ప్రత్యేక హోదా అంటే ఇదా?
ప్రత్యేక హోదా చాక్లెట్ కాదు..బిస్కెట్ అంత కంటే కాదు.. అడిగిన వెంటనే ఇచ్చేయడానికి అంటారో కేంద్రమంత్రి. అయితే ఆయన దృష్టిలో ప్రత్యేక హోదా అంటే ఏంటి? స‌్పెషల్ స్టేటస్ అంటే జిందా తిలిస్మాత్ కాదన్నారు ఏపీ స్పీకర్. మరి కోడెల భాషలో ప్రత్యేక హోదాకు నిర్వచనం ఏంటి? ప‌్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్ మాత్రమే అంటారు బీజేపీ నేతలు. ప్రత్యేక హోదా అపరసంజీవిని కాదంటారు ఏపీ సీఎం చంద్రబాబు. మరి విభజన సమయంలో కేంద్రంలోని పాలక, […]
ప్రత్యేక హోదా చాక్లెట్ కాదు..బిస్కెట్ అంత కంటే కాదు.. అడిగిన వెంటనే ఇచ్చేయడానికి అంటారో కేంద్రమంత్రి. అయితే ఆయన దృష్టిలో ప్రత్యేక హోదా అంటే ఏంటి? స‌్పెషల్ స్టేటస్ అంటే జిందా తిలిస్మాత్ కాదన్నారు ఏపీ స్పీకర్. మరి కోడెల భాషలో ప్రత్యేక హోదాకు నిర్వచనం ఏంటి? ప‌్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్ మాత్రమే అంటారు బీజేపీ నేతలు. ప్రత్యేక హోదా అపరసంజీవిని కాదంటారు ఏపీ సీఎం చంద్రబాబు. మరి విభజన సమయంలో కేంద్రంలోని పాలక, ప్రతిపక్షం పట్టుబట్టి మరీ ఏపీ ప్రత్యేక హోదా ఇస్తామన్నాయి ఎందుకు? ఇంతకీ ప్రత్యేక హోదా అంటే ఏంటి?
ప్రత్యేక డ్రామా మొదలైంది ఇలా..
రాష్ర్ట విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని అప్పటి రాజ్యసభసభ్యుడు వెంకయ్యనాయుడు బల్లగుద్దీ మరీ డిమాండ్ చేశారు. నాటి ప్రధాని కూడా మౌనం అంగీకారంగా ప్రత్యేక హోదాకు ఒప్పుకున్నారు. ఏపీ, తెలంగాణ వేరయ్యాయి. అధికారపక్షానికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. ప్రతిపక్షం పాలక పక్షమైంది. ఏడాదిన్నర పాలన కూడా సాగిపోయింది. అయితే ప్రత్యేక హోదా ఇస్తారా? ఇవ్వరా? అనేది స్పష్టం కాలేదు. సాంకేతిక కారణాలు, ఇతర రాష్ర్టాల అభ్యంతరాలు, 14వ ఆర్థికసంఘం సిఫార్సు చేయలేదని, ప్రణాళికసంఘం రద్దయ్యిందని కారణాలు చెబుతున్నా..ఇచ్చేందుకు ఇష్టంలేకే ఈ సాకులన్నీ అని స్పష్టమవుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ ఎంపీలు, నాయకులు ప్రత్యేక హోదాను రకరకాలుగా నిర్వచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి? అనే సందేహాలు సీమాంధ్రుల్లో నెలకొన్నాయి.
అపర సంజీవిని కాదు-బాబు ప్రవచనం
ఆంధ్రప్రదేశ్ ను ఆదుకునేందుకు ప్రత్యేక హోదా ఒక్కటే అపర సంజీవిని కాదని గతంలోనే సెలవిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ప్రత్యేక హోదా ఇచ్చి, నిధులు, సంస్థలు వదులుకోవాలా అంటూ బాబు ఎదురు ప్రశ్నించారు. మరి ప్రత్యేక హోదా కోసమే ప్రధానిని మోదీని కలుస్తున్నా..ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని బాబు ఎందుకు ప్రకటించారో మరి.
జిందా తిలిస్మాత్ కాదు-కోడెల ఉవాచ
”ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుందని అనుకోకూడదు. ప్రత్యేక హోదాపై పోరాటాలు, రాజకీయాలు అనవసరం.. ప్రత్యేక హోదా అన్ని సమస్యలను పరిష్కరించే ఒకే ఒక్క ఔషధం జిందా తిలిస్మాత్ లాంటిది కాదని ఇటీవల ఓ సమావేశంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా అంశాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తమ స్వార్థ రాజకీయాలకు ఇదే అంశాన్ని పలుమార్లు ప్రస్తావిస్తూ ఏపీ అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నారని కోడెల ఆగ్రహం వ్యక్తం చేశారు.
చాక్లెట్, బిస్కెట్ కాదట-సుజనోపాఖ్యానం
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక హోదాపై వస్తున్న డిమాండ్లపై కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి భిన్నంగా స్పందించారు. ఏపీని చిన్నపిల్లాడితో పోల్చుతూ..ప్రత్యేక హోదాను చాక్లెట్, బిస్కెట్‌లతో పోల్చారు. ప్రత్యేక హోదా అడిగితే ఇచ్చేయడానికి .. చిన్న పిల్లాడు చాక్లెట్ అడిగాడు.. బిస్కెట్ అడిగాడు అని ఇవ్వగలిగింది కాదు. అని సరికొత్త భాష్యం చెప్పారు సుజనా.
ప్రత్యేక హోదాపై ఇంత మంది నేతలు ఇన్నిరకాల భాష్యాలు చెప్పిన తరువాత ఇంతకీ ప్రత్యేక హోదా అంటే ఏంటి? అనేది సామాన్యుడికి సందేహంగా మారింది. ప్రత్యేక హోదాపై ప్రత్యేకంగా ఓ నిర్వచనం వచ్చేంత వరకూ బీజేపీ..దాని మిత్రపక్షమైన టీడీపీ నేతలు తమకు తోచిన రీతిలో అపరసంజీవిని కాదు, జిందా తిలిస్మాత్ కాదు, చాక్లెట్ కాదు, బిస్కెట్ కాదని సెలవిస్తుంటారు. ఇంతకీ వీరికైనా తెలుసా ప్రత్యేక హోదా అంటే ఏంటో?