వరంగల్‌ విపక్షాల్లో నిరాశ నిస్పృహలు

వరంగల్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఏకపక్షంగా జరుగుతుందా అనే ప్రశ్నకు అవుననే అంటున్నాయి అక్కడ పరిస్థితులు. మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ కలిసి పయనించక పోవడం… కాంగ్రెస్‌ శ్రేణుల్లో నిరాశ అలుముకోవడం చూస్తే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు సునాయాసమనే సంకేతాలిస్తున్నాయి. ఫ్లోరిడాలో వైద్యవృత్తిలో కొనసాగుతున్న పగిడిపాటి దేవయ్యను బీజేపీ ఆఘమేఘాల మీద రప్పించి బీజేపీ- టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా నిలపడం ఇరు పార్టీల క్యాడర్‌కు ఆందోళన కలిగిస్తోంది. వరంగల్‌లో బీజేపీకి బలం లేదు. కానీ తమకే […]

Advertisement
Update:2015-11-07 03:55 IST

వరంగల్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఏకపక్షంగా జరుగుతుందా అనే ప్రశ్నకు అవుననే అంటున్నాయి అక్కడ పరిస్థితులు. మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ కలిసి పయనించక పోవడం… కాంగ్రెస్‌ శ్రేణుల్లో నిరాశ అలుముకోవడం చూస్తే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు సునాయాసమనే సంకేతాలిస్తున్నాయి. ఫ్లోరిడాలో వైద్యవృత్తిలో కొనసాగుతున్న పగిడిపాటి దేవయ్యను బీజేపీ ఆఘమేఘాల మీద రప్పించి బీజేపీ- టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా నిలపడం ఇరు పార్టీల క్యాడర్‌కు ఆందోళన కలిగిస్తోంది. వరంగల్‌లో బీజేపీకి బలం లేదు. కానీ తమకే ఆ స్థానం కావాలని పట్టుబట్టి మరీ తెలుగుదేశం పార్టీని ఒప్పించి తీసుకుంది. కాని టీడీపీకి బలం ఉన్నా మిత్రపక్షం మాట కాదనలేక సీటును వదులుకుంది. అయినా అక్కడ బీజేపీ మంచి అభ్యర్థిని పెట్టిందా అంటే లేదు. నియోజకవర్గంలో ముక్కూమొగం తెలియని వ్యక్తిని తీసుకువచ్చి సీటిచ్చింది. దీంతో బీజేపీతోపాటు టీడీపీ కార్యకర్తల్లో కూడా నిరాశ అలుముకుంది. పార్టీ అభ్యర్థిని నిలపాలా? వద్దా? అన్న అంశంపై ఎర్రబెల్లి, రేవంత్ మధ్య జరిగిన వాగ్వాదం నేపథ్యంలో దేవయ్య నామినేషన్ కార్యక్రమం మినహా మిగతా కార్యక్రమాలకు ఎర్రబెల్లి దూరంగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో బలం లేని బీజేపీ.. కొద్దోగొప్పో క్యాడర్ గల టీడీపీ నేతలు ప్రచారానికి దూరం కావడం కమలనాథులను కలవరపరుస్తున్నది. అభ్యర్థి ఎంపిక నుంచే తమకు కష్టాలు మొదలయ్యాయని ఆ పార్టీ నేత ఒకరు చెప్పారు. చంద్రబాబు రావడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని… ఈ పరిస్థితులు మారాలంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రచారానికి రప్పించి ఉభయ పార్టీల శ్రేణులను క్రియాశీలం చేస్తే బావుంటుందని అంటున్నారు. ఇది జరిగే పని కాదని మరో వర్గం వాదిస్తోంది.
కాంగ్రెస్‌లో స్తబ్ధత… నిరాశ నిస్పృహలు
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన దుర్ఘటన ప్రభావం నుంచి కాంగ్రెస్ శ్రేణులు కోలుకోలేదు. వరంగల్ లోక్‌సభా స్థానానికి జరిగే ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీనిచ్చేందుకు భారీ వ్యూహాలు రూపొందించిన టీపీసీసీ ఉత్సాహం.. తాజా పరిస్థితులతో కానరావడం లేదు.ఒకరిద్దరు అసెంబ్లీ ఇన్‌చార్జీలు మినహా మిగతా నాయకులంతా ప్రచారానికి దూరంగా ఉన్నారు. సిరిసిల్ల రాజయ్య స్థానంలో అభ్యర్థిగా పోటీ చేస్తున్న సర్వే సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేసిన సమయంలో చేసిన హడావుడి ఆతర్వాత కనిపించక పోవడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నిరాశానిస్పృహలకు కారణంగా కనిపిస్తోంది. తొలుత పెద్దపల్లి మాజీ ఎంపీ జీ వివేక్ అభ్యర్థిత్వంపై జోరుగా ప్రచారం సాగినా.. రాజయ్య అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేయడంతో వివేక్ అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్న కార్యకర్తలు, నాయకులు మౌనంగా ఉంటున్నారు. ఆ తర్వాత రాజయ్య పోటీకి దూరమవడం వల్ల ఆయన పక్షం కార్యకర్తలు మౌనం దాల్చారు. ఇపుడు సర్వే సత్యనారాయణ క్రియాశీలకంగా లేకపోవడం శ్రేణుల్లో నిరాశ అలుముకుంది. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్‌ అగ్రనేతలు వరంగల్‌ వచ్చి కూర్చుంటే తప్ప పరిస్థితులు చక్కబడవని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News