మొట్టమొదటి సెక్స్ మార్పిడి సబ్ ఇన్‌స్పెక్టర్
నిన్నటివరకు ప్రదీప్ కుమార్…నేడు ప్రితీక. చెన్నైలో అబ్బాయిగా పుట్టిపెరిగిన ప్రదీప్ కుమార్, తన అంతరంగానికి అనుగుణంగా లింగమార్పిడి చేయించుకుని ప్రితీక యాషిణిగా మారిపోయాడు. కంప్యూటర్ అప్లికేషన్లలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రితీక ఇప్పుడు దేశంలోనే ఒక అరుదైన రికార్డుని సొంతం చేసుకోబోతోంది. ఆమె భారతదేశంలోనే తొలిసారి సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాబోతున్న లింగమార్పిడి వ్యక్తి. మద్రాసు హైకోర్టు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులిచ్చింది. 25 ఏళ్ల ప్రితీక సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి అన్నివిధాలుగా అర్హురాలని […]
నిన్నటివరకు ప్రదీప్ కుమార్…నేడు ప్రితీక. చెన్నైలో అబ్బాయిగా పుట్టిపెరిగిన ప్రదీప్ కుమార్, తన అంతరంగానికి అనుగుణంగా లింగమార్పిడి చేయించుకుని ప్రితీక యాషిణిగా మారిపోయాడు. కంప్యూటర్ అప్లికేషన్లలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రితీక ఇప్పుడు దేశంలోనే ఒక అరుదైన రికార్డుని సొంతం చేసుకోబోతోంది. ఆమె భారతదేశంలోనే తొలిసారి సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాబోతున్న లింగమార్పిడి వ్యక్తి. మద్రాసు హైకోర్టు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులిచ్చింది. 25 ఏళ్ల ప్రితీక సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి అన్నివిధాలుగా అర్హురాలని పేర్కొంది. అంతేకాదు ఇలాంటి ట్రాన్స్‌జెండర్స్‌ని రాష్ట్ర పోలీస్ ఫోర్స్‌లోకి తీసుకునేందుకు వీలుగా రిక్రూట్‌మెంట్ విధానాల్లో మార్పులు తేవాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది.
లింగమార్పిడి అనంతరం ప్రితీక పోలీస్ ఉద్యోగానికి అప్లయి చేసుకున్నపుడు, మొదట ఆమె అప్లికేషన్‌ని తిరస్కరించారు. ఇలాంటి వ్యక్తులకు ఈ ఉద్యోగాల్లో ఎలాంటి కోటా లేదన్నారు. అనేక మార్లు కోర్టులో పిటీషన్లు వేసిన తరువాత ఎట్టకేలకు ఆమెకు న్యాయం జరిగింది. ప్రితీక రిటన్ పరీక్ష కటాఫ్ మార్కులను 28.5 నుండి 25కి తగ్గించారు. తను అన్ని శారీరక సామర్ధ్య పరీక్షల్లోనూ పాసయ్యింది. వందమీటర్ల పరుగులో ఒక్క సెకను లేటయ్యింది. దాన్ని రిక్రూట్‌మెంట్ బోర్డు ఆమోదించింది. చివరికి కోర్టు ఉత్తర్వులతో భారతదేశపు మొట్టమొదటి సెక్స్ మార్పిడి సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాబోతోంది.
కోర్టులో కేసు గెలిచిన అనంతరం తాను ఎంతో ఉద్వేగానికి గురయినట్టుగా ప్రితీక పేర్కొంది. ఇది తమ ట్రాన్స్‌జెండర్ కమ్యునిటీకి ఒక నూతన ఆరంభమని, ఐపిఎస్ ఆఫీసర్ కావడం తన లక్ష్యమని తెలిపింది. లింగమార్పిడి వ్యక్తుల తరపున పలు కేసులు వాదించిన ప్రితీక న్యాయవాది భవానీ స్పందిస్తూ, ఈ విజయంతో మరింతమంది ట్రాన్స్‌జెండర్స్‌కి ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే వీరికి కాలేజీల్లో సీట్లను కేటాయించింది. వీరి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటోంది. మధురైలో వీరిని రోజువారీ వేతనంపై హోమ్‌గార్డులుగా తీసుకుంటున్నారు. ఎన్నో మార్పులను జీర్ణించుకుంటున్న ఆధునిక సమాజం…ట్రాన్స్‌జండర్స్‌ని సాటిమనుషులుగా స్వీకరించాలని, వారి జీవితాలు మరింత మెరుగుపడాలని ఆశిద్దాం.