స్టూడియో భూములపై కేసీఆర్ వైఖరి ఎందుకు మారింది ?
సినీ స్టూడియోల భూముల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి ఒక్కసారిగా మారిపోయింది. స్టూడియోలకు ఇచ్చిన ప్రభుత్వ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకోవడాన్ని అనుమతిస్తామని కేసీఆర్ ప్రకటించగానే అంతా ఆశ్చర్యపోయారు. ఆయన ఇటీవల బస్తి సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా ఈ వరాన్ని ఇచ్చేశారు. త్వరలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో ఓ సమావేశం ఏర్పాటు చేసి అన్నిసమస్యలపై కూలంకషంగా చర్చిద్దామని కేసీఆర్ అన్నారు. అంతేకాదు సినీ స్టూడియోలకు ఇంకా భూములు అవసరమైతే నగర శివారుల్లో ఎక్కడైనా […]
Advertisement
సినీ స్టూడియోల భూముల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి ఒక్కసారిగా మారిపోయింది. స్టూడియోలకు ఇచ్చిన ప్రభుత్వ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకోవడాన్ని అనుమతిస్తామని కేసీఆర్ ప్రకటించగానే అంతా ఆశ్చర్యపోయారు. ఆయన ఇటీవల బస్తి సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా ఈ వరాన్ని ఇచ్చేశారు. త్వరలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో ఓ సమావేశం ఏర్పాటు చేసి అన్నిసమస్యలపై కూలంకషంగా చర్చిద్దామని కేసీఆర్ అన్నారు. అంతేకాదు సినీ స్టూడియోలకు ఇంకా భూములు అవసరమైతే నగర శివారుల్లో ఎక్కడైనా సరే అదనంగా భూములివ్వడానికి కూడా సిద్దమేనని ఆయన ప్రకటించారు. టీఆర్ ఎస్ గతంలో అనుసరించిన వైఖరికి ఇది పూర్తి విరుద్ధం. సినీ స్టూడియోలకిచ్చిన భూములను ఇతర అవసరాలకు వినియోగిస్తే వాటిని ప్రభుత్వం వెనక్కి లాక్కోవాలని ఉద్యమం సందర్భంగా టీఆర్ ఎస్ నేతలు డిమాండ్ చేసేవారు. హరీష్‌రావు ఏకంగా హీరో కృష్ణకు సంబంధించిన పద్మాలయా స్టూడియోపై హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ప్రభుత్వం కేటాయించిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రయివేటు సంస్థకు అమ్మేశారని ఆయన కేసు పెట్టారు. పద్మాలయా స్టూడియోతో పాటు మరో హీరో నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియో భూములను వెనక్కి తీసుకోవాలని హరీష్‌రావు, కేటీఆర్‌లు నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరచూ డిమాండ్ చేసేవారు. ఇపుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో కృష్ణ, నాగార్జునలకే కాక రాఘవేంద్రరావు కూడా మేలు జరగనున్నది. అన్నపూర్ణ స్టూడియోని ఎంటర్‌టెయిన్‌మెంట్ థీమ్ పార్కుగా డెవలప్ చేయాలని నాగార్జున తలపోస్తున్నారు. రాఘవేంద్రరావు బంజారాహిల్స్‌లో తనకు రికార్డింగ్ రీరికార్డింగ్ థియేటర్ కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిలో సినీమ్యాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించారు. దానిపైన కూడా చాలా కాలం వివాదం నడిచింది. కృష్ణ తన స్టూడియో భూమిలో కొంత భాగాన్ని తాను బకాయి ఉన్న ఓ ప్రయివేట్ ఛానెల్ వారికి ఇచ్చేశారు. ఇకపై ఈ వివాదాలన్నీ సద్దుమణిగిపోనున్నాయి. ఇంతకీ కేసీఆర్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? సినిమా పరిశ్రమ పెద్దలతో సఖ్యతగా ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారా..? లేక రాష్ట్ర విభజన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కి తరలిపోకుండా ఆపేందుకు ప్రయత్నిస్తున్నారా అని అంతా చర్చించుకుంటున్నారు. పరిశ్రమ తరలిపోకుండా ఉండడం కోసం ఇప్పటికే అనేక రాయితీలను ప్రభుత్వం ఇస్తోంది. ఆ రాయితీలను పెంచవచ్చు. అంతేకానీ నిబంధనలకు విరుద్ధంగా భూములు వినియోగించుకోవడాన్ని, అమ్మేసుకోవడాన్ని ఎలా అనుమతిస్తారు? ఇదే కాదు చౌకగా కొట్టేసిన భూములతో పాటు ఊళ్లకు ఊళ్లను ఆక్రమించి నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానన్న కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ ఊసే ఎత్తకపోవడంపై తెలంగాణవాదులు ఆగ్రహంతో ఉన్నారు. పైగా కేసీఆర్ మందీమార్బలంతో వెళ్లి రామోజీరావు విందు స్వీకరించి రావడం తెలంగాణా వాదులకు పుండు మీద కారం చల్లినట్లయింది.
Advertisement