గుడి, బడి తలుచుకుంటే హరితహారానికి విజయమే: కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమానికి రంగారెడ్డి చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రాంగణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శ్రీకారం చుట్టారు. అంతకుముందు ఆయన చిలుకూరు బాలాజీని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అందరికీ ఆకుపచ్చని వందనాలు అంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఓ పథకానికి గుడి, బడి నాంది పలికితే అది ఖచ్చితంగా విజయవంతమవుతుందని కేసీఆర్ చెబుతూ…హరితహారం పథకం అమలుకు ప్రతి విద్యార్థిని ఒక హరిత సైనికుడిగా మార్చాలని ఉపాధ్యాయులకు పిలుపు ఇచ్చారు. చిలుకూరు […]
Advertisement
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమానికి రంగారెడ్డి చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రాంగణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శ్రీకారం చుట్టారు. అంతకుముందు ఆయన చిలుకూరు బాలాజీని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అందరికీ ఆకుపచ్చని వందనాలు అంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఓ పథకానికి గుడి, బడి నాంది పలికితే అది ఖచ్చితంగా విజయవంతమవుతుందని కేసీఆర్ చెబుతూ…హరితహారం పథకం అమలుకు ప్రతి విద్యార్థిని ఒక హరిత సైనికుడిగా మార్చాలని ఉపాధ్యాయులకు పిలుపు ఇచ్చారు. చిలుకూరు బాలాజీ దర్శనానికి వచ్చే భక్తులకు ప్రసాదంతోపాటు ఓ మొక్కను వారి చేతిలో పెట్టి నాటేందుకు ప్రోత్సహించాలని కేసీఆర్ ఆ ఆలయం అర్చకులకు పిలుపు ఇచ్చారు. వనాలు అంతరించి పోతున్నాయని, వానలు కరవై పోతున్నాయని ప్రతి మనిషి నాలుగు చెట్లు నాటి, వాటిని చక్కగా సాకాలని కేసీఆర్ పిలుపు ఇచ్చారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చేతులారా మన సంపదను మనమే నాశనం చేసుకుంటున్నామని, చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో హరిత హారం ప్రారంభించామని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపు ఇచ్చారు.
వికారాబాద్ గాలిలో, గండిపేట నీటిలో ఔషధ విలువలున్న శక్తి దాగి ఉందని, ఇక్కడ మొక్కలు నాటితే హరితం హరివిల్లులా పరిఢవిల్లుతుందని కేసీఆర్ అన్నారు. హరితహారమంటే తెలంగాణకు ఆకుపచ్చని దండని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటాలన్నది లక్ష్యంగా నిర్దేశించామని, ప్రతి గ్రామం యేడాదికి 40 వేల మొక్కలు నాటాలని ఆయన ప్రజలకు హితవు చెప్పారు. ఇది ప్రభుత్వ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల కార్యక్రమం కాదని, ఇందులో ప్రజలంతా భాగస్వాములైతేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాదని ఎంతోమంది అన్నారు… వచ్చిందా… రాలేదా… అని ప్రశ్నిస్తూ ఒక లక్ష్యంతో కృషి చేస్తే సాధించలేనిది ఏదో ఉండదని కేసీఆర్ చెప్పారు. ఊరును, మనల్ని మనం కాపాడుకోవాలంటే మొక్కలు నాటి పచ్చదనం పెంచుకోవడం తప్ప మరో మార్గం లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం రకరకాల మొక్కలు అటవీ శాఖ వద్ద ఉన్నాయని, వాటిని తీసుకుని నాటుకోవాలని సూచించారు.
కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ఆషామాషీగా చూడకుండా ఇది మన బతుకు కోసం చేసే పనిగా భావించి అంకిత భావంతో పని చేస్తూ అందరినీ భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. తెలంగాణ అంటే చరిత్రకు మారుపేరుగా నిలవాలని, ఈ లక్ష్యంతోనే వికలాంగులకు రూ. 1500 పింఛను ఇచ్చే రాష్ట్రంగా, వసతి గృహాల్లో సన్నబియ్యంతో అన్నం పెట్టే రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకున్నామని, భారతదేశంలో తెలంగాణ తప్ప మరెక్కడా ఇలాంటి పథకాలు అమలు చేసే రాష్ట్రం లేదని ఆయన అన్నారు. రెండు సంవత్సరాల తర్వాత నూరు శాతం కరెంట్ ఇచ్చే రాష్ట్రంగా మనం తయారవుతామని ఆయన చెప్పారు.
తెలంగాణలోని అడవులను 25 శాతం నుంచి 33 శాతానికి పెంచేలా కృషి చేయాలని ఆయన పిలుపునిస్తున్నారు. వచ్చే నాలుగేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని నిర్దేశించారు. తొలి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు ‘హరితం…సతతం…జీవం’, ‘హరితం…శివం…సుందరం’ వంటి నినాదాలను రూపొందించారు. మొక్కల సరఫరాకు లోటు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4213 నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నామని, తొలి యేడాదికి కావలసిన మొక్కలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అటవీశాఖ మంత్రి జోగు రామన్న జిల్లాల వారిగా పర్యటిస్తూ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని, మరోవైపు తాను కూడా హరితహారం కోసం ఈ నెల 3 నుంచి 6 వరకు వివిధ జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహిస్తానని కేసీఆర్ తెలిపారు. అయితే ఇది తమకు మాత్రమే చెందిన కార్యక్రమంగా భావించకుండా అందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపు ఇచ్చారు. అంతకుముందు ఖమ్మం జిల్లాలకు చెందిన రచయిత జయరాజ్ రాసిన హరితహారం గీతాల సీడీలను, వరంగల్ జిల్లాకు చెందిన రచయిత షాదబ్ రాసిన ఉర్దూ గీతాల సీడీలను కేసీఆర్ ఆవిష్కరించారు. రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగు రామన్న, శాసనమండలి అధ్యక్షుడు స్వామిగౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్టొన్నారు.
Advertisement