సంపన్న తెలంగాణలో ఆర్థిక సంక్షోభం?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తమది దేశంలోనే అత్యధిక సంపన్న రాష్ట్రమని పలు బహిరంగ వేదికలపై పదే పదే ప్రకటించారు. అయితే ఏడాది తిరక్క ముందే సంపన్న రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం ఆర్థికవేత్తలనే విస్మయానికి గురి చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పొరుగునున్న ఆంధ్ర ఆర్థిక ఇబ్బందులతో పురిటినొప్పులు పడుతుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమది ధనిక రాష్ట్రమని వెలుగెత్తి చాటారు. అయితే ఆయన సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏడాది పూర్తి […]
Advertisement
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తమది దేశంలోనే అత్యధిక సంపన్న రాష్ట్రమని పలు బహిరంగ వేదికలపై పదే పదే ప్రకటించారు. అయితే ఏడాది తిరక్క ముందే సంపన్న రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం ఆర్థికవేత్తలనే విస్మయానికి గురి చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పొరుగునున్న ఆంధ్ర ఆర్థిక ఇబ్బందులతో పురిటినొప్పులు పడుతుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమది ధనిక రాష్ట్రమని వెలుగెత్తి చాటారు. అయితే ఆయన సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏడాది పూర్తి చేసుకునే సరికి పరిస్థితి తారుమారైంది. అత్యంత ధనిక రాష్ట్రమని అందరూ భావించిన తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు నెలసరి జీతాలు చెల్లించడానికి సైతం అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురించింది. బాండ్ల విక్రయం ద్వారా ఆర్‌బీఐ నుంచి అప్పులు తెచ్చుకోవడం తప్ప గత్యంతరం లేని పరిస్థితులకు చేరుకుంది. అంతేకాకుండా ఉపాధి హామీ పథకానికి కేంద్రం పంపిన రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ఖజానాకు తరలించింది.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఇంకా మూడు నెలలు కూడా గడవక ముందే ఖజానా లోటు రూ. 2,500 కోట్లు దాటింది. ఏప్రిల్, మే నెలల్లో ప్రభుత్వానికి రూ. 7,261 కోట్ల ఆదాయం లభిస్తే, వ్యయం రూ. 8,501 కోట్లు. ప్రణాళిక వ్యయం కూడా కలిపితే మొత్తం రూ. 10,291 కోట్లు ఖర్చైంది. దీంతో ఖజానాకు రూ. 1,223 కోట్ల లోటు ఏర్పడింది. దీంతోపాటు జూన్‌లో జరిగిన పరిణామాలు ప్రభుత్వ ఆదాయాన్ని మరింత కుంగదీశాయి. ఉమ్మడి ఏపీ ఎక్సైజ్ సుంకాలపై చెల్లించాల్సిన రూ. 1,274 కోట్ల ఐటీ బకాయిలను ఆర్‌బీఐ తెలంగాణ ఖజనా నుంచి తరలించడంతో ఆర్థిక నిధుల నిర్వహణ ఒక్కసారిగా తలకిందులైంది. దీంతో ఉద్యోగుల జీతాలతోపాటు ప్రభుత్వ పథకాలకు నిధులు మంజూరు చేయడం ఆర్థిక శాఖకు ఇబ్బందిగా మారుతోది. రైతుల రుణమాఫీ రెండో విడతకోసం జూలైలో మంజూరు చేయాల్సిన నిధులు రూ. 2,207 కోట్లు, విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు రూ. 2,500 కోట్ల బిల్లులు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు గోదావరి పుష్కరాలకు రూ. 600 కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా రూ. 100 కోట్లకు మించి పైసా కూడా ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని ఆర్థికశాఖ తేల్చి చెబుతోంది. సంవత్సరం తిరగకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోవడానికి కారణం ఆర్థిక క్రమశిక్షణ పాటించక పోవడం, ప్రభుత్వ నిర్దేశించుకున్న భారీ లక్ష్యాల కోసం ఎడాపెడా నిధులు కేటాయించడం, శక్తికి మించిన పథకాలు చేపట్టడంతోపాటు ముఖ్యమంత్రి కురిపిస్తున్న వరాల జల్లులేనని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.
Advertisement