టీడీపీ గుర్తు మారుతుందా?

తెలుగుదేశం పార్టీ గుర్తు మారుతుందా?  రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఇప్పుడు న‌డుస్తున్న చ‌ర్చ ఇది. ప్ర‌స్త‌తం హైద‌రాబాద్‌లోని గండిపేట‌లో మ‌హానాడుకు అంతా సిద్ధ‌మైంది. ఇదే వేదిక‌పై నుంచి టీడీపీని జాతీయ పార్టీగా ప్ర‌క‌టించే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. రెండు రాష్ర్టాలు ఏర్ప‌డి ఏడాది కావ‌స్తోంది. జాతీయ పార్టీగా ప్ర‌క‌టించ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం అని ఆ పార్టీ పెద్ద‌లు భావిస్తున్నార‌ట‌.  రెండు రాష్ర్టాల్లోనూ మంచి పోలింగ్ శాతం న‌మోదు చేసిన పార్టీగా ఇప్ప‌టికే గుర్తింపు సాధించింది. ఇరు రాష్ట్రాల నుంచి […]

Advertisement
Update:2015-05-27 05:21 IST
తెలుగుదేశం పార్టీ గుర్తు మారుతుందా? రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఇప్పుడు న‌డుస్తున్న చ‌ర్చ ఇది. ప్ర‌స్త‌తం హైద‌రాబాద్‌లోని గండిపేట‌లో మ‌హానాడుకు అంతా సిద్ధ‌మైంది. ఇదే వేదిక‌పై నుంచి టీడీపీని జాతీయ పార్టీగా ప్ర‌క‌టించే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. రెండు రాష్ర్టాలు ఏర్ప‌డి ఏడాది కావ‌స్తోంది. జాతీయ పార్టీగా ప్ర‌క‌టించ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం అని ఆ పార్టీ పెద్ద‌లు భావిస్తున్నార‌ట‌. రెండు రాష్ర్టాల్లోనూ మంచి పోలింగ్ శాతం న‌మోదు చేసిన పార్టీగా ఇప్ప‌టికే గుర్తింపు సాధించింది. ఇరు రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లు గెలుచుకుంది. జాతీయ పార్టీకి ఉండాల్సిన అర్హ‌త‌ల‌న్నీ సాధించింద‌ని ఆ పార్టీ నేత‌లు ధీమాగా చెబుతున్నారు. ఇలా ప్ర‌క‌టించి ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై మాన‌సికంగా పై చేయి, సొంత కార్య‌క‌ర్త‌ల్లో మ‌నోస్థైర్యం నింపాల‌న్న‌ది బాబు వ్యూహ‌మ‌ని చెబుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీ జెండాలోనూ కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయ‌ని చెబుతున్నారు. ఈ బాధ్య‌త‌ల‌న్నీ చంద్ర‌బాబు కుమారుడు లోకేశ్‌కు అప్ప‌గించార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
జాతీయ పార్టీకి కావాల్సిన అర్హ‌తలు ఉన్నాయా?..
ప్ర‌స్తుతం దేశంలో 6 పార్టీల‌ను ఎన్నిక‌ల సంఘం జాతీయ పార్టీలుగా గుర్తించింది. ఈసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీగా ఆవిర్భ‌వించాలంటే.. క‌నీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపుపార్టీగా అవ‌త‌రించాలి. నాలుగు రాష్ర్టాల నుంచి సార్వ‌త్రిక అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో క‌నీసం 6 శాతం ఓట్లు సాధించాలి. క‌నీసం3 రాష్ర్టాల నుంచి 11 లోక్‌స‌భ సీట్లు గెలిచి ఉండాలి. మ‌రి ఈ నిబంధ‌న‌ల ప్ర‌కారం టీడీపీని జాతీయ పార్టీగా ఎలా ప్ర‌క‌టిస్తారు? అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఆ.. ప్ర‌క‌టించ‌గానే స‌రిపోతుందా ఈసీ గుర్తించాలి క‌దా? అని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. క‌నీసం 3 రాష్ట్రాల్లో పోటీ చేయాల‌న్న నిబంధ‌న ఉంది. కాబ‌ట్టి అందుకోసం టీడీపీ నేత‌లు తెలుగువారు ఎక్కువ‌గా ఉండే పొరుగు రాష్ర్టాలపై దృష్టి పెట్టే అవ‌కాశాలు తోసిపుచ్చ‌లేం. పుదుచ్చేరిలోని యానాం, త‌మిళ‌నాడులోని చెన్నై, రాయ‌గ‌ఢ (ఒడిశా)లోనూ పోటీ చేస్తే కొద్దోగొప్పో ఓట్లు సాధించే అవ‌కాశాలు లేక‌పోలేదు. కానీ, త‌మిళుల ప్రాబ‌ల్యం అధికంగా ఉన్న ఆ రెండు రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు సాధిస్తుందా? లేదా అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేం.
సైకిల్ స్థానంలో ఏం గుర్తు ఉండ‌నుంది..?
ఒక‌వేళ జాతీయ పార్టీగా ప్ర‌క‌టించాల్సి వ‌స్తే సైకిల్‌ గుర్తుతో ఎన్నిక‌ల‌కు వెళ్ల‌లేరు. ఇప్ప‌టి దాకా టీడీపీ ప్రాంతీయ పార్టీ. దీని ఎన్నిక‌ల చిహ్నం సైకిల్‌. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని సమాజ్‌వాదీది కూడా ఇదే గుర్తు. ఒక‌వేళ జాతీయ పార్టీగా టీడీపీ ఆవిర్భ‌విస్తే స‌మాజ్‌వాదీ పార్టీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసే అవ‌కాశాలు మెండు. ఇవ‌న్నీ టీడీపీ నేత‌ల‌కు తెలియ‌నివి కావు. ఒక‌వేళ ప్ర‌త్యామ్నాయం ఎంచుకోవాల్సి వ‌స్తే.. ఏ గుర్తు ఎంచుకుంటార‌న్న‌ది రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తి రేపుతోంది. అయితే, దీనికి ఇంకా టైముంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగేళ్ల స‌మయం ఉంది. ఆలోగా తెలుగువారు నివ‌సించే, యానాం (పుదుచ్చేరి), చెన్నై (త‌మిళ‌నాడు), రాయ‌గ‌డ (ఒరిస్సా)లో ముందు పార్టీని విస్త‌రించాలి. అక్క‌డ పోటీ చేసే తెలుగువారు దొర‌కాలి. దీనికి చాలా వ్య‌వ‌హారం ఉంది. దీనిపై ఇప్ప‌ట్లో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం లేదు.
Tags:    
Advertisement

Similar News