రెవిన్యూ అధికారులపై మళ్ళీ దేశం గూండాల దాడి
గుంటూరు జిల్లా మంగళగిరిలో మరోసారి గూండాలు అధికారులపై స్వైర విహారం చేశారు. మండల పరిధిలోని ఆత్మకూరు వద్ద జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 366లో అదే గ్రామానికి చెందిన ముగ్గురికి ప్రభుత్వం గతంలో 65 సెంట్ల భూమిని మంజూరు చేసింది. ఈ భూమి ప్రభుత్వ రికార్డుల్లో పోరంబోకు భూమిగా నమోదై ఉంది. మంగళగిరికి చెందిన కొందరు ఆ భూమిలో 20 సెంట్లను కాజేసేందుకు నకిలీ రికార్డులు సృష్టించి అందులో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని […]
Advertisement
గుంటూరు జిల్లా మంగళగిరిలో మరోసారి గూండాలు అధికారులపై స్వైర విహారం చేశారు. మండల పరిధిలోని ఆత్మకూరు వద్ద జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 366లో అదే గ్రామానికి చెందిన ముగ్గురికి ప్రభుత్వం గతంలో 65 సెంట్ల భూమిని మంజూరు చేసింది. ఈ భూమి ప్రభుత్వ రికార్డుల్లో పోరంబోకు భూమిగా నమోదై ఉంది. మంగళగిరికి చెందిన కొందరు ఆ భూమిలో 20 సెంట్లను కాజేసేందుకు నకిలీ రికార్డులు సృష్టించి అందులో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని లబ్దిదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను పిలిపించి మందలించి పంపారు. దీంతో రెచ్చిపోయిన ఈ కబ్జాదారులు తెలుగుదేశం పార్టీ నేతల అండదండలతో నకిలీ పత్రాలు సృష్టించిన స్థలంలో నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నించారు. దీంతో విషయం తెలుసుకున్న ఆత్మకూరు తహసిల్దారు ప్రభుత్వ భూమిని కాపాడే చర్యల్లో భాగంగా వీఆర్వో శ్రీనివాసరావును, విడీఏ చలపతిరావును అక్కడికి పంపించారు. వీరు అక్కడికి వెళ్ళి జరుగుతున్న నిర్మాణాన్ని చూసి ఆపమని కోరారు. దాంతో రెచ్చిపోయిన ఆరుగురు అధికారులిద్దరిపై విచక్షణారహితంగా దాడికి దిగారు.
ఈ ఇద్దరు అధికారుల్లో శ్రీనివాసరావు చొక్కా చింపేసి, ఈడ్చి ఈడ్చి కొట్లారని, ఒక దళితుడ్ని పట్టుకుని ఇలా కొట్టడం అన్యాయమని ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. విఆర్‌ఓ శ్రీనివాసరావు ప్రాణ భయంతో వదిలేయాలని ప్రాధేయపడినా వదలకుండా తన్నుతూ ప్రాణాన్ని తీసే ప్రయత్నం చేశారని వారు ఆరోపించారు. దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టిన వారిపై కేసులు పెట్టినా అవి కంటితుడుపుగా ఉన్నాయని, దౌర్జన్యకారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు, దౌర్జన్యం కేసు నమోదు చేయాలని రెవిన్యూ ఉద్యోగుల తరఫున డిమాండు చేశారు. దాడి చేసిన వ్యక్తులపై 332,353 రెడ్ విత్ 34 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారని, ఇవి కంటితుడుపు సెక్షన్‌లని, వీటిని వెంటనే మార్చాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండు చేశారు. ఉద్యోగం చేయాలంటేనే భయపడే పరిస్థితి ఉండని, ప్రజాప్రతినిధులు, గూండాల బారిన పడి తాము దాడులకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీ రెవిన్యూ విలేజ్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. మొన్నటికిమొన్న వనజాక్షి మీద దాడి జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, పైగా దాడి చేసిన ఎమ్మెల్యే ప్రభాకర్‌ను, అతని గూండాలను సమర్దిస్తూ ఏపీ కేబినెట్ క్లీన్ చిట్ ఇచ్చిందని, ఈ పరిస్థితిలో ఉద్యోగులు తమ విధులను నిర్భయంగా నిర్వహించలేని పరిస్థితి వచ్చిందని వారన్నారు. ఈ దాడిని పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదని వారన్నారు. రాజధాని ఇక్కడకు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని, కాని ఎవరూ తమ విధులను సక్రమంగా నిర్వహించడానికి సహకరించడం లేదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement