ఆమె జీవితం ఓ సరికొత్త కథ!
అరవై నాలుగు కళల్లో కథలు చెప్పడం అనే కళ ఉందో లేదో మనకు తెలియదు కానీ గీతా రామానుజం గురించి తెలుసుకుంటే మాత్రం కథలు చెప్పడం అనేది తప్పకుండా కళే అనే విషయాన్ని మాత్రం ఒప్పుకుని తీరతాం. కొంతకాలం క్రితం గీత బెంగళూరులో ఓ స్కూల్లో టీచరుగా పనిచేస్తుండేవారు. అక్కడ ఆమె సబ్జక్టు సోషల్. పిల్లలకు నిద్ర తెప్పించే చరిత్ర పాఠాలను గీత కథలుగా మలచి ఆసక్తికరంగా చెప్పడం మొదలుపెట్టారు. పిల్లలకు గీత హిస్టరీ కథలు బాగా […]
అరవై నాలుగు కళల్లో కథలు చెప్పడం అనే కళ ఉందో లేదో మనకు తెలియదు కానీ గీతా రామానుజం గురించి తెలుసుకుంటే మాత్రం కథలు చెప్పడం అనేది తప్పకుండా కళే అనే విషయాన్ని మాత్రం ఒప్పుకుని తీరతాం. కొంతకాలం క్రితం గీత బెంగళూరులో ఓ స్కూల్లో టీచరుగా పనిచేస్తుండేవారు. అక్కడ ఆమె సబ్జక్టు సోషల్. పిల్లలకు నిద్ర తెప్పించే చరిత్ర పాఠాలను గీత కథలుగా మలచి ఆసక్తికరంగా చెప్పడం మొదలుపెట్టారు. పిల్లలకు గీత హిస్టరీ కథలు బాగా నచ్చేశాయి. దాంతో స్కూలు యాజమాన్యం ఆమెకు లైబ్రరీని అప్పగించి కథలు చెప్పడాన్నే ప్రధాన బాధ్యతగా చేశారు. స్కూల్లో గీతా రామానుజం స్టోరీ టెల్లింగ్ క్లాసులను ప్రారంభించారు. లైబ్రరీలో ఉన్న పలురకాల పుస్తకాల పట్ల పిల్లల్లో ఆసక్తిని, చదివే అభిరుచిని పెంచారు.
ఇదిలా ఉండగా 1996లో, గీత కథలు చెప్పడం విన్న ఒక విద్యార్థి తండ్రి ఆమెను స్టోరీ టెల్లింగ్ మీద ఒక వర్క్ షాప్ నిర్వహించాల్సిందిగా ఆహ్వానించారు. అది బాగా క్లిక్ అయ్యింది. దాంతో ఇందులో ఏదైనా సరికొత్త ప్రయత్నం చేయాలని గీతా రామానుజం గట్టిగా అనుకున్నారు. అలా 1998లో స్కూలు జాబ్‌ని వదిలేసి మరో ఇద్దరు టీచర్లతో కలిసి కథాలయా ట్రస్ట్ ని స్థాపించారు. కథలు చెప్పడాన్ని ఒక ప్రభావవంతమైన సాంస్కృతిక కళారూపంగా తీర్చిదిద్దాలని ఆశించారు. అలా దేశంలోనే మొదటిసారిగా చంబక్కరలో ఉన్న ఒక ప్రీ స్కూల్లో కథాలయా సెంటర్ ని ప్రారంభించారు. కథలు చెప్పడాన్ని గీతా రామానుజం చిన్న విషయంగా భావించడం లేదు. మాట్లాడడం, వినడం ఈ రెండూ కలిసిన ఒక కమ్యునికేషన్ ప్రాసెస్‌గా కథలు చెప్పడాన్ని ఆమె అభివర్ణిస్తున్నారు.
కథల ద్వారా మనుషుల్లోని భావోద్వేగాలకు, ఊహా శక్తికి ఒక రూపమివ్వడం సాధ్యమవుతుందని, భావోద్వేగపరమైన, మేధోపరమైన తెలివితేటలు, శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయని ఆమె చెబుతున్నారు. అందుకే కథాలయ కార్యక్రమాలను విస్తృతం చేశారు. టీచర్లు, తల్లిదండ్రులు, ఎన్‌జిఓలు, కళాకారులు, కార్పొరేట్లు చివరికి గిరిజనులకు సైతం కథలు చెప్పడంలో వర్క్ షాపులను నిర్వహిస్తున్నారు. టీచర్లకు, కథలు చెప్పడాన్ని వృత్తిగా స్వీకరించదలచుకున్న వారికి డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులను అందిస్తున్నారు. కథాలయా వేదికగా ఆమె మరో కృషి సైతం చేస్తున్నారు. బుర్రల్లో సమాచారాన్ని నింపే చదువు బదులుగా విజ్ఞానాన్ని అందించే చదువుని పిల్లలకు చేరువ కావాలని, తదనుగుణంగా పిల్లలు తమకు ఆసక్తి ఉన్న ఏ అంశంలోనైనా చదువుకుని, ఉపాధిని పొందే అవకాశాలు ఉండాలని, ఆ దిశగా విద్యా విధానాన్ని సవరించాలని ఆమె ఆశిస్తున్నారు.
ఆ విధానంలో కథాలయలో సరికొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. స్కూలు సిలబస్ లో కథలను భాగం చేయడంతో పాటు, ఇందులో ఒక యూనివర్శిటీని స్థాపించే స్థాయి వరకు దీంట్లో కృషి చేయాలనుకుంటున్నారు. భారతీయ జానపద పురాణ కథలతో పాటు, ఇతర దేశాల కథలు, తాను సొంతంగా సృష్టించిన కథలెన్నో గీతా రామానుజం కథాలయలో ఉన్నాయి. కథలు మనుషులను భావోద్వేగాల పరంగా కలుపుతాయని గీత అంటున్నారు. కాబోయే తల్లులు, పిల్లల ఆసుపత్రుల్లో నర్సులు గీత కథాభిమానుల్లో ఉన్నారు. సరికొత్త అభిరుచితో తన జీవన కథలో కథను ప్రధాన భాగం చేసుకున్నారు గీత. ఆమె ఆశయాలన్నీ నేరవేరాలని ఆశిద్దాం.