వయసు పెరుగు తోందా.... పెగ్గులు తగ్గించాల్సిందే
మద్యం సేవించే అలవాటు ఉన్నవారికి వైద్యనిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. అయినా చాలామంది ఆ మాటలను అక్కడే వదిలేసి ఆల్కహాల్‌ని మాత్రం తమతో పాటు జీవితాంతం అలాగే ఉంచేసుకుంటారు. దానివలన వచ్చే ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ నిత్య ప్రహసనాలే. ఇప్పుడూ మరో హెచ్చరికను చేస్తున్నారు వైద్య నిపుణులు. ఇప్పటి వరకు తాగింది చాలు…వయసు పెరగుతున్నపుడయినా ఆ అలవాటుని కాస్త తగ్గించుకోండి లేదా ఇబ్బంది పడతారు అని వారు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్ సేవనంతో ఇంతకుముందుకంటే […]
మద్యం సేవించే అలవాటు ఉన్నవారికి వైద్యనిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. అయినా చాలామంది ఆ మాటలను అక్కడే వదిలేసి ఆల్కహాల్‌ని మాత్రం తమతో పాటు జీవితాంతం అలాగే ఉంచేసుకుంటారు. దానివలన వచ్చే ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ నిత్య ప్రహసనాలే. ఇప్పుడూ మరో హెచ్చరికను చేస్తున్నారు వైద్య నిపుణులు. ఇప్పటి వరకు తాగింది చాలు…వయసు పెరగుతున్నపుడయినా ఆ అలవాటుని కాస్త తగ్గించుకోండి లేదా ఇబ్బంది పడతారు అని వారు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్ సేవనంతో ఇంతకుముందుకంటే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతుంటే, ముఖ్యంగా దాని హ్యాంగోవర్ తట్టుకోలేనంతగా ఉంటే, ఇక మీరు పెగ్గులను తగ్గించాల్సిన టైమొచ్చిందని, అర్థం చేసుకోవాలని వారు హితవు చెబుతున్నారు.
వయసు పెరుగుతున్నకొద్దీ లివర్‌కి, మద్యం కారణంగా హానికలగకుండా తనని తాను రక్షించుకునే శక్తి తగ్గిపోతుంటుంది. జీవక్రియ (మెటబాలిజం)ల వేగం మందగించి ఆల్కహాల్ కేలరీలు ఖర్చు కావు. అది అరిగేందుకు తోడ్పడే ఎంజైమ్స్ ఉత్పత్తి సైతం తగ్గిపోతుంది. దీని వలన శరీరంలో కొవ్వు పెరిగి కండరాల సాంద్రత తగ్గుతుందంటున్నారు ముంబయికి చెందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాహుల్ టాంబే. వయసు పెరుగుతున్నపుడు అనారోగ్యాల కారణంగా మందులు తీసుకునే అవసరం పెరుగుతుంది కనుక ఆ సమయంలో ఆల్కహాల్ మెటబాలిజం తగ్గుతుంది. అలాగే శరీరం బరువు తగ్గుతున్నపుడు ఆల్కహాల్ శరీరమంతటా వ్యాపించడం అనేది కూడా తగ్గిపోతుంది. దీనివలన మరింత నిషా, హ్యాంగోవర్ పెరుగుతాయి.
ఆల్కహాల్ మెటబాలిజం తరువాత మిగిలిన పదార్థాలు లివర్లో ఎక్కువగా చేరతాయి ఇవే హ్యాంగోవర్‌కి కారణం అవుతాయని న్యూఢిల్లీకి చెందిన డాక్డర్ యోగేష్ బాత్రా అంటున్నారు.
వయసు పెరుగుతున్నపుడు మెదడులో కణాల క్షీణత మొదలవుతుంది. అప్పుడు ఆల్కహాల్ లోని విషతుల్యమైన పదార్థాలు మెదడుపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి. అలాగే ఈ వయసులో మంచినీళ్లు తాగడం తగ్గడం వలన డీహైడ్రేషన్‌కు గురికావడం, దాంతో హ్యాంగోవర్ పెరగటం కూడా జరుగుతుందని బాత్రా అంటున్నారు.
