భూ సేకరణ బిల్లు లేనట్టే!
ఈ సారి కూడా పార్లమెంటు సమావేశాల్లో భూ సేకరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు కానరావడం లేదు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ఈసారికి మరోసారి ఆర్డినెన్స్ తో సరిపెట్టాలని చూస్తోంది. భూసేకరణపై విపక్షాల నుంచి ఏకాభిప్రాయం రాకపోవడం ఇందుకు ప్రధాన కారణం. కార్పొరేట్ వర్గాలకు కొమ్ముకాసేలా భూ బిల్లు ఉందని విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఈసారి ప్రవేశపెట్టినా దానికి ఆమోదం లభించే పరిస్థితులు కనిపించడం లేదు. పైగా ఈ విషయంలో […]
Advertisement
ఈ సారి కూడా పార్లమెంటు సమావేశాల్లో భూ సేకరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు కానరావడం లేదు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ఈసారికి మరోసారి ఆర్డినెన్స్ తో సరిపెట్టాలని చూస్తోంది. భూసేకరణపై విపక్షాల నుంచి ఏకాభిప్రాయం రాకపోవడం ఇందుకు ప్రధాన కారణం. కార్పొరేట్ వర్గాలకు కొమ్ముకాసేలా భూ బిల్లు ఉందని విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఈసారి ప్రవేశపెట్టినా దానికి ఆమోదం లభించే పరిస్థితులు కనిపించడం లేదు. పైగా ఈ విషయంలో వివిధ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోన్న అహ్లువాలియా నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక సమర్పించేందుకు మరో రెండువారాల పాటు గడువు కోరింది. అంటే ఆగస్టు 3 వరకు గడువు కోరిందన్నమాట. పార్లమెంటు సమావేశాలు మంగళవారం నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్న నేపథ్యంలో ఈ కమిటీ నివేదిక సమర్పించినా బిల్లు ప్రవేశపెట్టడంపై అనుమానాలు కలుగుతున్నాయి. బీహార్‌లో జనతా పరివార్ బీజేపీకి వ్యతిరేకంగా కొత్తకూటమిని సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో భూసేకరణ బిల్లు పెడితే అది ఎన్నికల ప్రచారంలో జనతాపరివార్ చేతిలో బ్రహ్మాస్త్రంగా మారుతుంది. దీంతో ప్రస్తుతానికి ఆర్డినెన్స్‌తో సరిపెట్టాలని మోదీ సర్కారు భావిస్తోంది.
విపక్షాలకు భయపడే!
మోదీ సర్కారు ఏర్పడినప్పటి నుంచి విపక్షాలు కార్పొరేట్ అనుకూల సర్కారు అని విమర్శిస్తూనే ఉన్నాయి. ఏడాది కాలంలో భూసేకరణ బిల్లు రూపంలో తప్ప ఆ ఆరోపణను నిరూపించేందుకు వాటికి మరో మార్గం దొరకలేదు. ఏడాదిపాలనలో మచ్చల్లేవు అంటూ జబ్బలు చరుచుకుంది ఎన్‌డీఏ. సరిగ్గా అదే సమయంలో మోదీ గేట్ వెలుగుచూసింది. అవినీతి, మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్‌మోదీకి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వీసా ఇప్పించారన్న విషయాలు వెలుగులోకి రావడంతో ఎన్‌డీఏకి కష్టాలు మొదలయ్యాయి. దీనికితోడు వసుంధరా రాజేకు లలిత్ మోదీ వ్యాపార సంబంధాలు, మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం సాగిస్తున్న మరణమృదంగం, మహారాష్ర్టలో పంకజముండేపై అవినీతి ఆరోపణలు అబ్బో! కాంగ్రెస్ చేతిలో చాలా ఆయుధాలు ఉన్నాయిప్పుడు. వీటికి సమాధానాలు చెప్పే బదులు ఎదురుదాడే నయమనుకుంటోంది బీజేపీ. ఈసారి సమావేశాలూ విపక్ష- అధికార పక్షాల నిరసనలతో దద్దరిల్లడం ఖాయం.
Advertisement