమా వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ఉద్యమంలో సర్వే సత్యనారాయణ ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ ఎస్‌లో మాటకారులైన నేతలు ఈ విషయంలో ముందున్నారు. సర్వేకు స్థానికేతరుడని, టీడీపీకి ఓటుకు నోటు కేసు, వైఎస్సార్ సీపీకి మానుకోట కాల్పుల కేసులను గుర్తు చేస్తూ… ప్రతిదాడి మొదలు పెట్టారు. ఇకపోతే ఆఖరి నిమిషం ప్రచారంలో దాదాపు ఇవే విషయాలను సీఎం కేసీఆర్ మరోసారి ప్రస్తావించనున్నారు. మంత్రమేసినట్లు మాట్లాడే కేసీఆర్ చివరి బహిరంగ సభతో సమీకరణాలన్నీ తమపై తిరుగుతాయని అధికారపక్షం ధీమాగా ఉంది.
Advertisement