సూపర్...సానియా!
కడలంత క్రీడా స్ఫూర్తి…దేశానికే కీర్తి! ఆమె టెన్నిస్‌ని ప్రేమించింది…దాంతో నెంబర్ వన్ స్థానం చేరువైంది….టెన్నిస్‌తో చిరకాల స్నేహం చేసింది…..వింబుల్డన్ టైటిలే వరించి వచ్చింది. లక్ష్యసాధనలో కష్టాలుండవచ్చు….కానీ అది ఇష్టపడి చేస్తున్నపుడు ఆ కష్టాలను భరించే శక్తి మనిషిలో ఎలా పెరుగుతుందో సానియా నిరూపించింది. అనుక్షణం టెన్నిస్ పై పెంచుకున్న ప్రేమ నేడు ఆమెను శిఖరాగ్రానికి చేర్చింది. దేశమే గర్వించదగిన స్థాయిలో నిలబెట్టింది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గిన సానియా మీర్జాను ప్రధాని, రాష్ట్రపతి అభినందించారు. ఈ విజయం సాధించిన తొలి భారత మహిళ […]
కడలంత క్రీడా స్ఫూర్తి…దేశానికే కీర్తి! ఆమె టెన్నిస్‌ని ప్రేమించింది…దాంతో నెంబర్ వన్ స్థానం చేరువైంది….టెన్నిస్‌తో చిరకాల స్నేహం చేసింది…..వింబుల్డన్ టైటిలే వరించి వచ్చింది. లక్ష్యసాధనలో కష్టాలుండవచ్చు….కానీ అది ఇష్టపడి చేస్తున్నపుడు ఆ కష్టాలను భరించే శక్తి మనిషిలో ఎలా పెరుగుతుందో సానియా నిరూపించింది. అనుక్షణం టెన్నిస్ పై పెంచుకున్న ప్రేమ నేడు ఆమెను శిఖరాగ్రానికి చేర్చింది. దేశమే గర్వించదగిన స్థాయిలో నిలబెట్టింది.
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గిన సానియా మీర్జాను ప్రధాని, రాష్ట్రపతి అభినందించారు. ఈ విజయం సాధించిన తొలి భారత మహిళ కావడంతో దేశమంతా గర్వపడుతున్నదని అన్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సానియాకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సైతం అభినందనలు తెలిపారు. అమ్మాయిలందరికీ ఈ విజయం స్ఫూర్తిని ఇవ్వాలన్నారు.
నిజమే సానియా ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సాధించి రికార్డు సృష్టించింది. స్విస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్‌తో కలిసి ఆమె ఈ ఘనత సాధించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు మరింతగా గర్వించదగిన విజయం ఇది. గెలుపుకోసమే ఆడతాను అంటున్న ఈ హైదరాబాద్ అమ్మాయి….మనందరి కలని ఇలా సాకారం చేసే అవకాశం తనకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉందని, తన విజయం అమ్మాయిల్లో స్ఫూర్తి ని నింపాలని ఆశించింది.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వింబుల్డన్ డబుల్స్ టైటిళ్లు నెగ్గిన క్రీడాకారిణుల వరుసలో సానియా పేరు నిలిచి, భారత్ క్రీడా స్ఫూర్తిని మరొకసారి ప్రపంచం ముందు నిలిపింది. లక్ష్యం ఎంత ఉన్నతంగా, ఎంత స్పష్టంగా ఉండాలో లక్ష్యాన్ని జీవితంగా మలచుకుంటే మనిషి ఎలా శ్రమించాలో సానియా నిరూపించింది. అయితే ఆమె జీవితంలోనూ ఎత్తుపల్లాలు ఉన్నాయి. అపజయాలున్నాయి, వెక్కిరింపులూ ఉన్నాయి. కానీ విమర్శలు వచ్చినపుడు కూడా ఆమె గెలుపుమీదే దృష్టి పెట్టింది కనుకనే ఈ రోజు దేశఖ్యాతిని ఇనుమడింపచేసే స్థితికి చేరింది.
టెన్నిస్ గురించి ఏమీ తేలియని వారికి సైతం మనదేశంలో ఆ ఆట పేరు వింటే గుర్తొచ్చే ఏకైక పేరు సానియా. అంతగా టెన్నిస్‌తో ఆమె జీవితం పేనవేసుకుపోయింది.
పన్నెండేళ్ల క్రితం వింబుల్డన్ బాలికల డబుల్స్ టైటల్ గెలిచి సృష్టించిన సంచలనాన్ని సానియా కొన్నేళ్లు కొనసాగించింది. అయితే సింగిల్స్ లో ఎంతో వేగంగా ఎదిగి ప్రపంచ 27వ ర్యాంకు సాధించినా ఆ తరువాత ఆ స్థాయి ఆటని ప్రదర్శించలేకపోయింది. ఆ సమయంలో 150 ర్యాంకుకంటే కిందకు పడిపోయి విమర్శల పాలైనా, కిందపడిన బంతి అంతేవేగంగా పైకి లేస్తుందన్న సంగతిని ఆమె మర్చిపోలేదు.
