ప్రశాంత్ కిషోర్‌కి మమత నుండి పిలుపు
2014లో లోక్‌సభ ఎన్నికల్లో, నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహకర్తగా వ్యవహరించి దేశవ్యాప్తంగా అనూహ్య గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్‌కి ఇప్పుడు మమతా బెనర్జీ నుండి పిలుపు వచ్చింది. ఇప్పటికే ఢిల్లీ, బీహార్‌ల ఎన్నికల్లో యాంటీ బీజెపి స్లోగన్ మారుమోగింది. ఇప్పుడు మమత సైతం వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో జరగబోతున్న ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలనుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో విజయాలను కైవశం చేసుకుంటున్న తమకు అసెంబ్లీ ఎన్నికల గెలుపు తేలికేనని, కానీ మమత అత్యధిక మెజారిటీ […]
2014లో లోక్‌సభ ఎన్నికల్లో, నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహకర్తగా వ్యవహరించి దేశవ్యాప్తంగా అనూహ్య గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్‌కి ఇప్పుడు మమతా బెనర్జీ నుండి పిలుపు వచ్చింది. ఇప్పటికే ఢిల్లీ, బీహార్‌ల ఎన్నికల్లో యాంటీ బీజెపి స్లోగన్ మారుమోగింది. ఇప్పుడు మమత సైతం వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో జరగబోతున్న ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలనుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో విజయాలను కైవశం చేసుకుంటున్న తమకు అసెంబ్లీ ఎన్నికల గెలుపు తేలికేనని, కానీ మమత అత్యధిక మెజారిటీ సాధించాలనే పట్టుదలతో ఉన్నారని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొన్న మోడీని, నిన్న నితీష్, లాలూలను విజయతీరాలకు చేర్చిన ప్రశాంత్ కిశోర్ ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలోనూ, వ్యూహరచనలోనూ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే తృణమూల్ కాంగ్రెస్ నేతలు ప్రశాంత్‌ని కలిశారని వచ్చేవారం ఓ సమావేశంలో అన్ని విషయాలు చర్చించనున్నారని సమాచారం. అయితే మమత దీనిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటివరకు ఆయనతో ఎలాంటి చర్చలు జరగలేదు…ఇప్పుడే ఏమీ చెప్పలేనని ఆమె అన్నారు.
జనం దృష్టిలో ఒక నేతని అత్యున్నతంగా, జనానికి అతి సన్నిహితంగా నిలబెట్టడంలో ప్రశాంత్ కిషోర్ సిద్ధహస్తుడు. ప్రజలను చాయ్ పే చర్చా లాంటి భిన్న ఆలోచనలతో ఆకట్టుకోవడం, సాంకేతిక పరిజ్ఞానంతో యువతకి నాయకులను చేరువ చేయడంలో ఆయన నేర్పరి. ప్రశాంత్ మమతకోసం పనిచేయాలని నిర్ణయించుకుంటే… మరోసారి మోడీని ఓడించడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్టే. అలాగే ఈసారి ఆయన పశ్చిమబెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలతో తలపడుతూ మరిన్ని కొత్త ఎత్తులు వేయాల్సి ఉంటుంది.