బాబు-మోది జోడిపై విమర్శలకు విపక్షాల పదును

బాబు-మోది జోడీపై విమర్శల పర్వం మొదలైంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్‌ తన విమర్శల కత్తికి పదును పెట్టారు. అలాగే కాంగ్రెస్‌ కూడా నిరసనలకు తెర తీసింది. ఇక ప్రత్యేక హోదా కోసం పాద యాత్రను చేసిన సీపీఐ నాయకుడు రామకృష్ణ తన గళానికి పదును పెట్టారు. మొత్తం మీద అన్ని పార్టీల నాయకుల్లో ఇప్పటివరకు ఉన్న సందిగ్ధత, భ్రమలు తొలగిపోయాయి. మోది వస్తారు… ఎవేవో చేసేస్తారు… అని ఎక్కడో కొంత ఉన్న నమ్మకం అనే గాలిని […]

Advertisement
Update:2015-10-22 18:31 IST

బాబు-మోది జోడీపై విమర్శల పర్వం మొదలైంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్‌ తన విమర్శల కత్తికి పదును పెట్టారు. అలాగే కాంగ్రెస్‌ కూడా నిరసనలకు తెర తీసింది. ఇక ప్రత్యేక హోదా కోసం పాద యాత్రను చేసిన సీపీఐ నాయకుడు రామకృష్ణ తన గళానికి పదును పెట్టారు. మొత్తం మీద అన్ని పార్టీల నాయకుల్లో ఇప్పటివరకు ఉన్న సందిగ్ధత, భ్రమలు తొలగిపోయాయి. మోది వస్తారు… ఎవేవో చేసేస్తారు… అని ఎక్కడో కొంత ఉన్న నమ్మకం అనే గాలిని ప్రధానమంత్రి నరేంద్రమోది స్వయంగా తీసేశారు. ఆసాంతం ఆయన ప్రసంగం అందరినీ నిరుత్సాహ పరిచింది. దీనికి కారణంగా ఎవరికి తెలిసిన విధంగా వారు విశ్లేషిస్తుంటే ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ఏపీ ప్రత్యేకహోదాను చంద్రబాబు కేంద్రం వద్ద తాకట్టుపెట్టారనడానికి మోది ప్రపంచంలోనే అత్యుత్తమ కార్యక్రమమని చెప్పుకుంటున్న రాజధాని నగర శంకుస్థాపనలో పాల్గొని కబుర్లు చెప్పి వెళ్ళి పోవడమే సాక్ష్యంగా చెబుతున్నారు. ఐదు కోట్ల ప్రజలను తన ప్రసంగంతో మోదీ నిరాశ పర్చారని, దీనికి కారణం చంద్రబాబు చేసిన పాపమని విమర్శించారు. శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని ప్రజలంతా ఆశించారని, అయితే హోదాపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ప్రజలు నిరాశ చెందారంటూ తను కూడా జనం ఆవేదనలో భాగస్వామినవుతానని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని జగన్‌ తెలిపారు.

మరోవైపు ఏపీ ప్రజల నోట్లో మోదీ మట్టి కొట్టారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా ఏపీ ప్రజల హక్కుని అన్నారు. హోదాపై ప్రకటన చేయకుండా మోదీ మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మోదీ దిష్టిబొమ్మలు దహనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నరేంద్రమోది అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిన తీరు పట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోది దిష్టిబొమ్మ దహన చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడ రూరల్‌ మండలం నున్నలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్‌ నేతల యత్నించారు. అయితే మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పద్మశ్రీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇది ఇంతటితో ముగిసేలా లేదు. మోది తన ప్రసంగంలో ప్రత్యేక హోదా విషయంగాని, ప్రత్యేక ప్యాకేజీగాని ప్రకటించకుండా ఏపీ ప్రజల ఆశలపై నీళ్ళు జల్లారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. దీనికి నిరసనగా ఉద్యమ రూపు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని ఆ పార్టీ చెబుతోంది. ఇంకోవైపు కమ్యూనిస్టు పార్టీ కూడా శుక్రవారం నుంచి ఆందోళన చేపట్టాలని భావిస్తోంది. ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, చలసాని శ్రీనివాస్‌ తదితరుల బృందం ఆందోళనకు బాట నిర్మిస్తున్నారు.

ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేసే సాహసం చేయలేని ప్రధాని కనీసం ప్రత్యేక ప్యాకేజీలయినా ప్రకటిస్తారని ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురు చూశారు. తీరా ప్రసంగం ముగిసి జైహింద్‌ చెప్పేవరకు అలాంటి మాట వినిపించక పోవడంతో అంతా నిరాశకు గురయ్యారు. అటు రాయలసీమకుగాని, ఇటు ఉత్తరాంధ్రకుగాని ఎలాంటి ప్యాకేజీలు ప్రకటించక పోవడం కూడా ఆ ప్రాంత ప్రజలను ఒకింత విస్మయానికి గురి చేసింది. తమకు అనాదిగా అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదనతో రగిలిపోతున్న ఆ ప్రాంత ప్రజలకు పుండు మీద కారం జల్లినట్టయ్యింది ప్రధానమంత్రి వైఖరి. దాంతో అటు రాయలసీమలో కూడా ఉద్యమం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయలసీమకు 50 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చి తీరాల్సిందేనని అనంతపురంలో సీపీఎం నేతలు డిమాండు చేశారు. లేకుంటే ఉద్యమం నిర్మించి తమ డిమాండ్లు సాధించుకు తీరతామని వారు హెచ్చరించారు. చంద్రబాబు కూడా అమరావతి పేరుతో కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాలపైనే ప్రేమ చూపుతూ మిగిలిన ప్రాంతాల్ని… ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్ని విస్మరించడం పట్ల ఆవేదన చెందుతున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీతోపాటు కమ్యూనిస్టు పార్టీలు కూడా ప్రత్యేక హోదాపై సమర భేరి మోగించడానికి సమాయత్తమవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News