ఇక ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో యూజర్‌ బాదుడు

కొత్త సంవత్సరం ఏదో ఒక కానుక ఇవ్వడం ఆనవాయితీ. పండగల కంటే ఇంగ్లీష్‌ న్యూ ఇయర్‌ ను ప్రభుత్వాలు, సంస్థలు ఘనంగా జరుపుతాయి. ప్రభుత్వాలైతే సంక్షేమ పథకాలు ప్రకటించి ప్రజల్ని సంతోషపరుస్తాయి. కంపెనీలైతే తమ ఉద్యోగులకు బోనస్‌లు, ఇంక్రిమెంట్లు ప్రకటించి ఉత్సాహపరుస్తాయి. పరిశ్రమల్లో కార్మికులకు స్వీట్లు, దుస్తులు పంచుతారు. ఈ ఆనవాయితీకి ఏపీ సీఎం చంద్రబాబు చెక్‌ పెడుతున్నారు. జనవరి నుంచి జనాన్ని బాదేందుకు సిద్ధమవుతున్నారు. దిక్కూమొక్కూ లేనివాళ్లు, కూటికి కూడా లేని నిరుపేదలు వైద్యం కోసం […]

Advertisement
Update:2015-10-13 08:59 IST

కొత్త సంవత్సరం ఏదో ఒక కానుక ఇవ్వడం ఆనవాయితీ. పండగల కంటే ఇంగ్లీష్‌ న్యూ ఇయర్‌ ను ప్రభుత్వాలు, సంస్థలు ఘనంగా జరుపుతాయి. ప్రభుత్వాలైతే సంక్షేమ పథకాలు ప్రకటించి ప్రజల్ని సంతోషపరుస్తాయి. కంపెనీలైతే తమ ఉద్యోగులకు బోనస్‌లు, ఇంక్రిమెంట్లు ప్రకటించి ఉత్సాహపరుస్తాయి. పరిశ్రమల్లో కార్మికులకు స్వీట్లు, దుస్తులు పంచుతారు. ఈ ఆనవాయితీకి ఏపీ సీఎం చంద్రబాబు చెక్‌ పెడుతున్నారు. జనవరి నుంచి జనాన్ని బాదేందుకు సిద్ధమవుతున్నారు. దిక్కూమొక్కూ లేనివాళ్లు, కూటికి కూడా లేని నిరుపేదలు వైద్యం కోసం వెళ్లే ధర్మాసుపత్రులపై బాబు కన్నుపడింది. జనవరి 1 నుంచి పల్లెల్లో ఉన్న పీహెచ్‌సీల నుంచి జిల్లాలో ఉండే ప్రధాన వైద్యశాలల వరకూ ఎక్కడ ఏ ఆస్ప్రత్రి మెట్టెక్కినా యూజర్‌ చార్జీ కట్టాల్సిందే. ఎంతో కొంత కక్కాల్సిందే. దీనికితోడు జలగల్లా పీల్చే సిబ్బంది ఉండనే ఉంటారు. ఇక ధర్మాసుపత్రులకు వెళ్లి సర్కారు బాదుడు, సిబ్బంది దోపిడీకి గురయ్యే బదులు అప్పోసప్పో చేసి ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లడం, లేదంటే దేవుడిపై భారం వేసి కాలం గడపాల్సిందేననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రైవేట్‌ వైద్యులు, ల్యాబ్‌ల సేవలు వినియోగించుకోవాలని, దీని కోసం యూజర్‌చార్జీలు వసూలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలోని వైద్యారోగ్యశాఖ సమీక్ష సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
హెల్త్‌ ఏటీఎంలు
నిరుపేదలకు తక్కువ ధరకు మందులు అందించే కొత్త పథకం ప్రవేశపెడతామని చంద్రబాబు ప్రకటించారు. ముందుగా ఎంపిక చేసిన వంద మారుమూల పల్లెల్లో హెల్త్‌ ఏటీఎంలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నిరుపేదలకు అతి తక్కువ ధరలకు ఈ ఏటీఎంల ద్వారా మందులు అందజేస్తామని సీఎం చెప్పారు. పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ప్రారంభించే ఈ హెల్త్‌ ఏటీఎంల పథకం సక్సెస్‌ అయితే .. రాష్ట్రమంతా విస్తరించే యోచనలో ఉన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్‌ సేవలు
ఇక నుంచి ప్రభుత్వ ఆస్ప్రత్రుల్లో ఉన్న సౌకర్యాలు వినియోగించుకునే అవకాశం ప్రైవేట్‌ వైద్యులకు కల్పిస్తామని, అలాగే ప్రైవేట్‌ పరికరాలు ఉపయోగించుకుని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సర్జరీలు చేయొచ్చని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవ కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేట్‌ వైద్యులు, కార్పొరేట్‌ ఆస్పత్రుల భాగస్వామ్యంతో మెరుగైన వైద్యసేవలు అందించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు.

Tags:    
Advertisement

Similar News