తెలంగాణలో టీటీడీపీ తురుపుముక్క రేవంత్‌?

తన పరోక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఎవరు ధీటుగా ఎదుర్కోగలరు… అనే ఆలోచనకు చంద్రబాబుకు తట్టిన ఒకే ఒక పేరు రేవంత్‌ రెడ్డి. తను కష్టాల్లో ఉన్నా తనను కష్టపెట్టకుండా… ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలులో గడుపుతున్న సమయంలో కూడా తన పేరును ఏ మాత్రం బయటపెట్టకుండా నెట్టుకొస్తున్న మొనగాడిగా రేవంత్‌ ఆయనకు కనిపిస్తున్నారు. రేవంత్‌ మీద ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నా ఏ మాత్రం ధైర్యాన్ని వీడకుండా ప్రత్యారోపణలతో సమాధానం చెబుతున్న నాయకుడిగా చంద్రబాబు […]

Advertisement
Update:2015-09-27 11:30 IST
తన పరోక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఎవరు ధీటుగా ఎదుర్కోగలరు… అనే ఆలోచనకు చంద్రబాబుకు తట్టిన ఒకే ఒక పేరు రేవంత్‌ రెడ్డి. తను కష్టాల్లో ఉన్నా తనను కష్టపెట్టకుండా… ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలులో గడుపుతున్న సమయంలో కూడా తన పేరును ఏ మాత్రం బయటపెట్టకుండా నెట్టుకొస్తున్న మొనగాడిగా రేవంత్‌ ఆయనకు కనిపిస్తున్నారు. రేవంత్‌ మీద ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నా ఏ మాత్రం ధైర్యాన్ని వీడకుండా ప్రత్యారోపణలతో సమాధానం చెబుతున్న నాయకుడిగా చంద్రబాబు వద్ద మంచి పేరు కొట్టేశారు ఆయన. అందుకే రేవంత్‌కు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి తాను గైడ్‌ చేయాలనుకుంటున్నారు చంద్రబాబు.
తెలుగు రాష్ట్రాల రెండింటికీ అధ్యక్షులను పెట్టాలనుకుంటున్న చంద్రబాబుకు ఎవరిని ఆ పదవుల్లో ప్రతిష్టాలన్న విషయంలో కొంత క్లారిటీ లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు పార్టీ అధ్యక్షుడిగా దాదాపు కళా వెంకటరావు పేరు ఖరారయినట్టే. చంద్రబాబు కళా పేరుకు ఆమోదముద్ర వేశారని చెబుతున్నారు. ఒకటి రెండు పేర్లు ఇంకా పరిశీలనకు వచ్చినా ఆయనే సరైన నాయకుడని చంద్రబాబు భావిస్తున్నారు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ ముగ్గురు కూడా పార్టీ పరంగా మంచి నాయకులే. ఎర్రబెల్లి దయాకరరావు, ఎల్‌.రమణ, రేవంత్‌రెడ్డి. నాలుగో పేరు కూడా ఓ దశలో పరిశీలనకు వచ్చింది. దళిత వర్గానికి ప్రతినిధిగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు కూడా ఈ రేసులో ఉన్నట్టు వార్తలొచ్చినా చంద్రబాబు ఆదిలోనే దానికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టినట్టు తెలిసింది. ఎర్రబెల్లి ఇప్పటికే శాసనసభ పక్ష నేతగా ఉన్నందున మళ్ళీ ఆయనకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టే యోచన సరైంది కాదని పార్టీలోని కొంతమంది చెప్పడంతో బాబు కూడా ఏకీభవించారని చెబుతున్నారు. ఇక పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా తెలంగాణలో పార్టీని భుజాన వేసుకుని రెండుసార్లు కన్వీనర్‌గా ఉన్న ఎల్‌. రమణ వివాద రహితుడనే పేరుంది. అందుకే ఆయన్ని పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో ఉంచి రేవంత్‌ను క్రియాశీలంగా ఉంచాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది.
రమణను తెలంగాణ పార్టీ సారధిగా నియమించి రేవంత్‌రెడ్డిని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉంచాలని చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు. వాగ్దాటి ఉన్న రేవంత్‌ పార్టీ గళాన్ని బాగా వినిపించడమే కాక టీఆర్‌ఎస్‌కు పక్కలో బల్లెంగా మారతారని చంద్రబాబు భావిస్తున్నారు. రేవంత్‌ మొండి వైఖరి కారణంగా పార్టీ తెలంగాణలో బతికి బట్టకట్టే అవకాశం ఉందని, ఇంకెవరినీ ఈ పదవిలో నియమించినా వారు తగిన న్యాయం చేయలేరని అంటున్నారు. ఒకదశలో రేవంత్‌రెడ్డికి అధ్యక్ష స్థానం ఖరారైనట్టేనని వార్తలు వచ్చినా చంద్రబాబు వెనక్కి తగ్గారు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. రేవంత్‌కి ఈ బాధ్యతలు కట్టబెట్టడం ఎర్రబెల్లికి ఏ మాత్రం ఇష్టం లేదు. పైగా రేవంత్‌కు ఎర్రబెల్లికి మొదటి నుంచి పెద్దగా మంచి సంబంధాలు లేవు. ఇప్పటికే ఎర్రబెల్లికి టీఆర్‌ఎస్‌ గాలం వేస్తోంది. ఆయనపై ఆకర్ష మంత్రం ప్రయోగించే పనిలో ఉంది. రేవంత్‌కు ఈ అధ్యక్ష పదవి కట్టబెడితే ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లోకి వెళ్ళడానికి పరోక్షంగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టేనని చంద్రబాబు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు రేవంత్‌కు కార్యనిర్వాహక పదవిని ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా రేవంత్‌ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు. కాంగ్రెస్‌ పార్టీలోని ఆ సామాజిక వర్గాన్ని టీఆర్‌ఎస్‌ టార్గెట్‌ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో రేవంత్‌ను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంచితే అది తెలంగాణలో పార్టీకి మరింత లాభం చేకూరుస్తుందని అధినేత భావిస్తున్నారు.
– పీఆర్‌ చెన్ను
Tags:    
Advertisement

Similar News