తమన్నా పోరాటం చేస్తే...ప్రభాస్ ఏమై పోవాలి!
నేటి సినిమాల్లో స్త్రీ పాత్ర….మరో యాభై సంవత్సరాల తరువాత కూడా ఇది చర్చనీయాంశంగానే మిగలవచ్చు. ఎందుకంటే స్త్రీ జీవితం, జీవన విధానాల్లో (పొందే గౌరవంలో కాదు) గత ఇరవై ముప్పయి సంవత్సరాలుగా చాలా మార్పులు వచ్చినా సినిమాల్లో మహిళల పాత్రల్లో మాత్రం పెద్ద మార్పేమీ రాలేదు. అప్పట్లో చీరకట్టుకుని జడలు, ముడులు వేసుకుంటే ఇప్పుడు మోడ్రన్ దుస్తులతో జుట్టు విరబోసుకుని కనబడుతున్నారు, అప్పుడు ఇంటి చాకిరి మాత్రమే చేస్తే ఇప్పుడు ఆఫీసుల్లో చాకిరి సైతం చేస్తున్నారు. అంతే! […]
నేటి సినిమాల్లో స్త్రీ పాత్ర….మరో యాభై సంవత్సరాల తరువాత కూడా ఇది చర్చనీయాంశంగానే మిగలవచ్చు. ఎందుకంటే స్త్రీ జీవితం, జీవన విధానాల్లో (పొందే గౌరవంలో కాదు) గత ఇరవై ముప్పయి సంవత్సరాలుగా చాలా మార్పులు వచ్చినా సినిమాల్లో మహిళల పాత్రల్లో మాత్రం పెద్ద మార్పేమీ రాలేదు. అప్పట్లో చీరకట్టుకుని జడలు, ముడులు వేసుకుంటే ఇప్పుడు మోడ్రన్ దుస్తులతో జుట్టు విరబోసుకుని కనబడుతున్నారు, అప్పుడు ఇంటి చాకిరి మాత్రమే చేస్తే ఇప్పుడు ఆఫీసుల్లో చాకిరి సైతం చేస్తున్నారు. అంతే! బాహుబలి సినిమాలో రాజమౌళి తమన్నాని అన్ని యుద్ధ విద్యల్లో ఆరితేరిన యువతిగా చూపించినా ప్రభాస్ ముందు ఆ వీరత్వాన్ని జీరో చేసి తిరిగి స్త్రీత్వాన్నే హైలెట్ చేయడంపై విమర్శలు వినబడుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా ఇలాంటి విషయాలను ప్రశ్నిస్తూ సుంకర అన్నపూర్ణ అనే అమ్మాయి ఆన్‌లైన్లో పోస్ట్ చేసిన వీడియోకు 48 గంటల్లో 65వేల షేర్స్ వచ్చిన సందర్భంలో మరొకసారి ఈ విషయం విస్తృతంగా ప్రస్తావనలోకి వచ్చిందనే చెప్పాలి. సరే, వాడిగా వేడిగా చర్చలు జరిగిన తరువాత ఏం జరుగుతుంది…. మరోసారి మరుగున పడిపోతుంది. అంతే! ఇది సెక్సువల్ అబ్యూజ్ కాదా…అని ఆమె ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకునే ముందు మనం చాలా విషయాలను గురించి మాట్లాడుకోవాలి.