చాలా ఎక్కువమొత్తంలో, కొద్ది విరామాలతో ఎక్కువసార్లు ఆల్కహల్‌ని తీసుకోవడం మరింత హ్యాంగోవర్‌కి దారితీస్తుంది. తలనొప్పి, తలతిరగటం, వాంతులు, మగత, అలసట, చెమట్లు పట్టటం…వీటన్నింటితో పాటు మానసిక ఆందోళన, భయకంపితులై పోవడం లాంటి లక్షణాలు కూడా హ్యాంగోవర్లో కనబడతాయి.
హ్యాంగోవర్‌కి క్యూర్ ఉందా?
- మద్యం సేవనానికి ముందు, తరువాత కూడా ఎక్కువమొత్తంలో ఆహారాన్ని తీసుకోవాలి.
- ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఆల్కహాల్ సేవనానికి ముందు వెనుకా నిమ్మరసం తాగటం మంచిదని ఘజియాబాద్‌లో కొలంబియా ఆసియా హాస్పటల్లో జనరల్ ఫిజీషియన్‌గా పనిచేస్తున్న దీపక్‌వర్మ అంటున్నారు. మద్యానికి ముందు వెనుకా ఆహారం, పానీయాలు హెచ్చుమోతాదులో తీసుకోవడం వలన పొట్టలో ఇరిటేషన్ రాదు, అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
- అయితే దీనికి ఇదే పరిష్కారం అని కచ్ఛితంగా చెప్పలేము. అయితే సరిపడా ఆహారం, పానీయాలు, నిద్ర, విశ్రాంతిలతో పరిస్థితి మరీ విషమించకుండా ఉంటుంది.
- యాస్ప్రిన్ లాంటి పెయిన్ కిల్లర్స్ తలనొప్పులను తగ్గిస్తాయి కానీ, ఇవి ఎసిడిటీని పెంచుతాయి. ఇవి కాకుండా హ్యాంగోవర్‌కి వంటింటి చిట్కాల్లాంటివి చాలా ఉన్నాయి కానీ, ఒక్కోసారి ఇవి సమస్యని పరిష్కరించకపోగా మరింతగా దిగజార్చే ప్రమాదం ఉందని డాక్టర్ రాహుల్ టాంబే అంటున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉదయాన్నే ఆల్కహాల్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
- హ్యంగోవర్‌నుండి బయటపడేందుకు తిరిగి ఉదయాన్నే ఆల్కహాల్‌నే ఆశ్రయించడం అనేది, దానికి మీరు బానిసలు అయిపోయారనేందుకు నిదర్శనం అనీ, ఇక ఇలాంటి పరిస్థితి వస్తే డీ అడిక్షన్ నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
- మహిళల్లో హ్యాంగోవర్ మరింత ఎక్కువగా ఉంటుందని, ఎందుకంటే వారిలో ఆల్కహాల్ మెటబాలిజం అనేది భిన్నంగా ఉంటుందంటున్నారు గుర్‌గావ్‌కి చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రాజేష్ ముంగా. వైద్యపరిశోధకులు, నిపుణులు అంతా ఎక్కువగా, మద్యపానం అలవాటు, దానివలన వచ్చే అనారోగ్యాలు, విత్‌డ్రాయల్ సమస్యలమీద దృష్టిని పెట్టడం వలన హ్యాంగోవర్‌కి ప్రత్యేక చికిత్స అంటూ లేకుండా పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. హ్యాంగోవర్‌ని తగ్గించుకోవాలంటే తాగుడుని నియంత్రించుకోవడం ఒక్కటే మార్గమని ఆయన అన్నారు.
- బరువు తగ్గితే హ్యాంగోవర్ తగ్గుతుందనుకుంటారు చాలామంది. కానీ అది భ్రమేనని, బరువు తగ్గితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని డాక్టర్ బాత్రా హెచ్చరిస్తున్నారు.
వీటన్నింటినీ పక్కనపెడితే, హ్యాంగోవర్‌కి పరిష్కారాలు వెతుక్కోవడం కంటే ఆ అలవాటుని వదిలించుకునే ప్రయత్నాలు చేయడం ఉత్తమమనే వైద్యుల సలహా…మరింత మంచిది కదా!