ఉండవల్లి గుహలకు రాజధాని గ్రహణం..?
ప్రసిద్ధి చెందిన ఉండవల్లి గుహలను ప్రభుత్వ విధానాలు నాశనం చేస్తున్నాయి. ఆరు, ఏడు దశాబ్దాలకు చెందిన ఈ గుహలు శిల్పకళా సంపదకు నిలయాలు. ఇంత విశిష్ట గుహలు అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో నాశనమై పోతున్నాయి. ఈ గుహలకు నిలయమైన కొండ ప్రాంతాలను మట్టి కోసం తవ్వేస్తున్నారు. కొండల్ని తొలిచేసి సదరు మన్నును అమరావతి నగర నిర్మాణానికి ఉపయోగించాలనుకుంటున్నారు. ఇప్పటికే అమరావతికి దారి తీసే రహదారుల కోసం కొండ భాగాల్ని కొంతవరకు తొలిచేశారు. 1959 నుంచి ఈ గుహలు అర్కియాలజికల్ సర్వే […]
Advertisement
ప్రసిద్ధి చెందిన ఉండవల్లి గుహలను ప్రభుత్వ విధానాలు నాశనం చేస్తున్నాయి. ఆరు, ఏడు దశాబ్దాలకు చెందిన ఈ గుహలు శిల్పకళా సంపదకు నిలయాలు. ఇంత విశిష్ట గుహలు అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో నాశనమై పోతున్నాయి. ఈ గుహలకు నిలయమైన కొండ ప్రాంతాలను మట్టి కోసం తవ్వేస్తున్నారు. కొండల్ని తొలిచేసి సదరు మన్నును అమరావతి నగర నిర్మాణానికి ఉపయోగించాలనుకుంటున్నారు. ఇప్పటికే అమరావతికి దారి తీసే రహదారుల కోసం కొండ భాగాల్ని కొంతవరకు తొలిచేశారు. 1959 నుంచి ఈ గుహలు అర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షణలో ఉన్నాయి. ఇపుడీ గుహలున్న కొండల్ని తొలిచేయడానికి పదుల సంఖ్యలో ప్రొక్లెయిన్లను మోహరించారు. కొండ కింద భాగాల్ని మట్టి కోసం తొలిచేస్తున్న వారు ఇపుడు క్రమంగా కొండపై పనులు చేయడానికి, అక్కడి నుంచి మట్టిని కిందకి దింపడానికి వీలుగా కొండపై రహదారుల నిర్మాణానికి దారులు వేస్తున్నారు.
కొండల్ని తవ్వేసే పనులు వేగంగా జరుగుతున్నందున గుహలకు చేటు చేకూరే ప్రమాదం ఉందని, వెంటనే అర్కియాలజికల్ విభాగం దీనిపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని బీకేఎస్‌ఆర్ అయ్యంగార్ అనే సామాజిక కార్యకర్త చెబుతున్నారు. మట్టి తవ్వకాల వల్ల వస్తున్న ప్రకంపనలు కొండ కింద ఉండే గుహలకు తాకుతున్నాయని, దీనివల్ల వారసత్వ సంపదకు చేటు చేకూరే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. అర్కియాలజి విభాగం గుహల రక్షణ ఒక్కటే కాకుండా గుహల పైభాగంలో ఉన్న కొండల్ని కూడా తమ అధీనంలోకి తీసుకుని మొత్తం అంతా ఒక్క యూనిట్‌గానే చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కొండ కింది భాగం తొలిచేసినట్టు, గుహలకు నష్టం జరుగుతున్నట్టు తమకు ఫిర్యాదులు అందాయని ఆంధ్రప్రదేశ్ పురావస్తు, మ్యూజియం విభాగం డైరెక్టర్ జి.వి. రామకృష్ణ చెబుతూ ఈ అంశం తమ పరిధిలో లేనందున సదరు ఫిర్యాదును ఉండవల్లి గుహలను పరిరక్షిస్తున్న అర్కియాలజీ శాఖ అధికారులకు పంపామని తెలిపారు.
అర్కియాలజీ పరిధిలో ఉన్న ఈ గుహలున్న ప్రాంతంలో క్వారియింగ్ చేయకూడదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఈ విభాగం అధికారి ఒకరు చెప్పారు. ఈ గుహలు 8.08 ఎకరాల పరిధిలో ఉన్నాయని, అక్కడ క్వారియింగ్ చేయరాదని, గుహలున్న చుట్టుపక్కల ప్రాంతమంతా అటవీశాఖ పరిధిలోకి వస్తుందని ఆయన తెలిపారు. అయితే అటవీశాఖ పరిధిలోని ఉండవల్లి, పెనుమాక ప్రాంతాలలోని 159 హెక్టార్లను 1958లోనే అర్కియాలజీ శాఖకు అప్పగించామని గుంటూరు డివిజిన్ ఫారెస్ట్ ఆఫీసర్ కె. లోహితుడు తెలిపారు. రెండు నెలల నుంచి ఎవరి పర్యవేక్షణ లేకుండానే ఉండవల్లి గుహలున్న కొండ ప్రాంతాల్ని తొలిచేస్తున్నారని పెనుమాక వాసి బ్రహ్మారెడ్డి తెలిపారు. ప్రభుత్వమే నిబంధనలను తుంగలోకి తొక్కి గుహల్ని నాశనం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలని మరో రైతు నరేష్‌రెడ్డి అన్నారు. కొన్నేళ్ళ క్రితం తాను ఇంటి నిర్మాణం కోసం ఆ కొండల ప్రాంతంలో మట్టి తవ్వుతుంటే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని, దాంతో కృష్ణా జిల్లాలోని అగిరిపల్లి నుంచి ట్రక్కు ఐదు వేల చొప్పున చెల్లించి కొనుక్కోవలసి వచ్చిందని బ్రహ్మారెడ్డి గుర్తు చేశారు. ఉండవల్లి గుహల్లో మొత్తం 64 గుహలున్నాయి.
Advertisement