ఓటేస్తారా? సంక్రాంతికి వెళ్తారా?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై క్లారిటీ వచ్చింది. ఇంతకాలం ఎప్పుడు ఎన్నికలు జరుపుతామనే దానిపై స్పష్టత ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టుకు తన వాదన వినిపించింది. జనవరి 31లోపు గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు డిసెంబర్‌లో వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు పూర్తిచేసి జనవరి 31వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఇక్కడే ఇప్పుడు కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వం జనవరి 31లోపు ఎన్నికలను పూర్తి చేస్తామని […]

Advertisement
Update:2015-11-03 06:37 IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై క్లారిటీ వచ్చింది. ఇంతకాలం ఎప్పుడు ఎన్నికలు జరుపుతామనే దానిపై స్పష్టత ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టుకు తన వాదన వినిపించింది. జనవరి 31లోపు గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు డిసెంబర్‌లో వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు పూర్తిచేసి జనవరి 31వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.

ఇక్కడే ఇప్పుడు కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వం జనవరి 31లోపు ఎన్నికలను పూర్తి చేస్తామని చెప్పడంలో పెద్ద వ్యూహం ఉందన్న అనుమానాలను కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వ్యక్తం చేస్తున్నాయి. ఎటుతిరిగి గ్రేటర్ ఎన్నికల్లో ఆంధ్రా ఓట్లు తమకు ఇబ్బంది అవుతాయని భావిస్తున్న ప్రభుత్వం వారి ఓట్లకు గండికొట్టే ప్రయత్నాలు చేస్తోందన్న వాదన బలపడుతోంది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో ఓట్ల తొలగింపుపై ప్రతిపక్షాలన్నీ ఏకమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం కొంతమంది సభ్యులను హైదరాబాద్ పంపింది.
ఇంటింటికి తిరిగి సీఈసీ బృందం ఓట్ల తొలగింపుపై విచారణ జరుపుతోంది. ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.

ఈ నేపథ్యంలో తొలగించిన ఓట్లను మళ్లీ పునరుద్ధరించాల్సి వస్తుందన్న అనుమానాల మధ్య జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకు కారణం కూడా ఉంది. జనవరి అంటే సంక్రాంతి పండుగకు ఆంధ్రా ప్రాంతం వారు పెద్ద సంఖ్యలో సొంతూర్లకు వెళ్తారు. ఆ సమయంలో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఒకవేళ నిజంగా తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ ఎన్నికలను సంక్రాంతి పండుగకు ముందో వెనకో నిర్వహిస్తే ఓటు వేసేందుకు ఇష్టపడతారా? లేక పండగకు సొంత ఊర్లకు వెళతారా? అన్నది తేల్చుకోవాల్సి వస్తుంది. అయితే మరికొందరు తెలంగాణ వాదులు మాత్రం ప్రభుత్వం అలా చేసే అవకాశం లేదంటున్నారు.

Tags:    
Advertisement

Similar News