ఎలుకలు కాకపోతే అనకొండలుంటాయా?

ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస రావుకు మాచెడ్డ కోపం వచ్చింది. గుంటూరు  ప్రభుత్వాసుపత్రిలో  పసికందును ఎలుకలు కొరికి చంపితే…ఏదో కొంపలంటుకుపోయినట్లు ప్రతిపక్ష వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నానా యాగీ చేస్తోందని కామినేని రగిలిపోయారు. అయినా ఆసుపత్రి అన్నాక ఆ మాత్రం ఎలుకలు ..బొద్దింకలు ఉండవా అని ఆయన ప్రశ్నించారు. నిజమే ఆసుపత్రుల్లో అనకొండలను పెంచడం  సాధ్యం కాదు కదా. ఎలుకలయితే వాటి ఆహారాన్ని అవే చూసుకుంటాయి కాబట్టి ప్రభుత్వాలపై బర్డెన్ కూడా పడదు. అనకొండలో..పెద్ద పులుల్నో పెంచాలంటే  వాటి తిండికే […]

Advertisement
Update:2015-10-12 04:04 IST

ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస రావుకు మాచెడ్డ కోపం వచ్చింది.

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పసికందును ఎలుకలు కొరికి చంపితే…ఏదో కొంపలంటుకుపోయినట్లు ప్రతిపక్ష వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నానా యాగీ చేస్తోందని కామినేని రగిలిపోయారు.

అయినా ఆసుపత్రి అన్నాక ఆ మాత్రం ఎలుకలు ..బొద్దింకలు ఉండవా అని ఆయన ప్రశ్నించారు.

నిజమే ఆసుపత్రుల్లో అనకొండలను పెంచడం సాధ్యం కాదు కదా.

ఎలుకలయితే వాటి ఆహారాన్ని అవే చూసుకుంటాయి కాబట్టి ప్రభుత్వాలపై బర్డెన్ కూడా పడదు.

అనకొండలో..పెద్ద పులుల్నో పెంచాలంటే వాటి తిండికే బోలెడు ఖర్చవుతుంది.

ఈ మాత్రం చిన్న విషయం కూడా అర్ధం చేసుకోకుండా ప్రతిపక్షాలు యాగీ చేయడాన్ని నేను కూడా తప్పు పడుతున్నాను.

అంతే కాదు కామినేని ఇంకో ప్రశ్న కూడా వేశారు.

ఏం మన ఇళ్లల్లో ఎలుకలు..బొద్దింకలు ఉండవా?

అలాగే ఆసుపత్రుల్లోనూ ఉంటాయి.

అంత మాత్రాన అరిచేయడమేనా?

ఎలుకలను ..బొద్దింకలను నివారించడమంటే మాటలా? అసలు వాటిని అదుపు చేయగలమా? అని కూడా కామినేని నిలదీశారు.

కామినేని చాలా సౌమ్యుడు కాబట్టి పాపం అలా అడిగారు కానీ..అదే మిగతా టిడిపి మంత్రులయితేనా..ఎలుకలను కాకపోతే..మొసళ్లను పెంచుతాం..అడగడానికి ప్రతిపక్షానికి ఏం అర్హత ఉందని దబాయించేవారు.

పుష్కరాల్లో జనాన్ని తొక్కిసలాటలో చంపేసినట్లు..

ఆసుపత్రుల్లో పిల్లల్ని ఎలుకల చేత..

బయట కుక్కల చేత కరిపించి చంపించేస్తాం..అడగడానికి మీకేం హక్కు ఉందని కూడా మంత్రులు నిలదీయగలరు.

అయినా పుట్టిన వాడి ఆయుష్సు ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు.

దాన్నే అతని నుదుటిపై తనకు మాత్రమే అర్ధమయ్యే బ్రహ్మలిపిలో రాస్తాడు.

ఆయుష్షు తీరిన వాళ్లు పోతారు.

ఉన్నవాళ్లు పుష్కర తొక్కిసలాటలో పడిపోయినా బతికి బట్టకడతారు.

చెప్పొచ్చేదేంటంటే…

ప్రజల ప్రాణాలు పోవడానికే ఉంటాయి.

అంచేత ప్రాణాలనేవి శాశ్వతంగా ఉండిపోవు.

వాటి మీద అనవసరంగా ప్రేమానురాగాలు పెంచుకుని..అవి పోయాయని చెప్పి నానా యాగీ చేసి ప్రభుత్వంలో ఉన్నవాళ్లని ఇబ్బంది పెట్టద్దనేది నా విన్నపం.

ఎలుకలు..కుక్కలు..లేదంటే ఎన్ కౌంటర్లలో చంపేయడానికి పోలీసులు..అంతా కూడా భూమ్మీద మనుష్యుల పాప పుణ్యాల ఫలాలను బట్టి ఎవరికి ఏమివ్వాలో ఇవ్వడానికే ఉన్నారని కామినేని వారి ఫిలాసఫీ అని నాకు అర్ధమవుతోంది.

అంచేత ఇకపై అంతా కామినేని తత్వశాస్త్రాన్ని అనుసరిస్తే ఎవరికీ ఎలాంటి బాధలూ..కోపాలు ఉండవు మరి.

-కవి కాకి

Tags:    
Advertisement

Similar News