కేసీఆర్ దెబ్బ.... ప్రతిపక్షాలు అబ్బా!

తెలంగాణలో విపక్షాలన్నీ కలిసికట్టుగా కేసీఆర్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించాయి. ఈ ప్రయత్నంలో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ రాజకీయ పరిణామం ఎవరికి అంతిమంగా లాభం చేకూరుస్తుందన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాల ఐక్యత ఏ స్థాయికి చేరిందంటే పార్టీల సిద్ధాంతాలు, పాత శత్రుత్వాలు అన్నింటికి నీళ్లొదిలేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉప్పు నిప్పులా ఉండే కాంగ్రెస్, బీజేపీలు కూడా కలిసిపోయాయి. అదేదో మాట మద్దతుగా కాదు. సోమవారం అసెంబ్లీ నుంచి విపక్షాల సస్పెన్షన్ తర్వాత […]

Advertisement
Update:2015-10-06 05:44 IST

తెలంగాణలో విపక్షాలన్నీ కలిసికట్టుగా కేసీఆర్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించాయి. ఈ ప్రయత్నంలో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ రాజకీయ పరిణామం ఎవరికి అంతిమంగా లాభం చేకూరుస్తుందన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విపక్షాల ఐక్యత ఏ స్థాయికి చేరిందంటే పార్టీల సిద్ధాంతాలు, పాత శత్రుత్వాలు అన్నింటికి నీళ్లొదిలేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉప్పు నిప్పులా ఉండే కాంగ్రెస్, బీజేపీలు కూడా కలిసిపోయాయి. అదేదో మాట మద్దతుగా కాదు. సోమవారం అసెంబ్లీ నుంచి విపక్షాల సస్పెన్షన్ తర్వాత సీఎల్పీనేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి నేరుగా బీజేపీ పక్ష కార్యాలయానికి వెళ్లి అక్కడే సిట్టింగ్ వేశారు. ఈ పరిణామాన్ని అన్ని పార్టీల నేతలు ఆసక్తిగా గమనించారు.

ప్రధాన ప్రతిపక్షంగా విపక్షాలను కలుపుకుపోవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌పై ఉంటుందని… కానీ ఇలా ఏకంగా బీజేపీ కార్యాలయంలోకి సీఎల్పీ నేత, పీసీసీ చీఫ్ వెళ్లడం మాత్రం ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు. కేసీఆర్ బలానికి, ప్రధాన ప్రతిపక్షం బలహీనతకు ఈ ఘటన అద్దంపడుతోందని కొందరు ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి ప్రధాన ప్రతిపక్షమైన తమ పార్టీకి పోరాడే దమ్ములేకనే ఇలా బద్దశత్రువులైన బీజేపీతోనూ స్నేహం చేయాల్సి వస్తోందని కాంగ్రెస్ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామగ్రామాన కాంగ్రెస్‌కు కేడర్ ఉందని దాన్ని సరైన రీతిలో నడిపించగలిగితే ఏ పార్టీ మద్దతు లేకుండానే కేసీఆర్‌ను ఏ స్థాయిలో కావాలన్న ఢీకొట్టవచ్చంటున్నారు. పార్టీని నడుపుతున్న నేతలకు ఆశక్తి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు.

అటు టీడీపీది కూడా ఇదే పరిస్థితి. 2019 ఎన్నికల్లో తెలంగాణలోనూ తమదే అధికారమని చెబుతున్న టీడీపీ కూడా సొంతంగా పోరాడలేక చేతులెత్తేస్తోంది. కాంగ్రెస్‌ను పెద్దన్నగా గుర్తించేందుకు కూడా సిద్ధపడింది. కాంగ్రెస్, టీడీపీ, ఇతర విపక్షాలు కేసీఆర్‌ను చీల్చి చెండాతుతామంటూనే తన బలహీనలతను బయటపెట్టుకుంటున్నట్టుగా ఉంది.

ఇలా తెలంగాణలో ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా సొంతంగా కేసీఆర్‌ను ఢీకొట్టలేని పరిస్థితి వచ్చిందంటున్నారు. ప్రతిపక్షాలన్ని గుంపుగా మారడం ద్వారా కేసీఆర్ ఓ బలమైన లీడర్ అన్న అభిప్రాయం ప్రజల్లో మరింత అధికమయ్యేలా చేస్తున్నారని నేతలు అభిప్రాయపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News