చెట్లు ఎక్కితే....చక్కని జ్ఞాపకశక్తి!
చెట్టులెక్క గలవా…ఓ నరహరి పుట్టలెక్క గలవా….అనే పాత తెలుగు సినిమా పాట చాలా పాపులర్. చెట్టులెక్కడం అంటే ఒక సాహసం అన్నట్టుగా ఈ పాటలో ఉంటుంది. ఈ సాహసం కేవలం శరీర సామర్ధ్యానికే సంబంధించినది కాదని, ఇందులో మెదడు శక్తిని పెంచే తమాషా ఉందని పరిశోధకులు తేల్చారు. చెట్టు ఎక్కి కొమ్మమీద నుండి పడిపోకుండా జాగ్రత్తగా నిలదొక్కుకోవడం అనే శారీరక వ్యాయామం విచిత్రంగా రెండు గంటల్లో ఆ వ్యక్తి తెలివితేటలను, జ్ఞాపకశక్తిని విశేషంగా పెంచిందని నార్త్ ఫ్లోరిడాలోని సైకాలజీ డిపార్ట్మెంట్‌కి చెందిన మానసిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అతి తక్కువ కాలంలో చెట్లను ఎక్కే ప్రక్రియతో […]
చెట్టులెక్క గలవా…ఓ నరహరి పుట్టలెక్క గలవా….అనే పాత తెలుగు సినిమా పాట చాలా పాపులర్. చెట్టులెక్కడం అంటే ఒక సాహసం అన్నట్టుగా ఈ పాటలో ఉంటుంది. ఈ సాహసం కేవలం శరీర సామర్ధ్యానికే సంబంధించినది కాదని, ఇందులో మెదడు శక్తిని పెంచే తమాషా ఉందని పరిశోధకులు తేల్చారు. చెట్టు ఎక్కి కొమ్మమీద నుండి పడిపోకుండా జాగ్రత్తగా నిలదొక్కుకోవడం అనే శారీరక వ్యాయామం విచిత్రంగా రెండు గంటల్లో ఆ వ్యక్తి తెలివితేటలను, జ్ఞాపకశక్తిని విశేషంగా పెంచిందని నార్త్ ఫ్లోరిడాలోని సైకాలజీ డిపార్ట్మెంట్‌కి చెందిన మానసిక నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా అతి తక్కువ కాలంలో చెట్లను ఎక్కే ప్రక్రియతో మనిషిలో పనిలో చురుకుదనం నాటకీయంగా చాలా ఎక్కువగా పెరుగుతుందని వీరు గుర్తించారు. చెట్లు ఎక్కడమే కాదు, చప్పట్లు కొట్టడం, తాడుతో పైకి ఎగబాకడం లాంటి తాత్కాలిక ఉత్తేజాన్ని ఇచ్చే పనులు మన పనితీరుని మెరుగుపరుస్తాయా అనే అంశంమీద చేసిన పరిశోధనలో భాగంగా, చెట్లు ఎక్కినపుడు జ్ఞాపకశక్తి పెరిగినట్టుగా గుర్తించారు. శరీరాన్ని అప్రమత్తంగా ఉండాల్సిన భంగిమలోకి మార్చడం లేదా ఉత్తేజపూరిత పనులు, అత్యంత హెచ్చుస్థాయిలో చేసే వ్యాయామం… ఇవన్నీ మనిషి మేధస్సుపై తాత్కాలిక ప్రభావాన్ని చూపుతాయని ఈ పరిశోధనలో తేల్చారు. 18నుండి 59 ఏళ్ల వయసున్న వ్యక్తులను ఎంపిక చేసుకుని వారికి పలురకాల టాస్క్‌లు ఇచ్చి వారి మెదడులో వచ్చిన మార్పులను గమనించారు. ఇందుకోసం చెట్లు ఎక్కడం, మూడు అంగుళాల వెడల్పు ఉన్న కర్రపై పడకుండా నడవడం, చెప్పులు లేకుండా పరిగెత్తడం, బరువులను ఎత్తడం ఇలా పలురకాల పనులు చేయించారు. రెండు గంటల తరువాత పరిశీలించి చూస్తే వారిపనితీరులో ఉపయోగించే జ్ఞాపకశక్తి 50శాతం పెరిగినట్టుగా గుర్తించారు.
కాలేజీలో కూర్చుని రెండుగంటలు పాఠం విన్న వారిలో కంటే ఇలాంటి కృత్యాలు చేసినవారిలో వర్కింగ్ మెమొరీ పెరిగినట్టుగా గమనించారు. ముఖ్యంగా శరీరం సాహస విన్యాసం చేస్తూ, శరీరానికి ఎలాంటి ప్రమాదం కలగకుండా మెదడు అప్రమత్తంగా ఉన్న కృత్యాలు నిర్వహించినపుడు జ్ఞాపకశక్తి మరింతగా పెరిగింది. మొత్తానికి ఈ పరిశోధన ద్వారా శరీరాన్ని అప్రమత్తంగా ఉండాల్సిన స్థితిలో ఉంచి, మనసుకి ఒక కొత్త ఉత్సాహాన్ని, సాహసాన్ని ఇచ్చినపుడు తెలివితేటలు పెరుగుతాయని తేలింది.