ఒంటరి తల్లికి “తోడు” కాలేమా!
చాలా స్పష్టంగా రాజ్యాంగం రాసుకుని, చట్టాలు చేసుకుని పద్ధతిగా బతికేస్తున్నాం అనుకుంటాం కానీ, ఇప్పటికీ చాలా విషయాలు మనల్ని అయోమయంలో పడేస్తుంటాయి. ఏవో ఒక కారణాలతో తల్లి దండ్రులు విడిపోతే ఆ చిన్నారులు జీవితంలో ఎన్నో కోల్పోయినట్టే. అది చాలదన్నట్టుగా సమాజం వారికి చెందాల్సిన హక్కులను, ప్రయోజనాలను సైతం తొక్కి పెడితే…సింగిల్ మదర్స్ గా తమ పిల్లలను పెంచుకుంటున్న తల్లులు వ్యక్తిగత ఒత్తిళ్లతో పాటు ఇలాంటి సమస్యలను సైతం ఎదుర్కొంటున్నారు. ఓ ప్రముఖ కిండర్ గార్టెన్ స్కూల్లో తమ పిల్లలను చేర్చడానికి వెళ్లిన ముగ్గురు ఒంటరి తల్లులకు […]
చాలా స్పష్టంగా రాజ్యాంగం రాసుకుని, చట్టాలు చేసుకుని పద్ధతిగా బతికేస్తున్నాం అనుకుంటాం కానీ, ఇప్పటికీ చాలా విషయాలు మనల్ని అయోమయంలో పడేస్తుంటాయి. ఏవో ఒక కారణాలతో తల్లి దండ్రులు విడిపోతే ఆ చిన్నారులు జీవితంలో ఎన్నో కోల్పోయినట్టే. అది చాలదన్నట్టుగా సమాజం వారికి చెందాల్సిన హక్కులను, ప్రయోజనాలను సైతం తొక్కి పెడితే…సింగిల్ మదర్స్ గా తమ పిల్లలను పెంచుకుంటున్న తల్లులు వ్యక్తిగత ఒత్తిళ్లతో పాటు ఇలాంటి సమస్యలను సైతం ఎదుర్కొంటున్నారు. ఓ ప్రముఖ కిండర్ గార్టెన్ స్కూల్లో తమ పిల్లలను చేర్చడానికి వెళ్లిన ముగ్గురు ఒంటరి తల్లులకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. తండ్రి ఇన్‌కమ్ సర్టిపికేట్ సబ్మిట్ చేయకపోవడం వలన వారి పిల్లలకు సీట్లు ఇచ్చేందుకు స్కూలు యాజమాన్యం తిరస్కరించింది. ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్న ఓ రచయిత్రి ఈ విషయాలను బయటకు వెల్లడించారు. తమ సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పినా యాజమాన్యం అంగీకరించలేదు.
ఒంటరి తల్లులుగా బతకడం అనే నిర్ణయం వారు కావాలని తీసుకున్నది కాదు. అది వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయం. ఏ శారీరక మానసిక హింసో, ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టాల్సిన పరిస్థితులో వారిని అలా ఒంటరులను చేసినపుడు, ఆ పిల్లలకు సాధారణ పిల్ల్లల్లా అన్ని హక్కులూ ఉండవా అనేది ఈ తల్లుల ప్రశ్న. తమ బతుకు తాము బతుకుతున్నా రకరకాల అవమానాలు, తిరస్కారాలు, అపరాధ భావాలు, తమపై తమకే నమ్మకం పోయే సంఘటనలు ….ఇవన్నీ ఎందుకు భరించాలి అని వీరు ఆవేదన చెందుతున్నారు. నాగరికత అంటే జీవితాన్ని మరింత చిక్కుల మయం చేసుకోవడం కాదు…చిక్కుముళ్ల ను విప్పుకుంటూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో బతకడం…ఈ విషయాన్ని సోకాల్డ్ మేధావులు ఎందుకు గుర్తించరో అర్థం కాదు. ముఖ్యంగా మహిళల జీవన్మరణ సమస్యలు ఏవైనా సమాజానికి అవి చిన్నగానే కనబడుతుంటాయి. అదొక విచిత్రం. ఈ పరిస్థితులు దీర్ఘకాలంలో తమ శారీరక మానసిక ఆరోగ్యాలను దిగజారిస్తే ఎవరిదిబాధ్యత అని ఈ తల్లులు నిలదీస్తున్నారు.
ఒంటరి తల్లిగా పరిస్థితులను ఎదుర్కోవడం మామూలు విషయం కాదు అంటున్నారు ముంబయికి చెందిన ఓ మహిళ. భర్త నుండి విడిపోయి ఇద్దరు ఆడపిల్లలతో కొత్త జీవితం మొదలు పెట్టినపుడు తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయిందని, ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తన ప్రథమ కర్తవ్యమని అర్థమైందని ఆమె చెబుతున్నారు. జీవతంలో ఒత్తిడి శరీరంలో నొప్పులుగా బయటపడి మరింత బాధపెట్టిందని, తన జీవితం ఇలా అయిపోయినందుకు తన తండ్రి ఏడవడం అనేది తనని మరింత బాధకు గురిచేసిందని ఆ ఒంటరి తల్లి చెబుతున్నారు. కొన్ని ఏళ్లపాటు కలిసి ఉన్న వ్యక్తితో అనుబంధాన్ని తెంచుకుని ప్రపంచంలో ఒంటరిగా మిగలడమూ భరించలేని వేదనే అంటున్నారామె. ఒకబిడ్డకు తల్లయి, మరో బిడ్డ కడుపులో ఉండగా భర్తకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది మరొక మహిళకు. ఆమె తిరిగి కోలుకునేందుకు పదేళ్లు పైనే పట్టింది. పిల్లలతో కలిసి ఉండే ఉద్యోగం కోసం ఆమె అప్పుడు సైకాలజి చదివారు. మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ చేసి సైకో థెరపిస్ట్ గా స్థిరపడ్డారు. ఒంటరి తల్లిగా తిరిగి తన జీవితాన్ని స్థిర పరచుకోవడం కోసం ఎంతో శ్రమించారు. మరింత ఎక్కువ పోరాటం చేశారు. గత ఇరవైమూడేళ్ల కాలంలో తాను ఓ పది సార్లు మాత్రమే ఫంక్షన్ల వంటివాటికి హాజరయ్యానని ఈ తల్లి చెబుతున్నారు. సింగిల్ మదర్‌గా ఉన్నవారికి బయట సమస్యలే కాదు, నిద్రలేమి, డిప్రెషన్, మధుమేహం, రక్తపోటు, గుండె సమస్యలు లాంటి ఆరోగ్య సమస్యలు ఎప్పుడూ పొంచి ఉంటాయని, తాను క్రమబద్ధమైన వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నానంటున్నారు. ఇన్ని సమస్యలకు ఓర్చుకుని పిల్లలను పెంచే తల్లులకు సమాజం నుండి అందాల్సినది సహకారమా, తిరస్కారమా…ఇది అందరూ వేసుకోవాల్సిన ప్రశ్న.