చావుల‌కు బాధ్యుడు చంద్ర‌బాబే: చిరంజీవి ధ్వ‌జం

రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాట దుర్ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని కాంగ్రెస్‌ నేత చిరంజీవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుష్కరాలకు అన్ని తానై ఉన్న చంద్రబాబు నాయుడు తొక్కిసలాట ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తొక్కిసలాటలో 27 మంది మృతి చెందడం దిగ్ర్భాంతికి గురిచేందన్నారు. మీడియాలో తొక్కిసలాట దృశ్యాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచార ఆర్భాటమే తప్ప చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పుష్కరాలకు ఎంతమంది […]

Advertisement
Update:2015-07-14 10:01 IST
రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాట దుర్ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని కాంగ్రెస్‌ నేత చిరంజీవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుష్కరాలకు అన్ని తానై ఉన్న చంద్రబాబు నాయుడు తొక్కిసలాట ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తొక్కిసలాటలో 27 మంది మృతి చెందడం దిగ్ర్భాంతికి గురిచేందన్నారు. మీడియాలో తొక్కిసలాట దృశ్యాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచార ఆర్భాటమే తప్ప చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పుష్కరాలకు ఎంతమంది వస్తారనేది అంచనా వేయలేక పోవడం వైఫల్యమే అన్నారు. ఈ పుష్క‌రాల నిర్వ‌హ‌ణ‌కు వేసిన క‌మిటీలో ఇద్ద‌రు మంత్రుల‌ను, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌ను వేశార‌ని, వీరెంత‌వ‌ర‌కు ప‌ని చేశారో మొద‌టి రోజే వెల్ల‌డైంద‌ని అన్నారు. ఒట్టి అనుభ‌వ శూన్యుడు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌… ఏర‌కంగా పుష్క‌రాల ఏర్పాట్ల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌గ‌ల‌ర‌ని చంద్ర‌బాబు అనుకున్నారో అర్దం కాద‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. వీట‌న్నింటికీ తోడు తానే అన్నీ అయి న‌డిపించిన చంద్ర‌బాబు ఈ దుర్ఘ‌ట‌న‌కు నైతిక బాధ్య‌త వ‌హించాల‌ని ఆయ‌న డిమాండు చేశారు. గతంలో కృష్ణా పుష్కరాల సమయంలో ఇద్దరు ముగ్గురు చనిపోతే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నానాయాగీ చేశారని మండిపడ్డారు. తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు ఆయన అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలన్నారు. కుంభమేళాను మించి అద్భుతంగా ఏర్పాట్లు చేశామని త‌మ భుజాలు తామే చ‌రుచుకుని గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ విషాదం జరిగిందని చిరంజీవి ఆరోపించారు.

చంద్ర‌బాబు వైఖ‌రే ఈ దుర్ఘ‌ట‌న‌కు కార‌ణం: ర‌ఘువీరా
ప్ర‌క‌ట‌న‌ల మీద ఉన్న శ్ర‌ద్ధ ప‌నుల‌పై లేక‌పోవ‌డ‌మే ప్ర‌స్తుత ఈ దుస్థితికి కార‌ణ‌మ‌ని ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. జ‌పాన్ వెళ్లే ముందు పుష్క‌ర ప‌నుల‌పై అసంతృప్తి, ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు… ఆ ప‌నులు బాగోలేని స‌మ‌యంలో వాటిని ప‌ర్య‌వేక్షిస్తున్న మంత్రుల్ని, మ‌రో సూప‌ర్ ముఖ్య‌మంత్రి ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌ను మీ కూడా జ‌పాన్‌కు ఎలా తీసుకెళ్ళార‌ని ప్ర‌శ్నించారు. పుష్క‌రాల క‌మిటీల్లో మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, మ‌రో మంత్రి పి. నారాయ‌ణ‌ల‌తోపాటు వీరంద‌రికీ సూప‌ర్ బాస్‌గా ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌ను నియ‌మించార‌ని, వీరంద‌రినీ తీసుకుని చంద్ర‌బాబు జ‌పాన్ వెళ్లిపోయార‌ని, నిజంగా పుష్క‌రాల ఏర్పాట్ల ప‌ట్ల చిత్త‌శుద్ధి ఉంటే ముఖ్య‌మంత్రి ఇలా చేసి ఉండ‌కూడ‌ద‌ని ఆయ‌న అన్నారు. కేవ‌లం మీడియా ప‌బ్లిసిటీ కోసం ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం… చంద్ర‌బాబుకు అల‌వాటుగా మారింద‌ని ఆయ‌న ఆరోపించారు. ఎవ‌రి ప‌నులు వాళ్ళను చేసుకోనివ్వ‌కుండా స‌మీక్ష‌లంటూ అధికారుల‌ను చుట్టూ తిప్పుకుంటే ఇలాంటి దుర్ఘ‌ట‌న‌లే జ‌రుగుతాయ‌ని ఆయ‌న ఆరోపించారు.

తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వానిదే వైఫల్యం : బొత్స
రాజమండ్రి తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అంతా తానే అంటూ ఏ కార్యాక్రమాలను జరగనీయకుండా ప్రభుత్వ యంత్రాగాన్ని తన చుట్టూ తిప్పుకున్నారని మండిపడ్డారు. కేబినెట్‌లో ఏ మంత్రికి బాధ్యతలు అప్పగించలేదని… చివరకు దేవాదాయ శాఖ మంత్రిని అవమానపరిచేలా వ్యవహరించారన్నారు. తాను చాలా అనుభవజ్ఞుడినని ప్రచారం చేస్తూ రాజకీయలబ్ది పొందాలని చూశారని, దీని ఫ‌లితం జ‌నం అనుభ‌వించారని, ఈ పాపం చంద్ర‌బాబుదేన‌ని బొత్స విమర్శలు గుప్పించారు.

బాబు వ‌ల్ల రాజ‌మండ్రికి మాయ‌నిమ‌చ్చ: ఉండ‌వ‌ల్లి
హైప్ క్రియేట్ చేయ‌డంలో చూపించిన శ్ర‌ద్ధ సౌక‌ర్యాలు ఏర్పాటు చేయ‌డంలో చూపించ‌లేద‌ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ అన్నారు. ఎంత‌సేపు లేజ‌ర్ షో ఎలా ఏర్పాటు చేయాలి… ఎన్టీఆర్ విగ్ర‌హాల‌ను ఎక్క‌డ పెట్టాలి… అనే విష‌యాల‌పైనే ఎక్కువ శ్ర‌ద్ధ చూపించార‌ని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబు స్నానం చేసి వెళ్ళిపోయిన త‌ర్వాత త‌మ ప‌ని పూర్త‌యిన‌ట్టు అధికారులంతా ఒకేసారి జారుకున్నార‌ని, దీంతో అంతా ఒక్క‌సారిగా తాకిడిగా గేట్ల నుంచి లోప‌లికి తోసుకొచ్చేశార‌ని ఇది దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌, రాజ‌మండ్రికి మ‌చ్చ తెచ్చే సంఘ‌ట‌న అని ఆయ‌న అన్నారు..

దురదృష్టకరం: దత్తాత్రేయ
గోదావరి పుష్కరాలు ప్రారంభం రోజునే తొక్కిసలాట జరిగి 27 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టిన సందర్భంలో ప్రభుత్వం తగిన జాగ్రత్త‌లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. మృతులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
Tags:    
Advertisement

Similar News