ఇప్పుడు నిజాయితీ...ఓ బ్రేకింగ్ న్యూస్‌!

న్యూస్‌, బ్రేకింగ్ న్యూస్‌, తాజా స‌మాచారం….రోటీ, క‌ప‌డా, మ‌కాన్ త‌రువాత ఇప్పుడు మ‌న‌కు అత్య‌వ‌స‌ర విష‌యాలుగా క‌న‌బ‌డుతున్న‌వి ఇవే. స‌మాచార విప్ల‌వం తో మీడియా, సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్లు…. లాంటి మాధ్య‌మాలు జ‌నాన్ని ఒక మాన‌వ‌హారంలా క‌లిపి ఉంచుతున్నాయి. ఏదేశంలో ఉన్నా మ‌నుషుల‌కు సూర్య చంద్రులు ఒక్క‌రే అన్న‌ట్టుగా, ఖం డాంత‌రాల్లో ఉన్నా మ‌నుషుల్లో ఒకేర‌క‌మైన ఆలోచ‌నా ధోర‌ణిని క‌లిగించ‌గ‌ల‌ శ‌క్తి మీడియాకు ఉంది. అందుకే మీడియా అత్యంత శ‌క్తివంత‌మైన‌ది. ప్ర‌పంచాన్ని మ‌న‌మిప్పుడు ప్ర‌సార‌మాధ్య‌మాలు అనే క‌ళ్ల‌తోనే చూస్తున్నాం. అవి ఏ రంగులో చూపిస్తే ప్ర‌పంచం మ‌న‌కు […]

Advertisement
Update:2015-07-29 01:17 IST

న్యూస్‌, బ్రేకింగ్ న్యూస్‌, తాజా స‌మాచారం….రోటీ, క‌ప‌డా, మ‌కాన్ త‌రువాత ఇప్పుడు మ‌న‌కు అత్య‌వ‌స‌ర విష‌యాలుగా క‌న‌బ‌డుతున్న‌వి ఇవే. స‌మాచార విప్ల‌వం తో మీడియా, సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్లు…. లాంటి మాధ్య‌మాలు జ‌నాన్ని ఒక మాన‌వ‌హారంలా క‌లిపి ఉంచుతున్నాయి. ఏదేశంలో ఉన్నా మ‌నుషుల‌కు సూర్య చంద్రులు ఒక్క‌రే అన్న‌ట్టుగా, ఖం డాంత‌రాల్లో ఉన్నా మ‌నుషుల్లో ఒకేర‌క‌మైన ఆలోచ‌నా ధోర‌ణిని క‌లిగించ‌గ‌ల‌ శ‌క్తి మీడియాకు ఉంది. అందుకే మీడియా అత్యంత శ‌క్తివంత‌మైన‌ది. ప్ర‌పంచాన్ని మ‌న‌మిప్పుడు ప్ర‌సార‌మాధ్య‌మాలు అనే క‌ళ్ల‌తోనే చూస్తున్నాం. అవి ఏ రంగులో చూపిస్తే ప్ర‌పంచం మ‌న‌కు అదే రంగులో క‌న‌బ‌డుతుంది. తెల్లారిలేస్తే పేప‌రు నిండా దారుణాలు, నేరాలు, ఘోరాలే అని విసుక్కునే వారికి ప్ర‌పంచం భ‌యంక‌రంగా క‌న‌బ‌డుతుంది. ఎందుకంటే తాను చ‌దివిన పేప‌రులోని న్యూస్ మాత్ర‌మే ఆ వ్య‌క్తికి లోకంలా క‌న‌బ‌డతాయి కాబ‌ట్టి. నిజ‌మే ప్ర‌సార మాధ్య‌మాలు పెరుగుతున్న కొద్దీ ప‌లుర‌కాల అకృత్యాలు మ‌న‌క‌ళ్ల ముందే జ‌రుగుతున్నంత‌గా భ్ర‌మ క‌లుగుతోంది. స‌వ‌తి త‌ల్లి చేతిలో బాధ‌ల‌కు గుర‌యిన ఓ చిన్నారిని ప‌దేప‌దే చూపి ఆ అమ్మాయికి త‌గిన న్యాయం జ‌రిగేలా స‌హృద‌యులు, న్యాయ‌మూర్తులు, అధికారులు అంద‌రినీ క‌దిలించిన శ‌క్తి మీడియాదే. కానీ ఇలాంటి వార్త‌లను మాత్ర‌మే ప‌దేప‌దే చూప‌డం వ‌ల‌న ప్ర‌పంచ‌మంతా ఇలాగే ఉంద‌నే భ్ర‌మ ఎవ‌రికైనా క‌లుగుతుంది. జీవితం ప‌ట్ల లేనిపోని బెంగ‌, భ‌యం పెరుగుతాయి. మీడియా మంచి చెడుల‌ను బ్యాల‌న్స్ చేయ‌క‌పోవ‌డం వ‌ల‌న క‌లిగే అన‌ర్ద‌మిది.

