తప్పు చేయకపోయినా...అపరాధభావం !
ప్రపంచంలో మనకు నచ్చని విషయాలు చాలా ఉంటాయి. అయితే ఎప్పుడూ ఎవరో ఒకరికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి రావడం అనేది మనం భరించలేని విషయాల్లో ఒకటి. ఎప్పుడూ, ఏదో తప్పుచేసిన భావనతో ఎవరు మనల్ని ఏ విషయంలో బాధపెడతారో అనే భయంతో బతకడం చాలా కష్టం. ముఖ్యంగా ఇలాంటి కష్టాలు ఆడవాళ్లకే ఎక్కువగా వస్తుంటాయి. ఆడవాళ్లు తమ ఊహల్లోని ఆదర్శ మహిళలా ఉండాలని చాలామంది ఆశిస్తారు. దుస్తులు, చదువు, ఉద్యోగం, పెళ్లి ఇలా ఏ విషయంలో అయినా ఆడవాళ్లు […]
ప్రపంచంలో మనకు నచ్చని విషయాలు చాలా ఉంటాయి. అయితే ఎప్పుడూ ఎవరో ఒకరికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి రావడం అనేది మనం భరించలేని విషయాల్లో ఒకటి. ఎప్పుడూ, ఏదో తప్పుచేసిన భావనతో ఎవరు మనల్ని ఏ విషయంలో బాధపెడతారో అనే భయంతో బతకడం చాలా కష్టం. ముఖ్యంగా ఇలాంటి కష్టాలు ఆడవాళ్లకే ఎక్కువగా వస్తుంటాయి. ఆడవాళ్లు తమ ఊహల్లోని ఆదర్శ మహిళలా ఉండాలని చాలామంది ఆశిస్తారు. దుస్తులు, చదువు, ఉద్యోగం, పెళ్లి ఇలా ఏ విషయంలో అయినా ఆడవాళ్లు తమదైన సొంత ముద్ర చూపిస్తే చాలామంది తట్టుకోలేరు. ఆ కారణంగానే మహిళలు చాలా సందర్భాల్లో ఏ తప్పూ చేయకపోయినా సారీ చెబుతుంటారని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.
తమకు నచ్చినట్టుగా ఉండలేక, నలుగురు మెచ్చేలా రాజీ పడలేక స్త్రీలు నలిగి పోయే మొదటి అంశం దుస్తులు. తమ శరీర ఆకృతి, అందానికి తగినట్టుగా నచ్చిన ఫ్యాషన్ బట్టలు వేసుకోవాలని అనిపించడం సహజమైన విషయం. కానీ ఇందుకు కనిపించని సామాజిక ఆంక్షలు ఉన్నాయి. ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలామంది పెద్దలు అమ్మాయిలు ధరించే దుస్తులే అన్ని అఘాయిత్యా లకు మూలమని సెలవచ్చారు. తమకి నచ్చిన దుస్తులు వేసుకున్నా మనసులో ఏదో ఒక మూల ఆడపిల్లలను అపరాధ భావన వెంటాడుతుంది. కనిపించకుండా అమ్మాయిల ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపే అంశాల్లో ఇది ఒకటి.
కెరీర్ కారణంగా పెళ్లిని వాయిదా వేసినా అమ్మాయిలపై ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ఆడవాళ్లు ఎంత స్థాయికి ఎదిగినా వారి కుటుంబ జీవితాన్ని బట్టి వారి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తుంటారు చాలామంది. ఇది కూడా అధ్యయనాల్లో బయటపడిన విషయమే. అందుకే పాతికేళ్లు దాటినా పెళ్లిని వాయిదా వేస్తుంటే ఆడపిల్ల చాలామందికి సంజాయిషీ చేప్పుకుంటూనే ఉండాలి. ముఖ్యంగా ఆడవారి విలువని శారీరక అందం ఆధారంగానే లెక్కలు వేసే సమాజంలో వయసు పెరుగుతున్న కొద్దీ వారికి సరైన వరుడు దొరకడం కష్టమనే భయం బలంగా ఉంది. ఇక అమ్మాయిలు దాన్ని వదిలేసి ఒక సొంత దృక్పథంతో ముందుకు వెళితే ఏదో తప్పుచేసినట్టు ఫీలవ్వాల్సిందే.
మరో విచిత్రం భర్త కంటే ఎక్కవ సంపాదించే మహిళలు సైతం ఏదో ఒక సందర్భంలో అపరాధభావనకు గురవుతున్నారు. భర్తకంటే కెరీర్ లో విజయవంతంగా ముందుకు వెళ్లే అమ్మాయిలు వారు సహజంగానే ఉన్నా, తలపొగరు, ఇగోయిస్ట్ లాంటి బిరుదులు వచ్చి చేరుతుంటాయి. వారి ఆత్మ విశ్వాసం చాలా సమయాల్లో అహంకారంగా కనబడుతుంటుంది.
ఇక అన్నింటికంటే చిత్రమైన విషయం అమ్మాయి లావుగా ఉంటే దాన్ని పెద్ద సామాజిక సమస్యగానే చూస్తుంటారు. 36-24-36 కొలతలను అందానికి కొలమానంగా తీర్మానించాక ఆ కొలతలను దాటిపోయి బరువున్న అమ్మాయిల్లో ఒక విధమైన అపరాధభావన ఉండితీరుతుంది. ఎవరిచేతిలోనో ఉన్న రిమోట్ కి అనుగుణంగా ఆడే బొమ్మల్లా ఆడవాళ్లు సమాజంలో పాతుకుపోయిన భావజాలానికి ప్రభావితం అవుతున్నారు.
బరువు పెరగడానికి కారణాలు చాలా ఉన్నా అదంతా అమ్మాయి స్వయం కృతాపరాధంలా చూసేవారు ఎందరో. అసలు మనం ప్రాధమిక హక్కులు అనిపెట్టుకున్నాం కానీ…అందులో ఉన్న స్వేచ్ఛ, సమానత్వం, భావ ప్రకటన హక్కు ఇవన్నీ ఆడవాళ్లకు పూర్తిగా అందనే లేదు. మనల్ని బాగా ప్రేమించేవారు మాత్రమే మనం ఎలా ఉన్నా మనల్ని ఆమోదిస్తారు…అది బిడ్డ విషయంలో తల్లికి మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి యాక్సెప్టెన్స్ సమాజం అమ్మాయిలకు ఇవ్వగలుగుతుందా…. అంత ప్రేమ అమ్మాయిలు, మహిళల పట్ల సమాజం చూపించగలదా…ఈ ప్రశ్నలు వేసుకుంటే అపరాధభావనకు గురికావాల్సింది ఆడవాళ్లు కాదు…వారిని అలాంటి భావానికి గురిచేస్తున్నవారే….. ఏమంటారు?