కరువు కోరల్లో తెలంగాణ రైతు
పేరుకే వర్షాకాలం. చినుకుజాడ కనిపించడం లేదు. దుక్కి దున్ని విత్తనాలు వేసిన రైతన్న దీనంగా ఆకాశం వైపు చూడడం తప్ప మరేమీ చేయలేక పోతున్నాడు. చినుకు కరుణించక పోవడంతో అన్నదాతలు సేద్యం పనులును నిలిపి వేశారు. ఇప్పటికే వేసిన వరిమడుల్లోకి పశువులను మేతకు వదులుతున్నారు. దీంతో కరువు ముప్పు ముంచుకొస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో తెలంగాణలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. ప్రతి ఏటా తెలంగాణలో కోటి ఎకరాలకు పైగా వ్యవసాయం జరుగుతుంది. అయితే, ఈ ఏడాది […]
Advertisement
పేరుకే వర్షాకాలం. చినుకుజాడ కనిపించడం లేదు. దుక్కి దున్ని విత్తనాలు వేసిన రైతన్న దీనంగా ఆకాశం వైపు చూడడం తప్ప మరేమీ చేయలేక పోతున్నాడు. చినుకు కరుణించక పోవడంతో అన్నదాతలు సేద్యం పనులును నిలిపి వేశారు. ఇప్పటికే వేసిన వరిమడుల్లోకి పశువులను మేతకు వదులుతున్నారు. దీంతో కరువు ముప్పు ముంచుకొస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో తెలంగాణలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. ప్రతి ఏటా తెలంగాణలో కోటి ఎకరాలకు పైగా వ్యవసాయం జరుగుతుంది. అయితే, ఈ ఏడాది వర్షా భావ పరిస్థితుల వల్ల వ్యవసాయం కేవలం పాతిక లక్షల ఎకరాల్లోనే జరుగుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభ సమయంలో వ్యవసాయ పనులు ప్రారంభించి పత్తి, వరి, మొక్కజొన్న, జొన్న, సోయాబీన్ పంటలను వేసిన రైతులు సకాలంలో వర్షాలు కురవక పోవడంతో పంటను చేలోనే వదిలేశారు. దీంతో, వ్యవసాయం గాడి తప్పింది. పల్లెటూర్లలో వ్యవసాయ పనులు లేకపోవడంతో రైతు కూలీలతో పాటు రైతులు కూడా బతుకు తెరువు కోసం పట్నాలకు వలస పోతున్నారు. ఆగస్టులో భారీ వర్షాలు కురుస్తాయనే ఆశతో ఉన్న రైతన్నకు ఆగస్టు మొదటి పది రోజులు గడిచినా చేను తడిచే వర్షం కురువలేదు. మరో పది రోజుల్లో వానలు కురిస్తాయని వాతావరణ శాఖ కూడా నమ్మకంగా చెప్పడం లేదు. దీంతో రైతులు ఈ ఏడాది సాగు మీద పూర్తిగా ఆశలు వదులుకున్నారు. లక్షలాది ఎకరాల్లో వేసిన పత్తి, మొక్కజొన్న, జొన్నపంటలను చేలోనే వదిలేస్తున్నారు. ఇప్పటికే 23 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగు ఎండి పోయింది. లక్ష ఎకరాల్లో వరి నారు ఎండి పోయింది కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పంటలు పూర్తిగా ఎండి పోయాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల కూరగాయల పాదులు కూడా ఎండి పోతున్నాయి. దీంతో రైతులు చేలను వదిలి పెట్టారు. వర్షాలు లేక సాగు సాగక పోవడం, ప్రత్యామ్నాయ ఉపాథి లభించక పోవడంతో రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకూ అధికారిక లెక్కల ప్రకారం జూన్ 15 నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజూ ఒక అన్నదాత ఆత్మహత్య చేసుకుంటున్నాడు. వర్షాలు లేకపోవడంతో పశుగ్రాసం దొరక్క పశువులకు మేత లభించడం లేదు. దీంతో పశువులను కళేబరాలకు తరలిస్తున్నారు. వర్షాలు కురవక పోవడంతో మంచినీటికి కూడా కటకటలాడుతోంది. రాజధానిలో తీవ్ర మంచి నీటి కొరత ఏర్పడింది. వేసవికాలంలో తిరిగినట్టుగానే మంచినీటి ట్యాంకర్లు విరామం లేకుండా తిరుగుతున్నాయి. నాగార్జున సాగర్ నీటి మట్టం పూర్తిగా తగ్గి పోయింది. మరో పది రోజులు వర్షాలు కురవక పోతే పరిస్థితులు అంచనా వేయలేమని నిపుణులే వ్యాఖ్యానిస్తున్నారంటే నీటి కొరత ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Advertisement