నింగి నుంచి నేలకు దిగిన జగన్

మనిషికి తోటి మనిషి చెప్పే పాఠం కన్నా కాలం నేర్పే గుణపాఠమే శక్తివంతంగా పనిచేస్తుంది. ఎదురు దెబ్బలు ఎరుగని వ్యక్తి ఎదుటి వారి విలువ కూడా కనిపెట్టలేడు. ఈ విషయం ప్రతిపక్ష నేత జగన్‌కు కొద్దివరకు వర్తిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్‌లో ఊహించని మార్పు కనిపిస్తోందని ఆయనను దగ్గరగా గమనిస్తున్న వారి మాట. కష్టమైనా నష్టమైనా మొన్నటి ఓటమి ద్వారా జగన్‌ అనేక విషయాల్లో పరిపక్వత సాధిస్తున్నారని చెబుతున్నారు. అందుకు ఉదాహరణలు అన్నట్టుగా ఎన్నికలకు […]

Advertisement
Update:2015-10-11 03:31 IST

మనిషికి తోటి మనిషి చెప్పే పాఠం కన్నా కాలం నేర్పే గుణపాఠమే శక్తివంతంగా పనిచేస్తుంది. ఎదురు దెబ్బలు ఎరుగని వ్యక్తి ఎదుటి వారి విలువ కూడా కనిపెట్టలేడు. ఈ విషయం ప్రతిపక్ష నేత జగన్‌కు కొద్దివరకు వర్తిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్‌లో ఊహించని మార్పు కనిపిస్తోందని ఆయనను దగ్గరగా గమనిస్తున్న వారి మాట. కష్టమైనా నష్టమైనా మొన్నటి ఓటమి ద్వారా జగన్‌ అనేక విషయాల్లో పరిపక్వత సాధిస్తున్నారని చెబుతున్నారు. అందుకు ఉదాహరణలు అన్నట్టుగా ఎన్నికలకు ముందు జగన్ వ్యవహరించిన తీరుకు… ఎన్నికల తర్వాత ఆయన ప్రవర్తనను పోల్చి చూస్తున్నారు.

ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత అందరినీ కలుపుకుపోయే తత్వం జగన్‌లో పెరిగిందట. ఎన్నికల ముందు పార్టీలో చేరుతామని అనంతపురంజిల్లాకు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత, కర్నూలు జిల్లాకు చెందిన ఓ పారిశ్రామిక వేత్త, నెల్లూరుకు చెందిన ఓ రాజకీయ కుటుంబం జగన్‌ను సంప్రదించిందని చెబుతుంటారు. అయితే ఎవరి సాయం లేకుండానే గెలుస్తానన్న ధీమాతో జగన్ వారిని పెద్దగా లెక్కపెట్టలేదని చెబుతుంటారు. వీరే కాదు చాలా మంది నేతలు సంప్రదించినా సున్నితంగానే వారిని తిరస్కరించారట జగన్.

సీపీఎం కూడా పొత్తుకు ప్రయత్నించినా జగన్ మాత్రం ఆ పార్టీతో పొత్తును ఖమ్మం జిల్లాకు పరిమితం చేశారు. ఒంటిరిగానే గెలువబోతున్నామన్న ధీమాతోనే జగన్ అలా చేశారని చెబుతున్నారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ తీరులో భారీగా మార్పు వచ్చిందని అంటున్నారు. బొత్స సత్యనారాయణను పార్టీలో చేర్చుకోవడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే ఆందోళనల్లో వామపక్షాలతో మైత్రినడపడం వంటివన్నీ జగన్‌కు ఓటమి నేర్పిన గుణపాఠమేనంటున్నారు.

లాజిక్కులు బాగా మాట్లాడే ఓ కాంగ్రెస్ మాజీ ఎంపీని కూడా జగన్ లైన్‌లోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఇలా టీడీపీ వ్యతిరేకశక్తులన్నింటిని అహం వీడి జగన్ కూడగడుతున్నారని అంటున్నారు. రామోజీరావును నేరుగా వెళ్లి కలవడం కూడా జగన్‌లో మార్పుకు తాజా నిదర్శనం అంటున్నారు.

ప్రత్యేక హోదా కోసం నిరవధిక దీక్ష చేస్తున్న జగన్‌కు సీపీఎం ఏపీ కార్యదర్శి మధు దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు ప్రకటించిన వేళ జగన్‌లో మార్పుపై నేతలు ప్రైవేట్ సంభాషణల్లో చర్చించుకున్నారు. బహుశా మొన్నటి ఎన్నికల్లో గెలిచి ఉంటే జగన్ అహంకారిగా మిగిలిపోయేవాడేమోనని… కానీ ఓటమి వల్ల ఒక పరిపూర్ణనాయకుడిగా ఎదిగే అవకాశం ఇప్పుడు దక్కిందంటున్నారు. ఇలా నాయకులను కలుపుకుంటూ పోతే రాబోయే ఎన్నికల్లో గెలుపు పెద్ద కష్టమేమీ కాదని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News