నేటికీ ఆడపిల్లకు మంచి చదువు చెప్పించి (తమన్నాకు యుద్ధ విద్యలు నేర్పినట్టుగా) పెళ్లి చేసి పంపేటపుడు ఉద్యోగం చేయించుకుంటారో, ఇంట్లోనే ఉంచి వంట చేయించుకుంటారో (దుస్తుల మార్పుతో ప్రభాస్ తమన్నా దేనికి పరిమితమో చెప్పేశాడు) మీ ఇష్టం అనే తల్లిదండ్రులు మన చుట్టూ కోకొల్లలు. రాజమౌళి సైతం ఇందుకు అతీతులు కారు. పదేపదే మన స్త్రీలు ముందుకు వెళ్లి పోతున్నారు…అనే ఉపన్యాసాలు, వ్యాసాలు దంచేస్తుంటాం. ముందుకు వెళుతున్నారు…నిజమే…అయితే అది ఎప్పుడూ?…ఆమె వెనుక, ముందుకు పంపే సహృదయులైన మగవారు ఉన్నపుడు. ముందుకు పంపాలా వద్దా, ఎంత ముందుకు పంపాలి, ఎక్కడ ఆపాలి…తదితర అంశాలకు సంబంధించిన రిమోట్ మగవారి చేతుల్లోనే ఉందా, లేదా? ఇంట్లో అయితే మంచి భర్త, మంచి అత్తగారు, ఆఫీస్‌ల్లో మంచి బాస్, మంచి కొలీగ్స్, రోడ్డుమీదకు వస్తే మంచి పౌరులు, ఆటో ఎక్కితే మంచి ఆటోవాలా, క్యాబ్ ఎక్కితే మానవత ఉన్న మంచి డ్రైవరు…. ఇలా అంతా మంచి అనే కేటగిరికి సంబంధించిన మనుషులు ఉంటే కానీ స్త్రీలు ముందుకు వెళ్లలేరు. వీటిలో ఏ ఒక్క మంచి లోపించినా ఇక ఆమె జీవితం అంతే సంగతులు. మన సమాజంలో మంచి ఎంత శాతం ఉందో మనకు తెలియంది కాదు… సో… ఇక్కడ మరొక విషయం గుర్తు పెట్టుకోవాలి. మనకు సగటు మనుషులు కూడా చాలరు….అంతా చాలా మం….చి వాళ్లయి ఉండాల్సిందే. అందుకే మనకు ఆడవారి సహకారం లేకుండా విజయాలు సాధించిన మగవారు కనబడతారు కానీ, మగవారి సహకారం లేకుండా అనుకున్నది సాధించిన మహిళలు అరుదుగా కనబడుతుంటారు.
ఇక సినిమాల్లో స్త్రీ పాత్రల విషయానికి వద్దాం. కొన్ని వందల వేల సంవత్సరాలుగా మనం మగ లక్షణాలు, ఆడ లక్షణాలు అని విభజించుకున్నాం (ఇదీ సహజపరిణామం కాదు). ఆ విభజన మగవారికి ఇంటిపని వంటపనిని తప్పించి, వారికి సమాజంలో బలవంతులుగా గుర్తింపు ఇస్తే, ఆడవారిని వంటింటి కుందేళ్లుగా, కుక్కిన పేనుల్లా ఉంచింది. ఇప్పుడు పోరాటం, మగవారు తమ అధికారాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేమని, స్త్రీలు తమకీ బానిస బతుకులు వద్దని. విషయమేమిటంటే….ఎప్పుడూ మార్పుకోసం పోరాటం చేసేవారికంటే ఉన్న దాన్ని యధాతథంగా ఉంచేందుకు ఇష్టపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది (అందుకు మళ్లీ చాలా కారణాలు ఉంటాయి). ఆ ఎక్కువని దృష్టిలో పెట్టుకునే సినిమాలు తీస్తారు. ఒక్క సినిమాలేంటి… సంస్కృతి, సంప్రదాయాలు, మతాలు, ఆచారాలు, రాజకీయాలు, వ్యాపారాలు, ప్రకటనలు సర్వం అదే ఫార్ములాని పాటిస్తుంటాయి. ఎందుకంటే ప్రతిదీ ఆర్థికాంశాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి. పైగా బాహుబలి లాంటి వందల సంవత్సరాల క్రితం నాటి కథలో మనం స్త్రీ సమానత్వం లాంటి అంశాన్ని ఊహించలేము.
