రాయలసీమలో కరువు తాండవం

రాయలసీమ జిల్లాల్లో కరవు తాండవిస్తోంది. వర్షాలు సరిగా కురవకపోతే ఎప్పుడూ అనంతపురం జిల్లాయే ప్రథమంగా నష్టపోయేది. ఈసారి సీమలోని నాలుగు జిల్లాలు కూడా పంటలు ఎండిపోయే పరిస్థితితో సతమతమవుతున్నాయి. అనంతపురం జిల్లాలో పొలాలు ఎడారిని తలపిస్తున్నాయి. వేరుశనగ విత్తేందుకు అదును దాటిపోవడంతో రైతులు తమ వద్ద ఉన్న విత్తనాలను అమ్మకానికి పెడుతున్నారు. వారి ఇబ్బందిని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. దీంతో రైతులకు విత్తనానికి పెట్టిన డబ్బు కూడా తిరిగి రావడం లేదు. మిగిలిన సీమ […]

Advertisement
Update:2015-08-03 05:17 IST
రాయలసీమ జిల్లాల్లో కరవు తాండవిస్తోంది. వర్షాలు సరిగా కురవకపోతే ఎప్పుడూ అనంతపురం జిల్లాయే ప్రథమంగా నష్టపోయేది. ఈసారి సీమలోని నాలుగు జిల్లాలు కూడా పంటలు ఎండిపోయే పరిస్థితితో సతమతమవుతున్నాయి. అనంతపురం జిల్లాలో పొలాలు ఎడారిని తలపిస్తున్నాయి. వేరుశనగ విత్తేందుకు అదును దాటిపోవడంతో రైతులు తమ వద్ద ఉన్న విత్తనాలను అమ్మకానికి పెడుతున్నారు. వారి ఇబ్బందిని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. దీంతో రైతులకు విత్తనానికి పెట్టిన డబ్బు కూడా తిరిగి రావడం లేదు. మిగిలిన సీమ జిల్లాల్లోనూ కరువు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కడప జిల్లాలో బోరు బావులను నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతులు నట్టేట మునుగుతున్నారు. కళ్లెదుటే పంటలు ఎండిపోతుంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పంటల రక్షణకు భగీరథ యత్నం చేస్తున్నారు. వ్యవసాయ కార్మికులు పనుల కోసం వలస పోతున్నారు. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోనూ పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. సాగు ముందుకు సాగడం లేదు. గతేడాది వరి సాగు సాధారణ విస్తీర్ణం స్వల్పంగా పెరిగింది. ఈ యేడు మాత్రం మామూలు కన్నా భారీగా తగ్గిపోయింది. మొక్కజొన్న, వేరుశనగ, పత్తి, చెరకు అన్నింటి సాగు గతేడాదితో పోల్చితే బాగా తగ్గిపోయింది. వర్షాభావాన్ని అధిగమించడానికి ఆయిల్‌ ఇంజన్లతో భూగర్భ జలాలతో సాగు చేపట్టేందుకు రైతులు యోచిస్తున్నారు. అయితే పెట్టుబడి అధికమయి ఆర్థికంగా చితికిపోతామనే భయంతో వెనుకంజ వేస్తున్నారు. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సగటు కన్నా వర్షపాతం చాలా తక్కువగా నమోదైంది. ఖరీఫ్‌ సాగులో కీలకమైన నెల జూలై. ఆ నెలలో వర్షాలు కురిస్తే అన్ని పైర్లకూ మేలు జరుగుతుంది. పంటల భవితవ్యం తేలేది కూడా ఆ నెలే. అయితే జులై నెలలో చినుకుపడ్డ దాఖలాలు లేవు. దాంతో రైతులంతా విలవిలలాడుతున్నారు. సాంద్ర వ్యవసాయ పథకం అమలులో ఉండే పశ్చిమ గోదావరి వంటి జిల్లాలోనే నారుమళ్లు ఎండిపోతున్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఊహించొచ్చు. ఆ జిల్లాలో కూడా నాట్లు 45 శాతమే పూర్తయ్యాయంటే ఇక మిగిలిన జిల్లాల పరిస్థితి చెప్పుకోనవసరం లేదు.
Tags:    
Advertisement

Similar News