జీహెచ్‌ఎంసీ 'పరమ చెత్త' న్యాయం!
సికిందరాబాద్‌లోని ఒక చిరు వ్యాపారి ”హైదరాబాద్ మహా నగర పురపాలక సంస్థ” (జీహెచ్‌ఎంసీ)కి కొంత ‘ఆస్తి పన్ను’ బకాయి పడ్డారు. బకాయి కట్టేవరకు ఇంటి ముందు చెత్త వేయండని జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. అధికారులు అన్నంత ‘పని’ చేశారు!! పన్ను చెల్లించేదాకా చెత్త తీసేది లేదని హుకుం జారీ చేశారు. ఇంటి ముందు చెత్తా చెదారంతో సదరు వ్యక్తితో పాటు చుట్టు పక్కల నివాసితులు పడిన బాధలు వర్ణనాతీతం! జీహెచ్‌ఎంసీకి వచ్చిన ‘పరమ చెత్త’ ఆలోచన ఇది. దానిపై […]
Advertisement
సికిందరాబాద్‌లోని ఒక చిరు వ్యాపారి ”హైదరాబాద్ మహా నగర పురపాలక సంస్థ” (జీహెచ్‌ఎంసీ)కి కొంత ‘ఆస్తి పన్ను’ బకాయి పడ్డారు. బకాయి కట్టేవరకు ఇంటి ముందు చెత్త వేయండని జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. అధికారులు అన్నంత ‘పని’ చేశారు!! పన్ను చెల్లించేదాకా చెత్త తీసేది లేదని హుకుం జారీ చేశారు. ఇంటి ముందు చెత్తా చెదారంతో సదరు వ్యక్తితో పాటు చుట్టు పక్కల నివాసితులు పడిన బాధలు వర్ణనాతీతం! జీహెచ్‌ఎంసీకి వచ్చిన ‘పరమ చెత్త’ ఆలోచన ఇది. దానిపై ఆ వ్యక్తి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారించిన ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్‌సేన్ గుప్తా, పీవీ సంజరు కుమార్‌తో కూడిన ధర్మాసనం జీహెచ్‌ఎంసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త ఇంకా సదరు పిటిషన్‌దారు ఇంటి ముందే ఉందా? అని ప్రశ్నిస్తే.. ఆయన తరపు న్యాయవాది ఉందని చెప్పారు. గంటలోగా అక్కడ చెత్తను తరలించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. అప్పటికప్పుడు చెత్తను తీయించి… దాన్ని తరలించిన ఫొటోలను సైతం న్యాయస్థానానికి సమర్పించారు. ఇంతకీ ఆ చిరువ్యాపారి బకాయి ఎంతో తెలుసా..? అక్షరాలా రెండువేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు మాత్రమే!
ఈ సంఘటనకు కొద్దిరోజుల ముందు నగరం నడిబొడ్డున అబిడ్స్ ప్రాంతంలో జీహెచ్‌ఎంసీ మరో ఆగడానికి పాల్పడింది. అన్నపూర్ణ హోటల్ భారీగా పన్ను బకాయిపడింది. వారికీ ‘చెత్త బెదిరింపులు’… ఆతర్వాత చెత్త డంపింగ్… ఆ సర్కిల్ ఉన్నతాధికారి.. అంటే డిప్యూటీ మునిసిపల్ కమిషనర్ రోనాల్డ్‌రాస్ రాత్రంతా స్వయంగా దగ్గరుండి చెత్త పోయించారు. ఇలాంటి పనులు దేనికి సంకేతమో అర్దం కావు. బకాయిలున్న అందరికీ ఇదే విధానం అమలు చేయదలచుకుందా అంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే జీహెచ్‌ఎంసీ ఉన్న జాబితాను పరిశీలిస్తే కళ్ళు తిరిగే నిజాలు బయటపడ్డాయి. పేదల మీద ఉన్న కక్ష పెద్దల మీద లేదని స్పష్టమవుతోంది. మొత్తం జీహెచ్‌ఎంసీకి ఎనిమిది లక్షల మంది బకాయిదారులున్నారు. అందులో అత్యధికంగా బకాయిపడిన తొలి వెయ్యి మంది జాబితాను సేకరించి.. పరిశీలిస్తే విస్తుబోయే నిజాలు బయటపడ్డాయి. మొత్తం 8 లక్షల మంది నుంచి రావాల్సిన మొత్తం సుమారు రూ.1733 కోట్ల రూపాయలైతే.. వారిలో తొలి వెయ్యి మంది బడా బాబులు.. సంస్థల నుంచి రావాల్సిన మొత్తమే ఏకంగా రూ.386 కోట్ల పైచిలుకు!
జీహెచ్‌ఎంసీ మొత్తం అయిదు జోన్లతో, 18 సర్కిళ్లతో వర్దిల్లుతోంది. దీని పరిధిలోని హుడాకు వివిధ సర్కిళ్లలో.. జోన్లలో ఆస్తులున్నాయి. హుడా ఆస్తిపన్ను బకాయి మొత్తమెంతో తెలుసా? రూ.106.59 కోట్ల రూపాయల పైచిలుకు. మరి ఈ కార్యాలయాల ముందు చెత్త వేయాలి కదా? వేయరు… ఎందుకంటే అవి సొంత ఆఫీసులు. దక్షిణ మద్య రైల్వేకి చెందిన వివిధ స్టేషన్లతోసహా దాదాపు 20 సంస్థలు 28.80 కోట్లు బకాయిపడి ఉన్నాయి! పాపం! పేద రైల్వే శాఖ అని చెత్త పోయకుండా చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. అప్పుడెప్పుడో మూసేసిన ‘హిందూస్తాన్ మెషినరీ టూల్స్’ (హెచ్‌ఎంటి) సైతం 14 కోట్ల రూపాయల పైచిలుకు బకాయిలు చెల్లించాలి. వారి ఆవరణలో సైతం జీహెచ్‌ఎంసీ కాలుపెట్టదు. ఈ బకాయిల చెల్లింపుదారుల్లో ప్రముఖులు.. వారి బినామీలకు సైతం కొరత లేదు. ప్రస్తుత పక్క రాష్ట్ర శాసనసభ్యులు, సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ రూ.11 లక్షల 83 వేల బకాయిలు కట్టలేక బహు ”ఇబ్బంది” పడుతున్నారు. ఆయన దారిలోనే టి. సుబ్బిరామిరెడ్డి సైతం రూ.10 లక్షల 46 వేలు కట్టలేక ”కటకట”లాడుతున్నారు. వీరెవరి ఇంటి ముందూ చెత్త వేసే సాహసం చేయదు. పేదలను పీక్కుతినే ప్రభుత్వం పెద్దల పట్ల ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందో… ఇదేం ‘చెత్త’ న్యాయమో ఏలినవారికే తెలియాలి మరి!
Advertisement