రాజధాని భూసేకరణకు రంగం సిద్ధం
నూతన రాజధాని కోసం భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా దాదాపు 30 వేల ఎకరాలను రైతుల నుంచి లాక్కున్న చంద్రబాబు ప్రభుత్వం మరిన్ని భూముల కోసం భూసేకరణ అస్ర్తాన్ని ప్రయోగించబోతోంది. ప్రతిపక్షాల ఆందోళనలతో కొద్ది కాలం వెనక్కు తగ్గినట్లు కనిపించిన చంద్రబాబు భూసేకరణపై ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అంటే తమకు కావలసిన చోట రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటారన్నమాట. ప్రజోపయోగార్థం పేరుతో భూసేకరణ చట్టం ప్రయోగించి దాదాపు 5 వేల ఎకరాల వరకు సేకరించాలని […]
Advertisement
నూతన రాజధాని కోసం భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా దాదాపు 30 వేల ఎకరాలను రైతుల నుంచి లాక్కున్న చంద్రబాబు ప్రభుత్వం మరిన్ని భూముల కోసం భూసేకరణ అస్ర్తాన్ని ప్రయోగించబోతోంది. ప్రతిపక్షాల ఆందోళనలతో కొద్ది కాలం వెనక్కు తగ్గినట్లు కనిపించిన చంద్రబాబు భూసేకరణపై ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అంటే తమకు కావలసిన చోట రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటారన్నమాట. ప్రజోపయోగార్థం పేరుతో భూసేకరణ చట్టం ప్రయోగించి దాదాపు 5 వేల ఎకరాల వరకు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. భూసేకరణపై 15 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్నది. ఒకసారి భూసేకరణ నోటిఫికేషన్ వెలువడిందంటే ఇక అక్కడ ఎలాంటి అప్పీళ్లూ పనిచేయవు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారాన్ని తీసుకుని భూములు అప్పగించాల్సి ఉంటుంది. భూసేకరణ నోటిఫికేషన్‌కు సంబంధించి రాజధాని ప్రాంత అధికారులకు ఇప్పటికే సంకేతాలందినట్లు సమాచారం. సమీకరణకు అంగీకరిస్తూ 9.3 పత్రాలను సమర్పించిన కొందరు రైతులు పరిహారం తీసుకోకుండా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయితే తమ వద్ద అంగీకార పత్రాలున్నందున వారి పరిహారాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇదిలా ఉండగా విజయవాడలో మంత్రులు పి.నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రతిపాటి పుల్లారావు పూలింగు ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదిరోజుల్లో 26 రెవెన్యూ గ్రామాల పరిధిలో భూములకు సంబంధించిన వాస్తవ స్థితిని తేల్చాలని సూచించారు. భూములివ్వడానికి నిరాకరిస్తున్న ఉండవల్లి, కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో రైతులతో మరోసారి చర్చలు జరిపి వారిని పూలింగుకు ఒప్పించాలని కోరారు. ఉండవల్లిలో ఇళ్ల మధ్యలో ఉన్న స్థలాలకు మినహాయింపునిస్తే సుమారు 650 ఎకరాల వరకూ పూలింగు కింద ఇచ్చేందుకు మరికొందరు సిద్ధంగా ఉన్నారని అధికారులు తెలపగా వారితో వెంటనే చర్చలు జరపాలని మంత్రులు సూచించారు. దాదాపు 3000 ఎకరాలకు ఇప్పటి వరకూ 9.3 పత్రాలు రాలేదని, వారిని కూడా ఒప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కురగల్లు, నీరుకొండ, మందడం ప్రాంతాల్లో ఉన్న అటవీ భూములపై కోర్టులో ఉన్న పిటిషన్లు పరిష్కారమయ్యేలా చూడాలని మంత్రులు కోరారు.
Advertisement