Wonder World 23

టాటూలతో ఆకట్టుకుంటున్న టెకీలు! జంతువులు, పువ్వులు, సీతాకోక చిలుకల బొమ్మలు, ప్రేమించినవారి పేర్లు శరీరంపై టాటూలుగా వేయించుకోవడం పాత ఫ్యాషన్‌. తాము పనిచేస్తున్న కంపెనీల పేర్లను గానీ, లోగోలను గానీ టాటూలా వేయించుకోవడం ఇపుడు నడుస్తున్న కొత్త ట్రెండ్‌. బహుళజాతికంపెనీలైన మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, ఒరాకిల్‌, ఐబీఎంలలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు కంపెనీ పట్ల తమ విశ్వాసాన్ని నిరూపించుకోవడం కోసం ఇలా వంటినిండా టాటూలు వేయించుకుంటున్నారట. దక్షిణాది ఐటీ హబ్‌గా పేరుగాంచిన బెంగళూరులో ఈ ట్రెండ్‌ మొదలయ్యింది. పేరుపొందిన […]

Advertisement
Update:2015-09-10 18:34 IST

టాటూలతో ఆకట్టుకుంటున్న టెకీలు!

జంతువులు, పువ్వులు, సీతాకోక చిలుకల బొమ్మలు, ప్రేమించినవారి పేర్లు శరీరంపై టాటూలుగా వేయించుకోవడం పాత ఫ్యాషన్‌. తాము పనిచేస్తున్న కంపెనీల పేర్లను గానీ, లోగోలను గానీ టాటూలా వేయించుకోవడం ఇపుడు నడుస్తున్న కొత్త ట్రెండ్‌. బహుళజాతికంపెనీలైన మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, ఒరాకిల్‌, ఐబీఎంలలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు కంపెనీ పట్ల తమ విశ్వాసాన్ని నిరూపించుకోవడం కోసం ఇలా వంటినిండా టాటూలు వేయించుకుంటున్నారట. దక్షిణాది ఐటీ హబ్‌గా పేరుగాంచిన బెంగళూరులో ఈ ట్రెండ్‌ మొదలయ్యింది. పేరుపొందిన కంపెనీలయితే అందులో పనిచేస్తున్న ఉద్యోగులు ఆ కంపెనీ లోగోను గానీ పేరును గానీ శరీరంపై టాటూగా వేయించుకోవడం స్టేటస్‌ సింబల్‌గా భావిస్తున్నారట. దీనివల్ల రెండు ఉపయోగాలున్నాయని అంటున్నారు. ఒకటి మంచి కంపెనీలో పనిచేస్తున్నామనే స్టేటస్‌ సింబల్‌ను ప్రదర్శించుకోవడం. రెండోది తాము పనిచేస్తున్న కంపెనీకి తాము విశ్వాసపాత్రులమని నిరూపించుకోవడం. బెంగళూరులోని రెండు టాటూ స్టుడియోలు డార్క్‌ ఆర్ట్స్‌, బ్రహ్మలకు ఇపుడు గిరాకీ బాగా పెరిగింది. కంపెనీలోగోలు టాటూలుగా వేయించుకుంటున్న యూత్‌ ఇక్కడకు క్యూ కడుతున్నారు. అయితే అదే సమయంలో ఎక్కువ మంది యువకులు టాటూలు వేయించుకోవడం కోసం గోవాకు కూడా వెళుతున్నారట. ఎందుకంటే అక్కడ ఇంటర్నేషనల్‌ టాటూ ఆర్టిస్టులున్నారని చెబుతున్నారు. టాటూల వ్యాపారం పెరిగినందుకు సంతోషంగానే ఉన్నా భారత్‌లో టాటూలు వేయడం చాలా కష్టమని డార్క్‌ ఆర్ట్స్‌ టాటూ స్టుడియో యజమాని ప్రదీప్‌ మీనన్‌ అంటున్నారు. భారతీయుల శరీరాలపై టాటూలు బాగా కనిపించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి వస్తున్నదని ఆయన చెబుతున్నారు. ఉదాహరణకు ఐబీఎం లోగోను నీలి రంగులో శరీరంపై ముద్రించాలంటే అది సరిగా కనిపించదు. భారతీయుల శరీరవర్ణం మెజారిటీ భాగం నలుపు లేదా చామన ఛాయలో ఉంటుంది. అందుకని కలర్‌ కాంబినేషన్‌ కోసం నానా అవస్థలూ పడాల్సి వస్తున్నదని ప్రదీప్‌ చెప్పారు. ఇపుడు నెలకు దాదాపు 100 మంది వరకూ టాటూలు వేయించుకుంటున్నారట. 2010తో పోల్చితే దాదాపు రెట్టింపయిందని ప్రదీప్‌ చెప్పారు.

అయితే టాటులు వేస్తున్నందుకు గాను కొన్ని సందర్భాలలో నోటీసులు కూడా ఎదుర్కోవలసి వస్తున్నదని ప్రదీప్‌ చెప్పారు. ఉద్యోగులు ఇలా కంపెనీ లోగోలను శరీరంపై టాటూలుగా వేసుకోవడం కొన్ని కంపెనీలకు అస్సలు ఇష్టం ఉండడం లేదట. బెంగళూరులోని ఓ టాటూ స్టుడియోకి ఓ ఐటీ కంపెనీ నుంచి ఇటీవల ఓ లీగల్‌ నోటీసు అందింది. తమ కంపెనీ లోగోను ఉద్యోగి శరీరంపై ఎందుకు వేశారని ఆ నోటీసులో ప్రశ్నించారు. దాంతో బలవంతంగా టాటూను తొలగించాల్సి వచ్చిందట. కొన్ని కంపెనీలయితే ఈ టాటూల గోలను పట్టించుకోవడం లేదు కానీ కొన్ని కంపెనీలు మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాయట. ఎందుకంటే ఇది లోగోల కాపీరైట్స్‌ కిందకి వస్తుంది. అమెరికాకు చెందిన ఓ ఔట్‌సోర్సింగ్‌ సంస్థలో ప్రొడక్ట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆనంద్‌ గాంధీ తమ కంపెనీ లోగోను భుజంపై టాటూగా వేయించుకున్నాడు. అయితే ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో దానిని ప్రదర్శిస్తే ఊరుకోనని పై అధికారి తీవ్రంగా హెచ్చరించాడట.

Tags:    
Advertisement

Similar News