వెలవెలబోతున్న కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాలు నీళ్ళు లేక వెలవెలబోతున్నాయి. ఈ సమయానికి మామూలుగా ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోవాలి. కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు గణనీయంగా పడి పోవడంతో ప్రాజెక్టుల్లో ప్రేతకళ సంతరించుకుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు మూడో వారం ప్రవేశించినా, వర్షాలు కురవక పోవడం, ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల […]
Advertisement
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాలు నీళ్ళు లేక వెలవెలబోతున్నాయి. ఈ సమయానికి మామూలుగా ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోవాలి. కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు గణనీయంగా పడి పోవడంతో ప్రాజెక్టుల్లో ప్రేతకళ సంతరించుకుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు మూడో వారం ప్రవేశించినా, వర్షాలు కురవక పోవడం, ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 710 టీఎంసీలు కాగా, ఇప్పుడు కేవలం 188 టీఎంసీలే ఉంది. అందులోనూ 50 టీఎంసీల నీరే వినియోగించుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఉన్న నీటిని కేవలం తాగునీటికి మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నీరు మూడు వంతులు తగ్గిపోయిందని అధికారులు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే గడ్డుకాలం తప్పదని వారంటున్నారు. అసలే గత యేడాదే నీటి మట్టాలు గణనీయంగా పడిపోయాయి. ఈసారి ఈ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు చూస్తే ఈ స్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, శ్రీశైలం, సింగూరు, మానేరు, కడెం ప్రాజెక్టులన్నీ కలిపి నిల్వ సామర్ధ్యం 709.47 టీఎంసీలు కాగా ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నింటిలో 188.06 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అంటే 521.41 టీఎంసీల నీరు తక్కువగా ఉందన్న మాట. గత యేడాది 425.50 టీఎంసీలు ఉంది. అంటే ఈసారి గత యేడాది కన్నా 237 టీఎంసీలు తక్కువన్న మాట. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిలో కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో 20 నుంచి 30 టీఎంసీలు, గోదావరిలో 20 టీఎంసీల నీరు మాత్రమే వాడుకునే అవకాశం ఉంటుందని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అంటే తాగునీటికి మాత్రమే వాడుకునే అవకాశం ఉందన్న మాట.
ఎగువ రాష్ట్రాల్లో పరిస్థితి ఈ దుస్థితికి కారణం
తెలుగు రాష్ట్రాలకు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టుల్లో నీటి పరిస్థితి దయనీయంగా ఉంది. నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల పరివాహకం తక్కువగా ఉండడంతో ఎగువ ప్రాజెక్టులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. అవి నిండి దిగువకు నీరు వస్తేనే మన ప్రాజెక్టులు నిండుతాయి. ప్రస్తుతం ఎగువన ఉన్న ఆలమట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాల్లో మొత్తంగా 91 టీఎంసీల నీరు కొరత ఉంది. ప్రస్తుతం తుంగభద్రకు 17 వేల క్యూసెక్కులు, ఆలమట్టి, నారాయణపూర్‌లకు 10 వేల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లోలు కొనసాగుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే సెప్టెంబర్ తొలివారానికి ప్రాజెక్టులు నిండి దిగువనున్న మనకు నీరు వస్తుంది. లేకుంటే రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి అధ్వానమంగానే తయారవుతుంది.
Advertisement