ఇలాంట‌పుడు మ‌మ‌త మాన‌వ‌త‌ని ప్ర‌తిబింబించే వార్త‌లు మ‌నకు ప్ర‌త్యేకంగా, ఎడారిలో ప్ర‌యాణించేవాడికి చ‌ల్ల‌ని మంచినీళ్లు దొరికిన‌ట్టుగా అనిపిస్తాయి. అవి క‌నివినీ ఎరుగ‌నివిగా కనిపిస్తాయి. అవ‌కాశం ఉన్నా ఇత‌రుల‌కు హాని చేయ‌కుండా ఉండ‌గ‌ల‌గ‌డమే పెద్ద వార్త అనిపించేంత దారుణ‌మైన ప‌రిస్థితులు మ‌న చుట్టూ ఉన్నాయి. అందుకే బెంగ‌ళూరుకి చెందిన ఘ‌స‌మ్‌ఫార్ ఆలీ ఫేస్‌బుక్‌లో సంచ‌ల‌నాన్ని సృష్టిస్తున్నాడు.

ఇంతకీ అత‌నెవ‌రు? ఏం చేశాడు?…..

చెన్నైకి చెందిన రంజ‌ని శంక‌ర్ మార్కెటింగ్ క‌న్స‌ల్టెంట్‌, మ్యుజీషియ‌న్. నెల‌క్రితం షార్ట్ హాలిడే ట్రిప్‌గా బెంగ‌ళూరు వ‌చ్చింది. ఆ రాత్రి ఆమె సిటీనుండి త‌న ఫ్రెండు వ‌ద్ద‌కు వెళ్లిపోవాల‌నుకుంది. అక్క‌డికి 38 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న క‌న‌క్‌పురా రోడ్డుకి ఆమె వెళ్లాల్సి ఉంది. అప్ప‌టికే బాగా చీక‌టిప‌డిపోయింది. స‌మ‌యం ఎనిమిదిన్న‌ర‌యింది. క‌న‌క్‌పురా వెళ్ల‌క‌పోతే సిటీలో ఆ రాత్రి ఒంట‌రిగా ఉండాలి. అందుకే ఏదేమైనా వెళ్లిపోవాల‌నుకుంది. అయితే ఎంత ప్ర‌యత్నించినా క్యాబ్ దొర‌క‌లేదు. దాంతో ఫోన్‌లో ఉన్న ఓలా ఆటో యాప్ ద్వారా ఆటో కోసం ప్ర‌య‌త్నించింది. అలా ఆలీ ఆమెని గ‌మ్యానికి చేర్చ‌డానికి వ‌చ్చాడు. అయితే తాము ప్ర‌యాణించే మార్గం చాలావ‌ర‌కు వెలుతురు త‌క్కువ‌గానూ, నిర్మానుష్యంగానూ ఉంటుంద‌ని, చెప్ప‌డం త‌న బాధ్య‌త క‌నుక చెబుతున్నాన‌ని అంటూ, భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని ధైర్యం కూడా చెప్పాడు.