మము కావరా! లోకేశ్వరా!
మము బ్రోవమని చెప్పు బాబు! లోకేశ్ బాబుకు..మము కావరా లోకేశ్వరా! అంటూ లయబద్దంగా, శ్రుతిబద్ధంగా నాయకులు పాడుతున్న పాటలు ఆంధ్రప్రదేశ్ అంతటా మారుమోగుతున్నాయి. ఎవరీ లోకేశ్? ఎందుకింత ఫాలోయింగ్ అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముద్దుల తనయుడు. చంద్రబాబు ఆస్తి, అంతస్తు, హెరిటేజ్, రాజకీయ వారసుడు లోకేశ్ బాబు. మీడియా మేనేజ్‌మెంట్ నిపుణుడు, అపర రాజకీయ చాణుక్యుడు, విజన్ ఉన్నపాలకుడు అయిన చంద్రబాబు తీసుకునే నిర్ణయాల వెనుక చినబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని కేడర్ నుంచి లీడర్ వరకూ […]
మము బ్రోవమని చెప్పు బాబు! లోకేశ్ బాబుకు..మము కావరా లోకేశ్వరా! అంటూ లయబద్దంగా, శ్రుతిబద్ధంగా నాయకులు పాడుతున్న పాటలు ఆంధ్రప్రదేశ్ అంతటా మారుమోగుతున్నాయి. ఎవరీ లోకేశ్? ఎందుకింత ఫాలోయింగ్ అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముద్దుల తనయుడు. చంద్రబాబు ఆస్తి, అంతస్తు, హెరిటేజ్, రాజకీయ వారసుడు లోకేశ్ బాబు. మీడియా మేనేజ్‌మెంట్ నిపుణుడు, అపర రాజకీయ చాణుక్యుడు, విజన్ ఉన్నపాలకుడు అయిన చంద్రబాబు తీసుకునే నిర్ణయాల వెనుక చినబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని కేడర్ నుంచి లీడర్ వరకూ సంకేతాలు అందాయి. దీంతో అందరూ లోకేశ్ ప్రభుభక్తి గీతాలు ఆలపిస్తున్నారు.
అధికారం, అనుభవం లేకపోయినా..
నారా లోకేశ్. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి కాదు. ప్రజల్ని ఆదుకుంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్తా కాదు. యువతను మేల్కొలిపే నాయకుడు కాదు. జాతి తరఫున పోరాడే సమరయోధుడూ కాదు. కానీ వీటన్నింటికీ అతీతమైన పదవి లోకేశ్ సొంతం. అదే సీఎం కొడుకు. ఇదే అధికారంతో మంత్రులపై, అధికారయంత్రాంగంపై పెత్తనం చెలాయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరూ ఎన్నుకోకపోయినా, తనకు తానుగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ గా ఎన్నికైపోయారు చినబాబు. నిధి ఎక్కడ నుంచి వస్తుంది. ఆ నిధి ఎవరికి అందజేస్తున్నారనేది పక్కనబెడితే..ఇదే హోదాతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. సచివాలయంలో హవా సాగిస్తున్నారు. మంత్రుల పేషీలపై కూడా నిఘానేత్రం వేశారనే ఆరోపణలు ఉన్నాయి.
కేఈతో ఆరంభం
బాబు కేబినెట్‌లో డిప్యూటీ సీఎం కేఈతో లోకేశ్‌కు అస్సలు పడటంలేదట. ఇది ఏ స్థాయికి చేరిందంటే..నేడో రేపో కేఈని బయటకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. చినబాబు ఆగ్రహానికి కారణం కూడా ఉందట. ఏపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కేఈకి పీఎస్‌లు, పీఏలుగా చినబాబు కొందరిని తీసుకోమని కేఈకి సూచించారట. ఇది కేఈ పాటించకపోవడంతో లోకేశ్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారట. అక్కడి నుంచి కేఈని ఇరకాటంలోకి నెట్టడమే లోకేశ్ పనిగా పెట్టుకున్నారని కేఈ సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు.
జేసీకి ఝలక్
కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంపై..ఎందుకొచ్చానురా అని సన్నిహితుల వద్ద వాపోతున్న జేసీ దివాకర్‌రెడ్డికి లోకేశ్ సన్నిధిలో తీవ్ర అవమానం ఎదురైందట. మంత్రిపదవి కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన జేసీ..చివరిగా లోకేశ్ దర్శనం చేసుకోవాలనుకున్నారట. అయితే చినబాబు జేసీని కరుణించలేదు. ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోనిదే రావొద్దని తన సిబ్బందితో జేసీకి చెప్పించారట. దీంతో తీవ్రమైన అవమానంతో వెనుదిరిగారట జేసీ.
ఐఏఎస్‌లకూ అవమానం
ఓ ఐఏఎస్ అధికారి పేరు చెబితేనే లోకేశ్ మండిపడుతున్నారట. అదే ఐఏఎస్‌పై చంద్రబాబు ప్రశంసలు కురిపిస్తున్నారు అది వేరే విషయం. ఇంతకీ ఆ ఐఏఎస్ అధికారి ఎవరనుకుంటున్నారా? పరిశ్రమల శాఖలో కమిషనర్‌గా ఉన్న కార్తికేయ మిశ్రా. తన తండ్రి ఇలాఖాలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి తన మాట వినకపోవడంతో చినబాబు గుర్రుగా ఉన్నారట. లోకేశ్ సిఫారసుతో ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓగా పని చేస్తున్న కొండయ్యను పరిశ్రమల శాఖలో ప్రత్యేక అధికారిగా నియమించారట! అయితే పరిశ్రమల శాఖ కమిషనర్‌గా ఉన్న కార్తికేయ మిశ్రా తనకు వెయిట్ ఇవ్వడంలేదని కొండయ్య లోకేశ్‌కు ఫిర్యాదు చేశారట. దీంతో చినబాబు తన మనిషికి గౌరవం ఇవ్వకపోతే ఎలా అంటూ మిశ్రాపై పీకల్లోతు కోపం పెంచుకున్నారట.
జిల్లాల్లో లోకేశ్ అనుచరుల హవా
లోకేశ్ దగ్గర పనిచేసే కారు డ్రైవర్ నుంచి అటెండర్ వరకూ మంత్రులు, ఉన్నతాధికారులపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోకేశ్ పేరుచెప్పి వీరు చేస్తున్న హడావుడితో జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ స్థాయి అధికారులు కూడా బెదిరిపోతున్నారట. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో ఓ సీఐ ఎస్పీని కూడా బెదిరిస్తున్నాడట. లోకేశ్ ది ..తనది ఒకే సామాజికవర్గమని, లోకేశ్ దగ్గర పనిచేసే ఒక వ్యక్తి పేరుచెప్పి ఆయన తన బంధువని చెబుతూ..దందాలు చేస్తున్నాడట. కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకూ ఈ సీఐ అవినీతి తెలిసినా..అడిగినా, చర్యలు తీసుకున్నా ఎక్కడ లోకేశ్ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందోనని భయపడి చస్తున్నారట. ఇంతగా బెదిరిస్తున్న ఈ సీఐ..అవినీతి నిరోధకశాఖకు చిక్కి సస్పెండయి.. మళ్లీ అదే స్థానంలో పోస్టింగు తెప్పించుకోవడంతో ఉన్నతాధికారులు కూడా ఈ సీఐ జోలికి వచ్చేందుకుభయపడి పోతున్నారట.