మోదీ ప్రభ తగ్గుతోందా?
దేశంలో మోదీ హవా తగ్గుతోందా? 2014 ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేని మెజారిటీ సంపాదించి పెట్టిన మోదీ తరువాత వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ అదే దూకుడు కొనసాగించారు. కానీ, కొంతకాలంగా ఆయన హవా తగ్గుతూ వస్తోందని అంటున్నారు. విదేశీ పర్యటనలు, మీడియా ప్రచారం తప్ప పెద్దగా చేసిందేమీ లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తూ వస్తున్నాయి. 2015 ఫిబ్రవరిలో వెలువడిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో మోదీకి సంబంధం లేదని చెప్పినా.. 70 స్థానాల్లో కేవలం 3 స్థానాలకు పరిమితం చేసి…ఓటర్లు […]
Advertisement
దేశంలో మోదీ హవా తగ్గుతోందా? 2014 ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేని మెజారిటీ సంపాదించి పెట్టిన మోదీ తరువాత వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ అదే దూకుడు కొనసాగించారు. కానీ, కొంతకాలంగా ఆయన హవా తగ్గుతూ వస్తోందని అంటున్నారు. విదేశీ పర్యటనలు, మీడియా ప్రచారం తప్ప పెద్దగా చేసిందేమీ లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తూ వస్తున్నాయి. 2015 ఫిబ్రవరిలో వెలువడిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో మోదీకి సంబంధం లేదని చెప్పినా.. 70 స్థానాల్లో కేవలం 3 స్థానాలకు పరిమితం చేసి…ఓటర్లు బీజేపీని చావుదెబ్బ తీశారనడంలో సందేహం లేదు. తరువాత జరుగుతున్న బీహార్ ఎన్నికల్లోనూ పరిస్థితి అంత ఆశాజనకంగా ఏమీ లేదు. జేడీయూ – ఎన్‌డీఏ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నప్పటికీ.. బీజేపీ మిత్రపక్షాలకు విజయం ఖాయమని ఎవరూ స్పష్టం చేయడం లేదు.
ఇటీవల కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనం. సరిగ్గా ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఓడిపోయినా బీహార్ అభివృద్ధికి సహకరిస్తామంటూ.. అన్న మాటలు అంత తేలిగ్గా కొట్టిపారేయలేం! బిహార్ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ,కాంగ్రెస్‌ల లౌకిక కూటమి బొటాబొటి సీట్లతో విజయం సాధిస్తుందని హన్స రీసెర్చ్ సంస్థ సహకారంతో ‘ది వీక్’ మేగజీన్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో తేలింది. మొత్తం 243 స్థానాలకు గాను ఈ కూటమి 122 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 117 సీట్లలో విజయం సాధిస్తుందని ఈ సర్వే అంచనా వేసింది.
కారణాలు అవేనా?
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ రాజకీయాల్లో ఆర్ ఎస్ ఎస్ లాంటి హిందూ ఆధ్యాత్మిక సంస్థల జోక్యం పెరిగింది. ఇక బీజేపీ టికెట్‌పై గెలిచిన హిందూ అతివాత ఎంపీలు నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. బీజేపీకి నష్టం చేకూరుస్తూ వచ్చారు. అయితే వారందరికీ ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం ఉండటం.. వారి ముందు మోదీ చాలా జూనియర్ కావడంతో నియంత్రించలేకపోయారన్న విమర్శ ఉంది. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలోని దాద్రిలో జరిగిన సంఘటన బీజేపీ ప్రభుత్వానికి మాయని మచ్చలా తయారైంది. ఆవు మాంసం తిన్నాడన్న కారణంతో ఓ ముస్లిం వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపిన ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. దీనిపైనా మోదీ చాలా రోజుల వరకు మౌనం వహించడం సైతం పార్టీ ఇమేజీకి డ్యామేజీ కావడానికి కారణమైంది. నేటికీ సాహితీవేత్తలు దాద్రీ ఘటనపై తమ నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు. తమ రచనలకు గుర్తింపుగా సాధించిన అత్యున్నత పురస్కారాలను వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ బీహార్ ఎన్నికల్లో మోదీ పార్టీ విజయానికి ప్రతిబంధకంగా మారతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక దశ పోలింగ్ ముగిసింది. మరో 4 దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. మోదీ ప్రభుత్వంపై మేథావుల నిరసనలు ఇలాగే కొనసాగితే.. పార్టీకి నష్టం తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Advertisement