రాజధాని మాటున ఇదీ ప్రకృతి విధ్వంసం!
గ్రీన్ ఫీల్డ్ రాజధాని కడుతామని చంద్రబాబు పదేపదే చెబుతున్న వేళ గూగూల్ ఎర్త్ ఫోటోలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. చంద్రబాబు కట్టే రాజధానిలో పచ్చదనం సంగతేమో గానీ… ఇప్పటి వరకు పచ్చదనం పరిచినట్టు కనిపించిన గ్రామాలు ఎడారిని తలపిస్తున్నట్టు గూగూల్ ఎర్త్ శాటిలైట్ ఇమేజెస్ తేల్చిచెప్పాయి. సీఆర్‌డీఏ ఆవిర్భావం తర్వాత ఒక్కసారిగా ఏపీ రాజధాని ప్రాంత పరిధిలోని గ్రామాల్లో పచ్చదనం ధ్వంసమైందని స్పష్టంగా అర్థమవుతోంది. 2015 జనవరిలో తీసిన శాటిలైట్ పిక్చర్స్‌లో రాజధాని ప్రాంతాల్లోని 29 […]
గ్రీన్ ఫీల్డ్ రాజధాని కడుతామని చంద్రబాబు పదేపదే చెబుతున్న వేళ గూగూల్ ఎర్త్ ఫోటోలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. చంద్రబాబు కట్టే రాజధానిలో పచ్చదనం సంగతేమో గానీ… ఇప్పటి వరకు పచ్చదనం పరిచినట్టు కనిపించిన గ్రామాలు ఎడారిని తలపిస్తున్నట్టు గూగూల్ ఎర్త్ శాటిలైట్ ఇమేజెస్ తేల్చిచెప్పాయి.
సీఆర్‌డీఏ ఆవిర్భావం తర్వాత ఒక్కసారిగా ఏపీ రాజధాని ప్రాంత పరిధిలోని గ్రామాల్లో పచ్చదనం ధ్వంసమైందని స్పష్టంగా అర్థమవుతోంది. 2015 జనవరిలో తీసిన శాటిలైట్ పిక్చర్స్‌లో రాజధాని ప్రాంతాల్లోని 29 గ్రామాలు పచ్చదనంతో పరవశించాయి. అయితే మే నెల వచ్చే నాటికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దిగ్బ్రాంతి కలిగించేలా శాటిలైట్ చిత్రాలకు ఎక్కడా కూడా 29 గ్రామాల పరిధిలో పచ్చదనం కనిపించడం లేదు. మొత్తం అదో ఎడారి ప్రాంతంలా కనిపిస్తోంది.
ఇలా అవడానికి సీఆర్‌డీఏ ఆదేశాలే కారణం. రాజధాని గ్రామాల్లో మే 1 తర్వాత ఎవరూ పంటలు సాగు చేయడానికి వీల్లేదని ప్రభుత్వం హుకుం జారీ చేసింది. దీంతో అప్పటి నుంచి రైతులు సొంత పొలాల్లోకి అడుగు పెట్టలేని పరిస్థితి. సేద్యం సెలవు తీసుకుంది. దీనికి తోడు టేకు లాంటి చెట్లను నరికి అమ్ముకునేందుకు సీఆర్‌డీఏ అవకాశం కల్పించడంతో చాలా వృక్షాలు గొడ్డలి ధాటికి నేలకూలాయి. దీంతో చరిత్ర చూడని రీతిలో ఆ గ్రామాల్లో పచ్చదనం మాయమైపోయింది.
దశాబ్ధాలుగా ఈ గ్రామాలను చూస్తూ వచ్చిన వృద్దులు, ప్రజలు ఈ పరిస్థితిని చూసి కంటతడి పెడుతున్నారు. కానీ ఏం చేయలేక మౌనంగా రోదిస్తున్నారు. మొత్తానికి రాజధాని పేరుతో గ్రామాల్లో జరిగిన విధ్వంసాన్ని గూగూల్ ఎర్త్ కళ్లకు కట్టినట్టు చూపించింది.