ఆమరణదీక్ష దిశగా కేసీఆర్.. ?
ఉమ్మడి రాజధానిలో గవర్నర్ నిర్ణయమే అంతిమం అని దాన్ని ప్రశ్నించడానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అభిప్రాయపడుతున్నారు. మొన్నటి ఆయన ప్రకటన మౌఖికంగానే ఇచ్చినట్టు చెప్పినప్పటికీ ఇపుడు నేరుగా గవర్నర్‌కు ఆయన లేఖ రాసినట్టు తెలిసింది. ఉమ్మడి రాజధానిలో తన పరిధి ఏమిటో, తన పాత్ర ఏ మేరకు ఉండాలో తెలియజేయాలని గవర్నర్ నరసింహన్ రాసిన లేఖకు ప్రతిస్పందనగానే రోహత్గీ ఈ లేఖ రాసినట్టు తెలిపారు. ఒక నిర్ణయం […]
Advertisement
ఉమ్మడి రాజధానిలో గవర్నర్ నిర్ణయమే అంతిమం అని దాన్ని ప్రశ్నించడానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అభిప్రాయపడుతున్నారు. మొన్నటి ఆయన ప్రకటన మౌఖికంగానే ఇచ్చినట్టు చెప్పినప్పటికీ ఇపుడు నేరుగా గవర్నర్‌కు ఆయన లేఖ రాసినట్టు తెలిసింది. ఉమ్మడి రాజధానిలో తన పరిధి ఏమిటో, తన పాత్ర ఏ మేరకు ఉండాలో తెలియజేయాలని గవర్నర్ నరసింహన్ రాసిన లేఖకు ప్రతిస్పందనగానే రోహత్గీ ఈ లేఖ రాసినట్టు తెలిపారు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రికైనా స్పందన తెలియజేయడానికి మూడు రోజుల వ్యవధి ఇవ్వవచ్చని ఆయన పేర్కొన్నారు. నిర్ణయాన్ని అమలు చేయడానికి, నోటిఫికేషన్ జారీ చేయడానికి పూర్తి అధికారం గవర్నర్‌కే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే గవర్నర్ ఇచ్చే ఆదేశాలు తన కార్యాలయం ద్వారాగాని, తన సలహాదారుల ద్వారా గాని తయారు చేయించాలని కూడా ఆ లేఖలో ఏ.జీ. స్పష్టం చేశారని తెలిసింది. తాను తీసుకున్న నిర్ణయాన్ని తిరగదోడడానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఉండదని, వారిని జోక్యం చేసుకోవద్దని ఆదేశించవచ్చని రోహత్గీ తెలిపారు. కేసుల్ని, అంశాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు.
సెక్షన్ 8కి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసేందుకు గవర్నర్ సిద్ధమైన తర్వాతే రోహత్గీ అభిప్రాయం కోరారన్నది ఇపుడు సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. సెక్షన్ 8 అమలుపై గవర్నర్‌కు ఖచ్చితమైన అభిప్రాయం లేకపోతే ఏజీ అభిప్రాయం కోరి ఉండేవారు కాదని అంటున్నారు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సామరస్య వాతావరణం ఉండి ఉంటే గవర్నర్‌కి అసలు ఈ ఆలోచనే వచ్చేది కాదని, ఇపుడు పరిస్థితులు జటిలంగా మారడంతో తన పాత్ర ఎలా ఉండాలో తెలుసుకునేందుకే గవర్నర్ అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కోరారని అంటున్నారు. నోటిఫికేషన్ ముసాయిదాను కూడా ఏజీ కార్యాలయమే రూపొందించాలని కూడా గవర్నర్ ఆకాంక్షిస్తున్నట్టు చెబుతున్నారు. నోటిఫికేషన్ ఎలా ఉండాలి, ఏయే అంశాలు పొందుపరచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలన్నీ అటార్నీ జనరల్ వివరించడం విశేషం. ‘రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం’ అని లేఖలో స్పష్టంగా తెలపడం అంటే గవర్నర్ లేఖకు ప్రతిస్పందనగా రాసిన లేఖ కాబట్టే ఈ ప్రస్తావన తెచ్చారని అంటున్నారు.
ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌కు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ రాసిన ఈ లేఖతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్‌లో గవర్నర్‌కు ‘ప్రత్యేక బాధ్యతలు’ మాత్రమే కాదు… విశేష అధికారాలూ ఉంటాయనేలా రోహత్గీ అభిప్రాయపడడం, ‘సకలం, సర్వం గవర్నరే’ అని తేల్చి చెప్పడం తెలంగాణ ప్రభుత్వానికి ఆగ్రహం కలిగిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో మంగళవారం తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్‌ను కలిశారు. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేస్తే… ఢిల్లీ స్థాయిలో పోరాటం తప్పదని హెచ్చరించారు. స్వయంగా తానే ఆమరణ దీక్ష చేస్తానని కేసీఆర్ హెచ్చరించినట్లు తెలిసింది. తెలంగాణ మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులూ ఇదే స్థాయిలో స్పందించారు. మరోవైపు… సెక్షన్ 8 అమలు చేసి తీరాల్సిందేనని ఏపీ మంత్రులు తేల్చి చెప్పారు. ఉమ్మడి రాజధానిపై ఏకపక్ష పెత్తనాన్ని సహించబోమని వారు హెచ్చరించారు. ఈ సెక్షన్ చెల్లదంటే, రాష్ట్ర విభజన చట్టం కూడా చెల్లదని వారంటున్నారు. ఇలా ఎవరి వాదన వారు చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ ఎలా స్పందిస్తారన్న అంశమే ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
Advertisement