రంజ‌నికి మ‌న‌సులో భ‌యంగానే ఉన్నా వెళ్ల‌డానికే నిర్ణ‌యించుకుంది. గూగుల్ మ్యాప్ తో తాను గైడ్ చేసిన రూటులో వెళ్దామ‌ని చెప్పింది. ఆలీ ముందు చెప్పిన‌ట్టుగానే పావుగంట‌లో చీక‌టిగా, నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుమీద‌కు ఆటో ఎక్కింది. అప్పుడ‌ప్పుడు అత‌ను ఆమెతో మాట్లాడుతూ భ‌య‌ప‌డ‌వ‌ద్దు మేడ‌మ్ అంటూ ధైర్యం చెబుతున్నాడు. ఎట్ట‌కేల‌కు ఆటో క‌న‌క్‌పురా చేరింది. అప్ప‌టివ‌ర‌కు బిక్కుబిక్కు మంటూ ఆటోలో కూర్చున్న రంజ‌ని అమ్మ‌య్య అనుకుంటూ ఒక్క అంగ‌లో ఆటో నుండి దూకింది. ఆ ప్రాంతంలో ఒక టీ షాపు ఉంది. కాస్త వెలుతురు ఉంది. అయితే రంజ‌నిని రిసీవ్ చేసుకోవాల్సిన ఫ్రెండు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవ‌డం వ‌ల‌న ఆటోడ్రైవ‌ర్ వెళ్లిపోతే త‌ను ఒక్క‌తే నిల‌బ‌డాలి. దాంతో కాసేపు త‌న‌కోసం అక్క‌డ ఉండాల్సిందిగా ఆమె ఆలీని కోరింది. అత‌ను ఆమె మాట మ‌న్నించాడు. రంజని ఫ్రెండుకి ఆమెని అప్ప‌గించాకే వెళ్లాడు. రంజ‌ని మ‌న‌సు అత‌నిప‌ట్ల కృత‌జ్ఞ‌త‌తో నిండిపోయింది. అందుకే ఆమె ఆ విష‌యాన్ని వెంట‌నే ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన గంట‌కే 400 లైక్‌లు వ‌చ్చాయి. తెల్లారేస‌రికి 2 వేలు, 4వేలు, 5వేలు దాటిపోయి ఇప్పుడు 17వేల 5వంద‌లు లైక్‌లు. దాదాపు 2వేల 8వంద‌లు షేర్లు వ‌చ్చాయి. ఆన్‌లైన్ న్యూస్ సైట్ల‌లోనూ అత‌ని పేరు మారుమోగి పోయింది. లైక్‌లు పెరుగుతున్న కొద్దీ ఆశ్చ‌ర్యంతో తెల్ల‌బోయిన రంజ‌ని, త‌న పోస్ట్ కి ఎందుకు అన్ని లైక్‌లు వ‌చ్చాయి అనే విష‌యం గురించి ఆలోచించింది.