అసలు తమన్నా వెళ్లి అనుష్కని రక్షించేస్తే, లేదా అనుష్క కొడుకుకోసం ఎదురుచూడకుండా తన పగేదో తానే తీర్చేసుకుంటే ఇక ప్రభాస్ ఏం చేస్తాడు. అతనికి చేసేందుకు ఏమీ లేకపోతే….అది అతనికి, అనుష్కకి పడిన శిక్షకంటే పెద్దది కాదా? అలాగే జరిగితే కథ, కథనం, డ్రామా వీటన్నింటికీ కొనసాగింపు ఎక్కడుంటుంది. ప్రేక్షకుడిని ఉద్విగ్నతతో కూర్చోబెట్టే సన్నివేశాలు ఎలా పుడతాయి. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించడం అసందర్భం కాదనుకుంటున్నా. అసలు సమాజంలో కళలన్నీ అందులో ఉన్న ఎక్కువ తక్కువలను చూపించడానికే పుట్టాయి. ఆడామగా సమానంగా గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటుంటే, ఇంకా పేదా గొప్పాలాంటి అనేక అసమానతలు లేకపోతే ఈ టన్నుల కొద్దీ మెలోడ్రామా ఉంటుందా? ఆలోచించండి.
సహనం, భరించడం ఆడవారి సహజ గుణం….ఇదే కదా…మన నరనరాల్లో ఉన్నది…అందుకే అనుష్క ఏళ్ల తరబడి కొడుకుకోసం ఎదురు చూసింది. ఆమెకున్న శక్తి, సహనం అయితే ప్రభాస్ శక్తి, బాహు బలం. అత్యంత సృజనాత్మకం, కొత్తదనం అని మనం చెప్పుకుంటున్న కథలూ, కల్పనలూ అన్నీ వందల ఏళ్లనాటి ఈ మూస భావాల్లోంచి పుట్టడమే ఒక వైచిత్రి. కొడుకుకోసం కూరలోంచి మంచి మాంసం ముక్కలు ఏరి పక్కకు తీసి ఉంచే తల్లిలా, భర్తకోసం వేడి పదార్థాలను దాచి ఉంచే భార్యలా అచ్చంగా అలాగే తమన్నా, అనుష్కలు ప్రభాస్ వీరత్వాన్ని బయటకు తెచ్చే అవకాశాలను ఇస్తూ పోయారు. ఇక్కడే కాదు, నాలుగేళ్ల కొడుకుని పెంచి పెద్ద చేసి తనని అవమానించిన విలన్ మీద పగ తీర్చుకునే తల్లుల్ని మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు. మనిషికి నిజమైన పగ, లేదా ఆత్మ గౌరవం ఉంటే అవమానాన్ని అన్ని సంవత్సరాలు భరించగలరా…అనే సందేహం కూడా మనకు రాదు. అదేంటి స్త్రీ మనిషి కాదు కదా….అంటే మాత్రం ఇక ఎవరూ ఏమీ చేయలేరు.
వినీవినీ బోరుకొట్టిన ఒక డైలాగుని ఇక్కడ మరొక సారి చెప్పుకోవాలి. మార్పు పునాదుల్లోంచి రావాలి అని (ఆ పునాదులన్నీ ఇక్కడ చెప్పలేము). కాబట్టి సినిమాల్లో పురుషులు పురుషులుగానే, స్త్రీలు స్త్రీలుగానే కనిపిస్తుంటారు (వందల ఏళ్లనాటి). మార్పుని తెచ్చే ఆలోచనలు, అన్ని విధాలుగా మనుషుల్లో సమానత్వాన్ని ఊహించగల, దర్శించగల వారి నుండే రావాలి. వస్తే చాలదు వారు ఇతరులను ప్రభావితం
చేయగలగాలి. మరి ప్రభావితమయ్యేందుకు వారు సిద్ధంగా ఉంటారా….ఉండరు…కారణాలు మళ్లీ అనేకం….. మొత్తానికి సినిమాలు మహిళను వ్యక్తిత్వమున్న మనిషిగా చూపిస్తాయని ఆశించడమంత శుద్ధ దండగ మరొకటి ఉండదు. ఎందుకంటే వాటికి కావల్సింది అసమానతలోంచి పుట్టే భావోద్వేగాలే కనుక!!!!
-వి. దుర్గాంబ