పుష్కర ఘాట్లలో పెరిగిన భక్త జనం...జగన్ పుణ్య స్నానం
తెలుగు రాష్ట్రాల్లో పుష్కర శోభ కనిపిస్తోంది. అటు ఆంద్రప్రదేశ్‌లోను, ఇటు తెలంగాణలోను భక్తుల రద్దీ కొనసాగుతోంది. తొలిరోజు కన్నా ఈరోజు రాజమండ్రిలో జనం పెరిగారు. ఆషాఢ మాసం, అమావాస్య కావడంతో పుష్కర పుణ్య స్నానం కోసం భక్తజనం పోటెత్తారు. అమావాస్య కావడంతో సాయంత్రానికి మరింత మంది భక్తులు వస్తారని, దీనికి తగ్గట్టు అధికారులను అప్రమత్తం చేశామని చెబుతున్నారు. తెల్లావారుజామునుంచే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులు గోదావరి మాతకు పూజాదికాలు నిర్వహించిన తర్వాత […]
Advertisement
తెలుగు రాష్ట్రాల్లో పుష్కర శోభ కనిపిస్తోంది. అటు ఆంద్రప్రదేశ్‌లోను, ఇటు తెలంగాణలోను భక్తుల రద్దీ కొనసాగుతోంది. తొలిరోజు కన్నా ఈరోజు రాజమండ్రిలో జనం పెరిగారు. ఆషాఢ మాసం, అమావాస్య కావడంతో పుష్కర పుణ్య స్నానం కోసం భక్తజనం పోటెత్తారు. అమావాస్య కావడంతో సాయంత్రానికి మరింత మంది భక్తులు వస్తారని, దీనికి తగ్గట్టు అధికారులను అప్రమత్తం చేశామని చెబుతున్నారు. తెల్లావారుజామునుంచే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులు గోదావరి మాతకు పూజాదికాలు నిర్వహించిన తర్వాత దగ్గరలో ఉన్న ఆలయాలను సందర్శించడంతో అవి కూడా కిక్కిరిసి ఉంటున్నాయి. కొవ్వూరు గోస్పాద క్షేత్రం వద్ద బుధవారం ఉదయం వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి పుష్కర స్నానం ఆచరించి తన తండ్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి, తాత వై.ఎస్. రాజారెడ్డి ఆత్మలకు శాంతికలగాలని ప్రార్థిస్తూ పిండ ప్రదానం చేశారు. పండితులతో పూజలు నిర్వహించిన తర్వాత మరోసారి గోదావరి నదిలో పుణ్య స్నానమాచరించారు.
పుష్కర ఘాట్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి పి. నారాయణ తెలిపారు. ఘాట్లకు మూడు కిలోమీటర్ల దూరం ఉంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంచామని, ఆయా ప్రాంతాల నుంచి ఆర్టీసీ ఉచిత బస్సులు నడుపుతుందని తెలిపారు. రైళ్ళు, బస్సులు కూడా నిన్నటి కన్నా ఈరోజు 31 శాతం పెరిగాయని మంత్రి తెలిపారు. అన్ని పుష్కర ఘాట్లకు భక్తులను సమంగా తరలించమని అధికారులను ఆదేశించినట్టు ఆయన చెప్పారు. సాయుధ బలగాలను కూడా పెంచామని ఆయన తెలిపారు.
ఇక తెలంగాణలో కూడా పుష్కర ఘాట్లు, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రధాన ఆలయాలు కూడా పుష్కర శోభను సంతరించుకున్నాయి. భద్రాచలం, ధర్మపురి, కాళేశ్వరం, బాసర ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లలో కూడా వేలాది మంది భక్తులు పుష్కర స్నానాలకు విచ్చేయడంతో కిటకిట లాడుతున్నాయి. స్నానాల ఘాట్ల వద్ద భక్తులు బారులు తీరి ఉన్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తూ గోదావరి మాతకు మొక్కులు తీర్చుకుంటున్నారు భక్త జనం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
Advertisement