ఆంధ్ర పరోక్ష పెత్తనం సహించం: గవర్నర్‌తో కేసీఆర్
హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ నాయకుల పరోక్ష పెత్తనాన్ని సహించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తేల్చి చెప్పారు. విభజన చట్టం ప్రకారం సెక్షన్ 8 అమలు చేసే బాధ్యత రాజ్యాంగం కట్టబెట్టిందని, దాన్ని ఉపయోగించి ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను, ఇతర పరిస్థితుల్ని చక్కదిద్దే బాధ్యత గవర్నర్ తీసుకోవచ్చని భారత అటార్నీ జనరల్ ఏ.జి. ముకుల్ రోహత్గీ చేసిన సూచనల నేపథ్యంలో మంగళవారం కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి తన మనోగతాన్ని తెలిపారు. యేడాది కాలంలో ఒక్కసారి […]
Advertisement
హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ నాయకుల పరోక్ష పెత్తనాన్ని సహించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తేల్చి చెప్పారు. విభజన చట్టం ప్రకారం సెక్షన్ 8 అమలు చేసే బాధ్యత రాజ్యాంగం కట్టబెట్టిందని, దాన్ని ఉపయోగించి ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను, ఇతర పరిస్థితుల్ని చక్కదిద్దే బాధ్యత గవర్నర్ తీసుకోవచ్చని భారత అటార్నీ జనరల్ ఏ.జి. ముకుల్ రోహత్గీ చేసిన సూచనల నేపథ్యంలో మంగళవారం కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి తన మనోగతాన్ని తెలిపారు. యేడాది కాలంలో ఒక్కసారి కూడా ఎక్కడా ఆంధ్రవాళ్ళను ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవని, శాంతిభద్రతలకు ఎక్కడా విఘాతం కలగలేదని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో అన్ని రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఈ పరిస్థితుల్లో గవర్నర్ అధికారాలను ప్రయోగించాలని చూడడం సరికాదని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సెక్షన్ 8ని అమలు చేయవద్దని, హైదరాబాధ్‌లో శాంతిభద్రతల పరిస్థితిని తమ ప్రభుత్వమే చూసుకుంటుందని కేసీఆర్ అన్నారు.
సెక్షన్ 8పై నిరసన వెల్లువ
హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలన్న ఆలోచనను తెలంగాణలోని టీఆర్ఎస్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ, ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఒక అప్రజాస్వామిక పద్దతిలో సెక్షన్ 8ని అమలు చేసి తెలంగాణ ప్రజల హక్కుల్ని కాలరాయాలని ఆంద్ర నాయకులు ప్రయత్నిస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీ ప్రసాద్ ఆరోపించారు. చంద్రబాబునాయుడి ప్రయత్నాలకు గవర్నర్ తలొగ్గితే తెలంగాణలో మరో ఉద్యమం వస్తుందని, అవసరమైతే ఢిల్లీని ముట్టడిస్తామని దేవీప్రసాద్ అన్నారు. అవసరమైతే బంద్‌కు పిలుపు ఇవ్వాలని ఆయన అన్నారు. సెక్షన్ 8 అమలు చేస్తే న్యాయ పోరాటం చేస్తామని టీఆర్ఎస్ నాయకుడు కర్నె ప్రభాకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సెక్షన్ 8 వల్ల ఏదో అధికారం లభిస్తుందనుకుంటే పోరపాటేనని కాంగ్రెస్ నాయకుడు కోదండరెడ్డి అన్నారు. కేవలం కొంత పరిధిని విస్తరించడానికి మాత్రమే ఇది పని చేస్తుందని, శాంతిభద్రతలకు అవరోధం కలగనప్పుడు దీని అవసరం ఏమీ ఉండదని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు, సెక్షన్ 8కి సంబంధం లేదని, ఒకవేళ అలాంటిది జరిగితే ఫిర్యాదు చేయడానికి అనేక వేదికలున్నాయని, అంతేకాని హైదరాబాద్ మీద పెత్తనం కోరడం సరికాదని అన్నారు. ఓటుకు నోటు కేసును నీరు గార్చేందుకు చంద్రబాబునాయుడు సెక్షన్ 8ని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ నాయకుడు జీవన్‌రెడ్డి ఆరోపించారు.
చంద్రబాబుకు భయపడేది లేదు: తలసాని
సెక్షన్-8 పేరుతో చంద్రబాబు చేస్తున్న తాటాకు చప్పుళ్లకు భయపడమని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలయ్యే పరిస్థితే లేదని స్ఫష్టం చేశారు. గవర్నర్‌కు విలువ ఇవ్వని వారు సెక్షన్-8 గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో నుంచి తప్పించుకోవడానికే సెక్షన్ -8 అంటూ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఆయన ఎత్తులు ఇకపై సాగవన్నారు. కేసు నుంచి బయటపడేందుకు ఇదంతా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Advertisement