క్యాబ్‌, ఆటో డ్రైవ‌ర్ల గురించి వ‌స్తున్న నెగెటివ్ వార్త‌లు విని ఉండ‌డం వ‌ల‌న ఈ వార్త జ‌నాన్ని అంత‌గా ఆక‌ట్టుకుంద‌ని, చీక‌ట్లో, ఒంట‌రిగా ఒక మ‌హిళ ఆటో డ్రైవ‌ర్‌తో ప్ర‌యాణం చేయ‌డం….ఈ ప‌రిస్థితుల‌కు మ‌హిళ‌లు బాగా క‌నెక్ట్ అయ్యార‌ని ఆమెకు అనిపించింది. ఇక బెంగ‌ళూరులో ఆలీకి హీరో వ‌ర్షిప్ వ‌చ్చేసింది. రేడియో, టివిల్లో అత‌ని ఇంట‌ర్వ్యూలు,పేప‌ర్ల‌లో ఆర్టిక‌ల్స్ తో మ‌రింత పాపుల‌ర్ అయిపోయాడు. స్థానిక పోలీస్ క‌మిష‌న‌ర్ అత‌డ్ని అభినందించి, త‌మ డిపార్ట్ మెంట్ ఫేస్‌బుక్‌లో అత‌ని ఫొటోని పోస్ట్ చేశాడు. ఓలా యాప్ యాజ‌మాన్యం ఆలీ ఆటోమీద ఉన్న లోన్‌ని చెల్లించేందుకు ముందుకొచ్చింది. త‌మ‌తోపాటు రంజ‌ని కూడా ఆలీ ఇంటికి వ‌చ్చి అత‌డిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాల‌ని ఓలా ప్ర‌తినిధులు కోర‌గా అందుకు ఆమె అంగీక‌రించింది. చెన్నై నుండి బెంగ‌ళూరు మ‌ళ్లీ వ‌చ్చింది. నిజంగానే ఆలీ ఆమెని చూసి ఆశ్చ‌ర్య‌పోయాడు. త‌న భార్య‌ని, ఐదేళ్ల కొడుకుని ప‌రిచయం చేశాడు. త‌న కుటుంబ స‌భ్యుల కోరిక మేర‌కు రంజ‌ని అత‌నికి ఒక వాచీని బ‌హుమ‌తిగా ఇచ్చింది. రంజ‌ని ఆలీ ‌కుటుంబంతో క‌లిసి టీ తాగుతున్న‌పుడు అత‌ను ఆమెను అడిగాడు -మేడ‌మ్‌జీ, న‌న్ను ఎందుకు అంద‌రూ ఇంత‌గా గుర్తిస్తున్నారు. ఇదంతా ఫేస్ బుక్ వ‌ల్ల‌నే జ‌రిగింద‌ని చెబుతున్నారు. ఫేస్‌బుక్ అంటే ఏమిటో అర్థ‌మైంది కానీ, లైక్‌లు అంటే ఏమిటి? – అని.

అవును మ‌నం కూడా ఇప్ప‌డు ఈ లైక్‌ల‌కు అర్థం చెప్పుకోవాలి. ఆలీని అభినందించ‌డం, అత‌డి నిజాయితీని గుర్తించ‌డం నిజంగా మంచి విష‌యాలే. దాన్ని ప‌క్క‌నుంచితే… ఈసంఘ‌ట‌న‌కు వ‌స్తున్న లైక్‌ల గురించి చెప్పుకోవాలంటే -అత‌నికి ల‌భించిన ఆద‌ర‌ణ‌, ఆ సంఘ‌ట‌న జ‌నంలో కలిగించిన ఆనందం… మ‌న‌లో మ‌హిళ‌ల భ‌ద్ర‌త ప‌ట్ల ఎంత‌టిఅభ‌ద్రతా భావం ఉందో తెలియ‌జేస్తున్నాయి. ఈ విష‌యంలో మ‌న‌మెంత ఉద్వేగ భ‌రితంగా, ఆందోళ‌న‌గా, డిప్రెసివ్‌గా ఉన్నామో కూడా ఇది రుజువు చేసింది. అందుకేఅత్యాచారాలు, హింస‌, గ్యాంగ్ రేప్‌ వంటివి మ‌న‌కిప్పుడు రొటీన్ వార్త‌ల్లా క‌నిపించి, అర్థ‌రాత్రి ఒక మ‌హిళ‌ని క్షేమంగా చేర్చిన ఒక మ‌గ‌వాడి మంచిత‌నం, మాన‌వ‌త్వం(స‌హ‌జంగా ఉండాల్సిన‌వి) అసాధార‌ణంగా, అది ఊహించ‌ని సంఘ‌ట‌న‌గా క‌న‌బ‌డుతోంది. ఈ ప‌రిస్థితిని ఏమందాం….మ‌న‌పై మనం జాలిప‌డ‌డం త‌ప్ప‌!!!!!

-వి. దుర్గాంబ‌

Tags:    
Advertisement

Similar News