సింగిల్స్ నుండి తప్పుకుని డబుల్స్ ఆడటం మొదలుపెట్టాక సానియా ప్రతిభ మరొకసారి ఆకాశానికి ఎగిసింది. ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంకుతోపాటు నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు ఆమె సొంతమయ్యాయి. వింబుల్డన్ కంటే ముందు మహేశ్ భూపతితో 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012లో ఫ్రెంచ్ ఓపెన్, 2014లో బ్రూనో సోరెస్ తో యుఎస్ ఓపెన్ గెలుచుకుంది. ఇప్పుడు గ్రాండ్‌స్లామ్ ల్లో ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్‌నే సొంతం చేసుకుంది. గ్రాండ్‌స్లామ్ టోర్నమెంటుల్లో పాల్గొని పతకం సాధించిన మూడవ భారత మహిళగా కూడా సానియా రికార్డు సృష్టించింది. ఏషియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ల్లో ఆరు గోల్డ్ మెడల్స్ తో పాటు మొత్తం 14 మెడల్స్ సాధించింది. అక్టోబరు 2005 టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన 50మంది ప్రపంచస్థాయి హీరోల్లో సానియాకు చోటు దక్కింది.
2010లో ఎకనమిక్ టైమ్స్ ప్రకటించిన భారత్ గర్వించదగిన 33మంది మహిళల్లో ఆమె ఒకరు. 2003నుండి 2013లో సింగిల్స్ కి రిటైర్ మెంట్ ప్రకటించే వరకు ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఇచ్చిన ర్యాంకుని బట్టి సింగిల్స్, డబుల్స్ లో కూడా ఆమే భారత నెంబర్‌వన్ ప్లేయర్. ఐక్యరాజ్యసమితి సానియాను గత ఏడాది దక్షిణ ఆసియాకు ఉమెన్స్ గుడ్‌విల్ అంబాసిడర్ గా నియమించింది.
సానియా మీర్జాని చూసి ఎంతోమంది తల్లిదండ్రులు తమ చిన్నారులు సానియాలా టెన్నిస్ స్టార్‌లు కావాలని కలలు కన్నారు, కంటున్నారు…అచ్చం అలాంటి కలలే సానియా తల్లిదండ్రులు సైతం కన్నారు. తన సోదరి ప్రపంచ డబుల్స్ లో మొదటిర్యాంకు క్రీడాకారిణిగా నిలిచినపుడు సానియా చెల్లెలు ఆనమ్ మీర్జా వ్యక్తం చేసిన భావాల్లో ఆకలలు, సానియా పడిన కష్టం కళ్లకు కట్టినట్టుగా కనబడతాయి.
చిన్నతనంలో సానియాను టోర్నమెంట్లకు తీసుకువెళుతూ తమ కుటుంబం దేశమంతా తిరుగుతున్నపుడు జనం తమని ఎగతాళిగా చూసేవారని, ఈ అమ్మాయి మరో మార్టినా హింగిస్ అవుతుందా అని వెక్కిరించేవారని, కానీ సానియాకు తనపై తనకు అంతటి నమ్మకం ఉందని ఆనమ్ చెప్పింది. తన సోదరి ప్రతిరోజూ టెన్నిస్‌తో ప్రేమలో పడుతుందంది. తానూ తల్లీ, కారులో వెంట ప్రయాణిస్తుండగా సానియా టెన్నిస్ కోర్టులో సైక్లింగ్ చేయడాన్ని ఆమె గుర్తు చేసుకుంది. టోర్నమెంట్లకోసం కుటుంబం వారాల తరబడి దేశమంతా తిరగటం, నెలల తరబడి చెల్లెలు అక్కను చూడకుండా ఉండడం, సంవత్సరాల తరబడి ఒకరిని విడిచి ఒకరు భిన్న ఖండాల్లో ఉండాల్సి రావడం…. ఇవన్నీ సానియా టెన్నిస్ ప్రయాణంలో ఆ కుటుంబం చవి చూసిన మజిలీలు.
తన సోదరి చాలా క్రమశిక్షణ ఉన్న వ్యక్తి అని, సూపర్ హ్యూమన్ అని ఆనమ్ పేర్కొంది. 21 సంవత్సరాల కృషి సానియాని నెంబర్ వన్ స్థానానికి చేర్చిందని తెలిపింది. తన స్నేహితులు అందంగా కనిపించడంపై శ్రద్ధ పెడుతున్న సమయంలో సానియా ఎండలో ఆడేందుకు సిద్ధపడేదని, ఆమె చాలా ఆత్మవిశ్వాసమున్న అమ్మాయని ఆనమ్ అంది. స్నేహితులంతా బర్త్ డే పార్టీలకు వెళుతుంటే సానియా ప్రాక్టీస్‌కు వెళుతుండేదని, ఆమె తనకు నచ్చిన పనే చేస్తుందని, టెన్నిస్‌ని సానియా అంతగా ఇష్టపడిందని ఆనమ్ తెలిపింది. నిజానికి టెన్నిస్ సానియాని ఉన్నత శిఖరాలపై నిలిపి ఉండవచ్చు కానీ, తన కృషితో మనదేశంలో ఆ ఆటకు ఆమె అంతటి గుర్తింపునీ తెచ్చింది. ఈ భారత యువ తేజం మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.
-వి. దుర్గాంబ