షారుఖ్ అయినా... ఆమెకంటే అందగాడు కాదు!
మీరూ ఈ విషయం గమనించే ఉంటారు…అందమైన చిత్రాలుగా కళాభిమానులను ఆకట్టుకున్న చిత్రాల్లో ఎక్కువ భాగం ప్రకృతి, లేదా స్త్రీ ప్రధానాంశంగా ఉంటుంది. ఎంత అందమైన మగవాడి చిత్రాన్ని గీసినా దాన్నిఅందమైన చిత్రంగా చెప్పలేమేమో. కెన్యా చిత్రకారిణి హెలెన్ ఒమామో గొమాజ్ అదే అంటున్నారు. ఈమె చిత్రాలన్నీ అందంగా, ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఆమె చిత్రాల్లోని ఏకైక కాన్సెప్టు అదే. విచిత్రం ఏమిటంటే ఏడుపుగొట్టు మొహాలు అంటూ…సోకాల్డ్ మగానుభావులచేత అనిపించుకునే మహిళ మాత్రమే ఆనందాన్ని ప్రతిబింబించగలదని హెలెన్ చెబుతున్నారు. […]
మీరూ ఈ విషయం గమనించే ఉంటారు…అందమైన చిత్రాలుగా కళాభిమానులను ఆకట్టుకున్న చిత్రాల్లో ఎక్కువ భాగం ప్రకృతి, లేదా స్త్రీ ప్రధానాంశంగా ఉంటుంది. ఎంత అందమైన మగవాడి చిత్రాన్ని గీసినా దాన్నిఅందమైన చిత్రంగా చెప్పలేమేమో. కెన్యా చిత్రకారిణి హెలెన్ ఒమామో గొమాజ్ అదే అంటున్నారు. ఈమె చిత్రాలన్నీ అందంగా, ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఆమె చిత్రాల్లోని ఏకైక కాన్సెప్టు అదే. విచిత్రం ఏమిటంటే ఏడుపుగొట్టు మొహాలు అంటూ…సోకాల్డ్ మగానుభావులచేత అనిపించుకునే మహిళ మాత్రమే ఆనందాన్ని ప్రతిబింబించగలదని హెలెన్ చెబుతున్నారు. చెట్ల కింద ధ్యానం చేసుకునే అమ్మాయిలు, పాపాయిని లాలించే తల్లి, ఆనందహేల అనిపించేలా నృత్యం చేసే స్త్రీలు వీరికంటే అందమైన రూపాలు చిత్రకళకు దొరకవని ఈ కెన్యా చిత్రకారిణి ఘంటాపథంగా చెబుతున్నారు. మహిళ దినచర్యలోనే అలాంటి మధుర ఘట్టాలు చాలా ఉంటాయనేది ఆమె నిశ్చితాభిప్రాయం. తాను ఎప్పటికీ ఓ మగవాడి చిత్రాన్ని గీయలేనని, అతనెంత అందంగా ఉన్నా, చివరికి షారుఖ్ ఖాన్ అయినా సరే…అంటూ నవ్వేస్తున్నారు హెలెన్. కొయింబత్తూర్ నివాసి అయిన హెలెన్, కస్తూరీ శ్రీనివాసన్ ఆర్ట్ గ్యాలరీలో తన చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. సింపుల్‌గా ఉండే సాధారణ మనుషులంటే నాకు చాలా ఇష్టం నా చిత్రాలు కూడా సింపుల్‌గానే ఉంటాయి. వాటిని చూసి విశ్లేషణలు చేయమని చెప్పను. ఇంట్లో తగిలించుకుని చూసి ఆనందించండి చాలు అంటారామె.
హెలెన్ చిత్రాలన్నీ ఎరుపు, ఆకుపచ్చ, ఆరంజ్ రంగుల్లో చాలా కాంతి వంతంగా ఉంటాయి. కాలేజిలో టూరిజం సబ్జక్టుని చదువుకుని జర్మనీలో కెన్యా కాన్‌సుల్ జనరల్ ఆఫీస్‌లో పదేళ్లపాటు పనిచేశారు. తరువాత తన పిల్లలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. పిల్లలు యూనివర్శిటీ స్థాయికి వచ్చాక చిన్నప్పుడు తాను అమితంగా ప్రేమించిన కుంచెను తిరిగి చేత పట్టుకున్నారు. స్నేహితుల సహకారంతో యూరప్‌లో ప్రదర్శనలు నిర్వహించారు. జర్మనీ సంబంధిత కంపెనీ కొయింబత్తూరులో ఉంది. దాని ఉద్యోగి అయిన భర్తతో పాటు హెలెన్ 2009లో ఇండియా వచ్చారు. ఇక్కడ చిత్రకళతో సరిపెట్టుకోలేదు. వృద్ధాశ్రమాల్లో ఉన్న పెద్దవాళ్లకు, అనాథ పిల్లలకు ఆర్ట్ నేర్పుతున్నారు. ఒక వృద్ధాశ్రమంలో అక్కడున్న వారందరిచేత చిత్రాలు గీయించిన సందర్భాన్ని తాను మరచిపోలేనంటారు హెలెన్. నడవడం రాని మహిళలు సైతం చిత్రాలు గీశారని, ఒక మహిళ ఎప్పటినుండో దాచుకున్న బంగారు ఆభరణాలను ఆనందంతో తన చేత బెట్టినపుడు, కారు దగ్గరకు వెళ్లి ఏడ్చేశానని హెలెన్ గుర్తు చేసుకున్నారు.
అలాగే సిఎమ్ఎస్ పిల్లల హోం పిల్లలకు సైతం ఆమె ఆంటీగా ఎంతో దగ్గరయ్యారు. ప్రస్తుతం పిల్లలకోసం ఒక లైబ్రరీని నిర్మించే ఉద్దేశంతో ఉన్నారు హెలెన్. చివరగా ఒక్కమాట….స్త్రీ ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. ఏడుపు, నవ్వు అనేవి మనిషికి సహజ ధర్మాలు. అందుకే అవి మహిళలో ఎక్కువగా కనబడతాయి. మహిళ ఏడుపుకి ఉన్న గుర్తింపు ఆమె నవ్వుకి లేదు. అత్యంత ఆనందంగా, సహజంగా, స్వచ్ఛమైన మనిషిలా మగువ మాత్రమే నవ్వగలదు…అదీ ఎలాంటి బాధల్లో ఉన్నా…..అందుకే హెలెన్ ఆనందానికి ప్రతీకగా స్త్రీనే ఎంపిక చేసుకున్నారు.