క్లాసులో పాఠాలు...కథలుగా!
డిస్‌లెక్సియా డిజెబిలిటీ ఉన్నా 96శాతం మార్కులు సాధించిన నేమాత్ ఈ ఫొటోలో కనబడుతున్న అమ్మాయి పేరు నేమాత్ మాంగియా. ఢిల్లీకి చెందిన నేమాత్ సిబిఎస్‌సి 12వ తరగతి పరీక్షల్లో 96శాతం మార్కులు సాధించింది. ఈ మార్కులను సాధించడంలో ఆమె మరొక రికార్డుని సైతం సృష్టించింది. నేమాత్ అందరు పిల్లల్లా కాదు. ఆమెకు నేర్చుకోవడం అనే ప్రక్రియ చాలా కష్టసాధ్యమైన విషయం. తారే జమీన్ పర్ అనే సినిమాలో అమీర్‌ఖాన్ ఇలాంటి సమస్య ఉన్న పిల్లవాడి కథను మనసుకి […]
డిస్‌లెక్సియా డిజెబిలిటీ ఉన్నా 96శాతం మార్కులు సాధించిన నేమాత్
ఈ ఫొటోలో కనబడుతున్న అమ్మాయి పేరు నేమాత్ మాంగియా. ఢిల్లీకి చెందిన నేమాత్ సిబిఎస్‌సి 12వ తరగతి పరీక్షల్లో 96శాతం మార్కులు సాధించింది. ఈ మార్కులను సాధించడంలో ఆమె మరొక రికార్డుని సైతం సృష్టించింది. నేమాత్ అందరు పిల్లల్లా కాదు. ఆమెకు నేర్చుకోవడం అనే ప్రక్రియ చాలా కష్టసాధ్యమైన విషయం. తారే జమీన్ పర్ అనే సినిమాలో అమీర్‌ఖాన్ ఇలాంటి సమస్య ఉన్న పిల్లవాడి కథను మనసుకి హత్తుకునేలా చూపారు. అలాంటి సమస్యలను సృష్టించే డిస్‌లెక్సియా అనే డిజెబిలిటీతో నేమాత్ బాధపడుతోంది. అయినా 500లకు 479మార్కులు సాధించింది. జాగ్రఫిలో ఏకంగా నూరుశాతం మార్కులు తెచ్చుకుంది. 11వ తరగతిలో 70శాతం మార్కులు సాధించిన నేమాత్ ఒక్క సంవత్సర కాలంలో ఇంత ముందుకు ఎలా వెళ్లింది. ఇన్ని మార్కులు సాధించడం వెనుక ఉన్న కథను నేమాత్ వివరించింది. ఆమె చెబుతున్న విషయాలు నిజంగానే ఆసక్తికరమైన కథలా ఉన్నాయి.
తనకు పదేపదే చదవడం నచ్చని విషయమని, ఆమే స్వయంగా చెబుతోంది…మరేం చేసింది…క్లాస్‌లో చెప్పిన పాఠాలను, అలాగే ఒకసారి తిరగేసిన పాఠాలను ఆమె తన బుర్రలోకి కథలుగా ఎక్కించుకుంది. వాటిని బయటకు పోకుండా గట్టిగా పట్టుకోగలిగింది. నిరంతరం వాటినే మనసులో మననం చేసుకుంటూ ఉండేదాన్నని, అసలు ఆ పాఠాలు తప్ప మరో ధ్యాస లేకుండా గడిపానని నేమాత్ చెబుతోంది. అంతేకాదు, ఇంటికి వచ్చిన తరువాత స్కూల్లో చదివిన పాఠాలను కథలుకథలుగా తన అమ్మమ్మకు చెబుతుండేది. ఆమె తన పాఠాలను చాలా శ్రద్ధగా వింటూ ఉండేదని, ఆ సమయాల్లో తాను టీచర్‌గా అమ్మమ్మ విద్యార్థినిగా కూడా అనిపించేదని నేమాత్ అంటోంది. అంతేకాదు, పాఠాలను రంగురంగుల కథలుగా ఊహించేంది. చార్టులు, మార్కర్లు తీసుకుని వాటిని బొమ్మల కథలుగా మలచుకునేది. తన ఊహాశక్తితో పాఠ్యాంశాలను సరికొత్తగా చూసేది. ఇవన్నీ కాకుండా ఆమెకు శిక్షణనిచ్చిన ఉపాధ్యాయులకు సైతం ఈ క్రెడిట్ వెళుతుంది. మూడేళ్ల వయసులోనే నేమాత్‌కి ఉన్న సమస్యని గుర్తించిన తల్లిదండ్రులు ఆమెకు తగిన విధంగా బోధించే స్కూల్లో చేర్చారు. అక్కడ తనకున్నసమస్య ఒక్క క్షణం కూడా గుర్తురానంతగా టీచర్లు తనను లక్ష్యం దిశగా ప్రోత్సహించారని నేమాత్ చెబుతోంది. రెండురోజులకు ఒకసారి చొప్పున స్కూల్లో అనేక టెస్టులు రాయడం, ఒక్కోక్క చాప్టర్‌కి ఐదుసార్లు నోట్సు రాయడం తనకు ప్లస్ అయిందని అంటోంది. తన ఊహాశక్తిని తన భవిష్యత్తుకోసం వినియోగించుకునేందుకు ఈ అమ్మాయి సిద్ధపడుతోంది. దేశంలోనే ఫైన్ ఆర్ట్స్ లో టాప్ స్థాయి విద్యా సంస్థల్లో శిక్షణపొంది, పెయింటర్‌గా రాణించాలని నేమాత్ కలలు కంటోంది. తన ఆశలు నేరవేర్చుకునే శక్తి ఆమెకు ఉంది కనున భవిష్యత్తులో దేశానికి ఒక మంచి చిత్రకారిణి లభిస్తుందని ఆశిద్దాం.