జగన్ బాధ్యత పోలీసులకే అప్పగింత!
ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి ఆరు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసలు పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష నేత స్థాయిలో ఉండి ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవలసిన బాధ్యత ప్రభుత్వాధినేతగా చంద్రబాబుకు ఉన్నప్పటికీ ఆ బాధ్యతను ఆయన నిర్వర్తించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన పేరుతో ఆయన చాలా బిజీబిజీగా ఉన్నట్టు కనిపిస్తూ జగన్ దీక్ష పట్టనట్టు […]
ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి ఆరు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసలు పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష నేత స్థాయిలో ఉండి ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవలసిన బాధ్యత ప్రభుత్వాధినేతగా చంద్రబాబుకు ఉన్నప్పటికీ ఆ బాధ్యతను ఆయన నిర్వర్తించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన పేరుతో ఆయన చాలా బిజీబిజీగా ఉన్నట్టు కనిపిస్తూ జగన్ దీక్ష పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు మంత్రులు ఆయన దృష్టికి తీసుకువెళ్ళి ఏం చేయమంటారంటూ ప్రస్తావించినా… మీరెందుకు కంగారు పడతారు? ఆ విషయం పోలీసులు చూసుకుంటారని ఆయన ముక్తసరిగా జవాబు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా… వ్యవహరిస్తూ జగన్ దీక్ష ప్రభావాన్ని తగ్గించాలని మాత్రం ఆయన సూచించినట్టు చెబుతున్నారు. ఇపుడు మంత్రులపై జగన్ దీక్ష బాధ్యత పడింది. అయితే వారు కూడా జగన్‌పై విమర్శలు గుప్పించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. క్రమం తప్పకుండా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని మాత్రం కామినేని ఆదేశించి చేతులు దులుపుకున్నట్టు తెలుస్తోంది. అయితే జగన్ దీక్షకు పవిత్రత లేకుండా చేయడానికి వైద్యశాఖను కూడా ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు మొదలయ్యాయి. ఈ విషయం వైద్య పరీక్షతో ముడిపెట్టి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎత్తి చూపుతున్నారు.
ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ముందు చేసినప్పటి కన్నా రెండోసారి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు బ్లడ్ షుగర్ లేవెల్‌లో మార్పులు వచ్చాయని, ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందని ప్రచారం మొదలుపెట్టారు. దాంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళి అక్కడున్న ఇన్‌ఛార్జి సూపరింటెండెట్‌ను నిలదీశారు. ఆయన సరైన సమాధానం చెప్పకపోవడంతో ప్రభుత్వ వైఖరిని దునుమాడుతూ మీడియా సమావేశం పెట్టి జగన్ ఆరోగ్య పరిస్థితిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తెలియజేశారు. తాము కూడా ఆరోగ్య పరీక్షలు చేసే పరికరాలతో పరీక్షలు జరిపామని, ప్రభుత్వం నిర్వహించిన దానికి మాకు తేడా కనిపించిందని తెలిపారు. అసలు జగన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరోగ్యపరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఆ వివరాలు మీడియాకు ఎందుకు తెలియజేయడం లేదని నిలదీశారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి పరీక్షలు నిర్వహించినప్పుడల్లా వైద్య బులెటిన్ విడుదల చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి కామినేని ఆదేశించారు.
ఇదంతా ఎందుకు జరుగుతుందన్న దానికి కారణం లేకపోలేదు. ఇలా క్రమంగా జగన్ ఆరోగ్య పరిస్థితిపై అపోహలు సృష్టించి దీక్ష శిబిరాన్ని ఎత్తివేసేలా తెర వెనుక ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు కామినేని, ప్రత్తిపాటి పుల్లారావులు జగన్ నిరాహారదీక్ష శిబిరాన్ని ఎత్తివేయడానికి కావలసిన వాతావరణం సృష్టించడానికి పోలీసులకు వీలు కల్పించేలా వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం తల్లి విజయమ్మ జగన్‌ను పరామర్శించగా, ఆ తర్వాత భార్య భారతి జగన్ వద్దకు వచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించక పోవడంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్రం దృష్టికి జగన్ దీక్ష విషయాన్ని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు బలవంతంగా దీక్ష శిబిరాన్ని ఎత్తివేయకుండా ఎలా వ్యవహరించాలన్న దానిపై ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, రామకృష్ణారెడ్డి తదితరులు వ్యూహానికి పదును పెడుతున్నారు. జగన్‌ను సందర్శించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నందున ఎక్కువ మంది దీక్ష శిబిరంలోనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు జగన్ దీక్ష విరమించనని భీష్మించడం… దాన్ని కొనసాగించేందుకు ఓవైపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దీక్షను ఎలాగైనా ఎత్తివేయాలని అధికారపక్షం నాయకులు… ఎవరికివారు వ్యూహరచనలో నిమగ్నమయ్యారు.